Friday 27 November, 2009

నీవు... నేను... ఒక ఏకాంతం

నీవొచ్చేలోగా
నా వూహ
మబ్బుల పల్లకినెక్కి ఊరేగుతోంది

మనసు చేసే తొందర సవ్వడితో
మేనంతా పులకిస్తుంటే
ఇరుగు పొరుగు
బుగ్గలేం కెంపