Thursday 31 December, 2009

సెప్టెంబరు నెలలో ఈమాటలో వచ్చిన నా కవిత దానిపై అభిప్రాయాలు _కొద్ది మార్పులతో

జమ్మిబంగారం చెట్టు
సెప్టెంబర్ 2009 » కవితలు http://www.eemaata.com/em/issues/200909/1477.html
రచన : జాన్ హైడ్ కనుమూరి

గడియారం ముల్లుపట్టి తిప్పినట్టు
కాలాన్ని ముందుకో వెనక్కో తిప్పలేం
నడుస్తూ నడుస్తూ
అనుభవాలను ఆయుధాలుగా
జమ్మిచెట్టుపై దాచి తిరగాలి
అరణ్యవాసమైనా
అజ్ఞాతవాసమైనా
జనవాసమైనా

రావణుడి ప్రాణం
నాభిలో దాగున్నట్టు
సంసోను బలమంతా
తలవెంట్రుకల్లో దాగున్నట్టు
దాచుకునే రహస్యంగా పదిలపర్చుకోవాలి
జమ్మిచెట్టయిపోయి బ్రతకగలగాలి

నిర్వీర్యం చేయడానికి
విభీషణుడో, దెలీలాయో
పథకాన్ని రచిస్తుంటారు
అమ్మివేయాలని
ఏ ఇస్కరియోతు యూదాయో
ముద్దివ్వడానికి సిద్ధంగా వుంటాడు

భూమిలో దిగబడుతున్న
కర్ణుడి రథచక్రంలా
నడుస్తున్న కాళ్ళు దిగబడిపోతుంటాయి

అంబులపొదిలో అస్త్రాలేవీ
అక్కరకురానట్టే
సమస్యలు బాణాలై సంధిస్తాయి

జయించామా! ఓడిపోయామా!
బతికున్నపుడు అదే
అసలు ప్రశ్న ఔతుంది
ఒంటరిగా ఎవరి జమ్మిచెట్టుకోసం వాళ్ళు
ఆత్రపడుతుంటారు

నడిచే కాళ్ళకు అడుగులు భారం కాదు
వేగం మార్పు అంతే! నల్గురితో కల్సి నడవటం
అంతిమ యాత్రగా
మోసుకెళ్ళే నల్గురివెనుక
రాల్తున్న జమ్మిని
బంగారంగా ఏరుకుంటున్నవాళ్ళంతా
ఒక్కో జమ్మిచెట్టౌతారు.
 
(15 అభిప్రాయాలు) మీ అభిప్రాయం తెలియచేయండి »

1. అపూర్వ అభిప్రాయం: September 2, 2009 9:13 am
విభీషణుడు రహస్యాన్ని చెప్పిన సందర్భం ఏమైనా
దెలీలా ..రహస్యం తెలుకోవడానికి ఏ పరిస్థితుల్లో నియమింపబడినా

అత్యంత రహస్యాన్ని బయటుకు లాగడం కీలకం
ప్రతీకలు చాలా బాగున్నాయి

అభినందనలు
2. Venkat అభిప్రాయం: September 5, 2009 6:46 am
రాజశేఖర్ రెడ్డి ఉదంతానికి సరిగ్గా సరిపోయిందా?? లేక ముందుగానే ఊహించారా???
3. jwalitha అభిప్రాయం: September 5, 2009 10:06 pm

బంగారంగా ఏరుకుంటున్నవాళ్ళంతా
ఒక్కో జమ్మిచెట్టౌతారు.
ఆశ బాగున్నది.. అవసరమున్నది
4. బొల్లోజు బాబా అభిప్రాయం: September 6, 2009 1:19 pm

జాన్ హైడ్ గారికి
మీ శైలికి భిన్నంగా వినిపిస్తూందీ కవిత. భిన్న మతాల చిహ్నాల సమ్మేళన కనపడుతూంది. ఆ మేళవింపూ సమర్థవంతంగా జరిగింది. ఈ కోణంలోంచి మీనుంచి మరిన్ని కవితల్ని ఆశిస్తున్నాను. కవితలోని కొన్ని పదచిత్రాలు లోతుగా ఉండి కవితకు గాఢతను చేకూర్చాయి. మంచి కవితను అందించారు.

బొల్లోజు బాబా
5. ఈగ హనుమాన్ అభిప్రాయం: September 8, 2009 1:40 am

“అనుభవాలను ఆయుధాలుగా
జమ్మిచెట్టుపై దాచి తిరగాలి
అరణ్యవాసమైనా
అజ్ఞాతవాసమైనా
జనవాసమైనా..”

మేరా జాన్,
ఇది మీ లోని కవిత్వ ప్రతిభకు నిదర్శనం.
ఈగ హనుమాన్, nanolu.blogspot.com
6. విజయ అభిప్రాయం: September 9, 2009 10:33 am

జమ్మిచెట్టును పూజచేసి
దాని ఆకులను బంగారమని చెబుతూ దశరా రోజున బంధువులను, మిత్రులను కలవటం ఆనవాయితీ.
రకరకాల సమస్యల మద్య ఓ జమ్మి చెట్టుగా నిలబడగలిగితే
జన్మకు అంతకంటే సార్థకత ఏముంటుంది.
కానీ అది అంత సులభమేనా??
దశరా శుభాకాంక్షలు
విజయ
7. ఉష అభిప్రాయం: September 12, 2009 2:19 am

ఇన్నాళ్ళుగా చూసాను. మీ కలం నుండి క్రొత్త కవిత రావటం నిజంగా ముదావహం. సమ్మేళనం బాగుంది.
“జయించామా! ఓడిపోయామా!
బతికున్నపుడు అదే
అసలు ప్రశ్న ఔతుంది”
ఆ ప్రశ్ననుండి పూర్తి విశ్వాసంతో వెలికి రాని సమాధానం నుండే మరో ప్రశ్న వరకు నడక సాగుతుంది. జమ్మిచెట్టు ఎంత బాగా వాడారీ కవితలో.
8. డా. దార్ల అభిప్రాయం: September 14, 2009 1:09 am

మీ కవిత బాగుంది. కానీ కవిత వచనంలో ఉన్నా విధిని నమ్మే ప్రయత్నం ప్రాచీన భావనగానే కొనసాగుతుంది.
మనిషి అస్తిత్త్వ ఊగిసలాట మీ కవితలో కనిపిస్తుంది.
9. అపూర్వ అభిప్రాయం: September 15, 2009 12:33 am

“నిర్వీర్యం చేయడానికి
విభీషణుడో, దెలీలాయో
పథకాన్ని రచిస్తుంటారు”
దీని తర్వాత
“అమ్మివేయాలని
ఏ ఇస్కరియోతు యూదాయో
ముద్దివ్వడానికి సిద్ధంగా వుంటాడు”
చేరిస్తే బాగుంటుందేమో చూడండి.
10. జాన్ హైడ్ కనుమూరి అభిప్రాయం: September 16, 2009 12:33 am

అపూర్వ గారు,
మీ సూచన నాకు బాగా అన్పించింది. ఇక్కడ చేర్చడం అనేది సంపాదకుల ఇష్టము. కానీ, నేను ఇంకెక్కడైనా ప్రచురించినప్పుడు ఈ పాదాలను తప్పక చేరుస్తాను.
ధన్యవాదములు
జాన్ హైడ్ కనుమూరి
11. మనోజ్ అభిప్రాయం: September 16, 2009 5:13 am

ఎంచుకున్న మార్గాలలో నిరంతరంగా సాగిపోవాల్సిందే. జయమైన అపజయమైన కాలం నిర్ణయించాల్సిందే. అది విధయిన కాకపోయిన.
12. v v b rama rao అభిప్రాయం: September 16, 2009 5:46 am

మీ కవిత బాగుంది.
ప్రాచీనభావం మంచిదైనప్పుడు ప్రాచీనమని వదులుకోనక్కర లేదు.
వీ వీ బీ రామా రావు
13. శృతి అభిప్రాయం: September 18, 2009 12:43 am

మీరు వుదహరించిన
…విభీషణుడు
…దెలీలా
అపూర్వ సూచించిన
…ఇస్కరియోతు యూదా

సమన్వయాన్ని కొచెం వివరిస్తారా??

శృతి
14. జాన్ హైడ్ కనుమూరి అభిప్రాయం: September 26, 2009 1:53 am

రామాయణంలోని పాత్రలు:
విభీషణుడు రావణుని సహోదరుడు. రావణుని ప్రాణాధారము నాభిలో వుందన్న రహస్యాన్ని తెలిసిన వాడు. పరిస్థితులు, ధర్మాధర్మాలు ప్రక్కన పెట్టి “రావణునికి శత్రువైన రాముని శిబిరంలో విభీషణుడు చేరకుంటే” అని ఆలోచిస్తే రావణుడు ఓడిపోయే అవకాశాలు లేవు. రామాయణ కథ ముగింపు మరోలా వూహించలేము కదా!
అలాగే మన జీవితాన్ని, జీవిత లక్ష్యాలను నిర్వీర్యం చేయడానికి సొంత రక్తసంబందీకులే శత్రుశిబిరంలోకి చేరి మన రహస్యాలను బయటపెట్టి మన బలహీనతలపై దెబ్బతీయవచ్చు.
బైబిలులోని పాత్రలు :
సంసోను దేవుని అనుగ్రహంతో బలవంతుడుగా పుడతాడు. అతని బలం అతనికి నిరంతరం వుండాలంటే తలవెంట్రుకలను కత్తిరించకూడదు, మరియు ఈ రహస్యాన్ని ఎవ్వరికి చెప్పకూడదు. సంసోను చేతిలో అనేక మార్లు అవమానం పొంది ఓడిపోయిన వారు ఎలాగైనా అతనిని హతమార్చాలని సమయంకోసం ఎదురుచూసారు. అందులో భాగంగా అతని బలహీనతలను కనిపెట్టి, అతనికున్న స్త్రీ వ్యామోహానికి ఎరగా “దెలీలా” అనే స్త్రీని నియమించారు. అతడు అమెను మోహించి ఆమె మత్తులో పడ్డాడు. ఆమె తొలిప్రయత్నంలోనే అతని రహస్యాన్ని తెలుసుకోలేకపోయినా, ప్రయత్నిస్తూ వచ్చి చివరకు తెలుకోగలిగింది.
తన దేవరహస్యాన్ని పదే పదే అడుగుతున్నప్పుడు “ఇలా ఎందుకు అడుగుతుంది, ఈ రహస్యాన్ని ఎవరికి చెప్పకూడదు కదా” అని సంసోను అలోచించివుంటే ముగింపు వేరేలా వుండేది.
అలాగే మన జీవితాన్ని, జీవిత లక్ష్యాలను నిర్వీర్యం చేయడానికి మన బలహీనతల ఆధారంగా శత్రుశిబిరంలోని వారు దగ్గరకుచేరి మన రహస్యాలను తెలిసికొని, మనబలహీనతలపై దెబ్బతీయడానికి నియమింపబడతారు.

బైబిలులోని మరో పాత్ర:

యేసుకువున్న పన్నెండుగురు శిష్యులలో ఇస్కరియోతు యూదా ఒకడు. యేసు తన బోధనలలో ఒక రాజ్యాన్ని స్థాపిస్థానని చెపుతూ వచ్చాడు. అలాంటి రాజ్యము వస్తే తనకు కలిగే హోదాగురించి ఎప్పుడు ఆలోచనతో వుండేవాడు యూదా.
మత పెద్దలు యేసును బంధించాలని ఆలోచనలు చేస్తున్నప్పుడు, యేసు ఎక్కడవుంటాడో, చీకటిలో అతనిని గుర్తించగలిగే రహస్యం కాసులకొరకు ఆమ్మివేసాడు.
నేను ఎవరినైతే ముద్దుపెట్టుకుంటానో అతడె యేసు అని వారికి ఒక సంకేతాన్ని ఇస్తాడు. బహుశ మనం ఇప్పటి కాలంలో మాట్లాడుకునే “కోవర్టు” పని చేసాడు.

కాలం ఏదైనా ఇలాంటి వాళ్ళు ఎదురౌతారు.
వారి పట్ల అప్రత్తమంగా వుండగలగటం, పాత ప్రతీకలనుండి కొత్తవిధానాలను నేర్చుకోవడం ఎంతైనా అవసరం.
15. abhisapthudu అభిప్రాయం: September 29, 2009 9:05 am

It is a very good poem. Using mythical allusions in modern context is a tough job. Yoyusuccessfully done it with your prowess and with your diction.
You once again proved with your poem that mythology has been an inexhaustible source of artistic inspiration since the stories comprised therein were first told.
so nicely extracted.

Friday 27 November, 2009

నీవు... నేను... ఒక ఏకాంతం

నీవొచ్చేలోగా
నా వూహ
మబ్బుల పల్లకినెక్కి ఊరేగుతోంది

మనసు చేసే తొందర సవ్వడితో
మేనంతా పులకిస్తుంటే
ఇరుగు పొరుగు
బుగ్గలేం కెంపులయ్యాయని
పదే పదే నిలదీస్తున్నారు

చేతిన పండిన గోరింట
కొత్తరంగేదో మనసుకు పులిమింది

ఏ దుస్తులు ధరిస్తే
నీకందంగా కనిపిస్తానో తేల్చుకోలేక
ఉన్నవన్నీ చిందరవందరయ్యాయి

గుమ్మాలకు వేల్లాడే
పరదాల్లాంటి ఆంక్షల చూపులను తోసుకుంటూ
నీకోసం ఉద్యానవనంలో నిరీక్షిస్తున్నప్పుడు
నిశ్శబ్ద మైదాన పరిసరాల్లో
నా గుండె
శబ్దపు పరుగును పెంచుతుంటే
మిణుగురు చెస్తున్న ప్రేమకాంతిలో
పికిలిపిట్టల గానమౌతోంది

నీవొచ్చేలోగా
ఈగదినలంకరించాలని
తెచ్చిన పూలగుత్తులన్నీ
ఆత్రంలో అలసిన నన్నుచూసి
దిగాలుగా చూస్తున్నాయి

తీరా నీవొచ్చేసరికి
జిడ్డోడుతున్న మొహంతో
చెదిరిన కురులతో
నలిగిన వస్త్రాలతో
ఇక్కడే ఇలానే
నిలచేవున్నాను సుమా!

ఇలాక్కూడా అందంగావుంటావనే
నీ మాట
నన్నింకా గిలిగింతలు పెడ్తూనేవుంది.

Tuesday 22 September, 2009

ఎంత చిత్రం! ఎంత విచిత్రం!


దావాలనంలా
వార్తవ్యాపించిన వేళ
జనం
ప్రవాహమవ్వడం!

హృదయాలను తాకిన
కన్నీటి సంద్రం
వెల్లువవ్వడం
ఎంత యాదృశ్చికం!

రెప్పతెరిచేలోగా
కనుమరుగైన
ఒక వయనం
నిఘూఢ రహస్యమై మిగలడం!

మృత్యువిచ్చిన
తొలిముద్దు
కౄరమై కనిపించడం
ఎంత వికృతం!

జన హృదయాన్ని
పోరాటగమనాన్ని
గెలిచిన గ్లాడియేటార్
రాజశేఖరుడు
నెత్తురోడిన శకలమవ్వడం
ఎంత శోచనీయం!

మెరిసే తారలకాంతిలో
క్రాంతి పథమై
సామాన్యునికి ఆరోగ్యం శ్రీ కారం చుట్టి
చరిత్ర కూడలిలో
వెలుగురేఖవ్వడం
ఎంత చిత్రం! ఎంత విచిత్రం!

Friday 18 September, 2009

చెక్కుకొనే నవ్వు

నిన్నటి నవ్వు
నేటిదాకా దాచుకోలేను
నిన్నటి దుఖాన్ని నేటిదాకా మోయలేను
నువ్వు మారుతున్నట్టే
నేను మారుతున్నట్టే
కనులేవో మురిపిస్తుంటాయి

నీటి అలలపై తేలియాడుతున్నట్టు
చూపులు పడవలై సాగిపోతాయి
చెక్కుకుంటున్న శిల్పాలన్నీ
వెక్కిరిస్తుంటాయి

ఏ ఒక్కటీ
నిలువలేని నిజాన్నేదీ వొలకబోయదు

రెప్పలార్పని కళ్ళలో
జీవంలేని కిరణాలు ప్రసరిస్తుంటాయి

జారుకుంటున్న నిశ్శబ్దంలోకి
మెల్లగా లాక్కుపోతుంది

మళ్ళీ ఏదో నవ్వు చెక్కుకుంటూ
ముఖంపై పులుముకొని
మార్చుకుంటూ పాడుతుంటాను.

http://prajakala.org/mag/2009/08/chevvu_kone_navvu

Wednesday 12 August, 2009

ఆమె నేను - రెండు దృశ్యాలు

దృశ్యం-1

మొదటిసారి
ఆమెను కలసినప్పుడు
నీటి చెలమనుకున్నాను
సంవత్సరాలుగా
తోడిన నీటిలో
మునిగిన చెరువయ్యాను.


దృశ్యం-2

ఓ సాయంకాలం
గోదారి ఇసుకతెన్నెలపై
ఆమెను కలిసాను
పరిచయాలు స్నేహం ఇష్టం
ప్రేమగా మారాయి

సంవత్సరాల తర్వాత
అదే గోదారి
అదే ఇసుక
నడుస్తూ గడిచిపోయిన గతంలో
ఆమె నదిగా మారిపోయింది

నేనే
చెలమగా చూస్తుండిపోయా!

Tuesday 17 March, 2009

నా కవిత్వం - కవిత్వాలాపన - ౨


కొవ్వూరు పశివేదల మద్య
నిరంతర సమాంతర రేఖాపట్టాలను కలుపుతున్న
కొంగలబాడవ వంతెన
రైల్వేకమ్మీ భుజాలు దాటిన లేతపాదాలు ...నా కవిత్వం

ఎదుగుతున్న బాల్యంనుంచి
ఆటవిడుపుల చెలిమిరెక్కలు విప్పుకుంటూ
ఆడుకున్న ఏడుపెంకులాట బంతి ... నా కవిత్వం

సంవత్సరాంతర పరీక్షలకోసం
క్వార్టర్ నంబరు ఐదు వాకిట్లో
పెద్దలాంతరో, పెట్రోమాక్సు లైటో వెదజల్లే కాంతికి
చేరిన పిల్లల చదువుల కోలాహలం ... నా కవిత్వం

పెరటిలోచి సర్రున పాకి
వీధిలోకి తొంగిచూసి
బావి అంచు పగుళ్ళలో దాక్కొని
నీళ్ళకొచ్చినవారిని భయపెట్తిన తాచును
ఒక్కవుదుటన చంపి భయాన్నితీర్చిన క్షణాలు ... కవిత్వం

హైస్కూల్లో ఎదుగుతున్న పడచుల
ప్రేమలేఖల పరిమళాలు
పుట్బాలు కబడ్డీలు వాలీబాలు
పోటీలతో సీనియర్స్
స్పూర్తినిచ్చే చెమటచుక్కలు ... నా కవిత్వం

గోదారి ఈతలు
అలల గలగలలు
జలరివలలు
ఇసుకతెన్నెల పరుగులు కుస్తీలు
నిర్ణీత సమయ సంకేతాల ప్రేమజంటలు
వేళను గోధూళి చేసే పశువులు
చూస్తూ చూస్తూనే జారిపోతున్న పొద్దులో
భాను థియేటరునుంచి వినిపించిన
ప్రార్థనా గీతపు గ్రాంఫోను రికార్డు ... నా కవిత్వం
.... ఇంకావుంది

Friday 13 March, 2009

నా కవిత్వం- కవిత్వాలాపన


బాల్యంలో
బడిలోనో, అరుగుపైనో
అక్షరాలు దిద్దినప్పటి నేస్తం
పట్టిసీమ శివరాత్రి తిరునాళ్ళలో
తప్పిపోయిన 'బిక్కి' బక్కపిల్ల …. నా కవిత్వం

చలిరాత్రుల్లో
గువ్వపిల్లలా ముడుచుకొని
వెచ్చదనపు మంగవడిలో
రాకుమారుల సాహసాలకు
ఊకొట్టిన కథల సవ్వడి …. నా కవిత్వం

వెలుగుల్లేని వాడల్లోకి
కాలినడకన గడప గడపను దర్శించి
మండే చితుకుల వెలుగుల్లో
అక్షరాలను, వాక్యాలను
వెదజల్లిన బోధకురాలు
రత్నమ్మ బైబిలుసంచి …. నా కవిత్వం

నవరాత్రుల సంబరాల్లో
పల్లెగుండెల్లో తడిపొడి చిందుల్లో
ఉర్రూతల కేరింతల చిందేయించిన
వీరాస్వామి డప్పు వాద్య
చిర్రా చిటికిన పుల్లా …. నా కవిత్వం

సుబ్రమన్యుని తిరునాళ్ళలో
గమ్మత్తైన లాజిక్కుతో
ఒకటికి మూడంటూ బొమ్మలజూదం
కనికట్టో మేజిక్కో
పాములనో మనుషులనో ఆడించి
విసిరే మంత్రించిన తాయత్తు …. నా కవిత్వం

అక్కకోరిన కోర్కె
తీర్చలేనిది కాదంటూ
కుక్కలున్న వీధినిదాటి
ఎండవేళను మరచి
స్కూలు వెనకున్న ముళ్ళపొదొంచి
కోసుకొచ్చిన గొబ్బిపూలు …. నా కవిత్వం

గట్టు డొంకల్లోని కాకరకాయలు
కొండ దిగువలో వాక్కాయలు
చింతతోపుల్లో చింతకాయలు
తూముల కెదురెక్కిన చేపలు
చిటారు కొమ్మనో
తూము ప్రవాహాన్నో
వడిసిపట్టుకున్న గుప్పిట వేళ్ళు …. నా కవిత్వం

ఆజానుబాహుడు
వాచక నటనావైదుష్యంతో
సహజకవచకుండలాల కర్ణుణ్ణి
అవలోకగా సాక్షాత్కరింపచేసిన
క్రిష్ణమూర్తి(జడ్జి) కొట్టిన చప్పట్లధ్వని …. నా కవిత్వం


....ఇంకావుంది

Saturday 10 January, 2009

అంకురాల ఎదురుచూపు ...(శ్రీ మద్దూరి నాగేష్ బాబు స్మరణలో )

నిన్ను కలిసిందీ లేదు
నీతో మాట్లాడిందీ లేదు
పరిచయాల జ్ఞపకాలేవీ లేవు
ఎన్నో ఏండ్ల నిరీక్షణను
పూలదారంలా అల్లి మోసుకొచ్చి
కుదురులా అక్షరానికి చుట్టి
ఎదకు గురిపెట్టి పోయావు
అక్షరగురి నన్ను చుట్టి
నీకాలపు కొలమానంలోకి లాక్కెళుతున్నాయి
నాకాలంలో నిలుపుతున్నాయి
నాకేందుకు కలవలేదు?
అయినా...
డిజిటల్ డిజిటల్ సింఫనీలను
నీ అక్షరంలో వదిలిపోయావు
స్వరించని నా కంఠంలో
కీబోర్డును స్పర్సించలేని నావేలికొనల్లో
ఏదో విద్యుత్ ప్రవాహం
ఇది కొత్త రాగానికి నాందోయి
ఆశలవిత్తనాలకు పొడుచుకొస్తున్న అంకురమోయి
నేస్తం మళ్ళీ రా!
ఎన్నో విత్తనాలు పడివున్నయి
అంకురాలకోసం

జనారణ్యాన్ని ఛేదించుకుంటూ
మైదానాలను విభేదించుకుంటూ రా!

ఎర్రని సూర్యున్ని పుచ్చకాయలా కోస్తా
గొంతు చల్లబరుచుకుందాం

వెలుగురేఖల్ని గుత్తులుగా కోసుకొస్తా
తురుముకుందాం

మరోపూలవనాన్ని స్వప్నిద్దాం

ఏ సాతాను చొరబడని
ఏదేను వనాన్ని పెంచుదాం

(శ్రీ మద్దూరి నాగేష్ బాబు స్మరణలో )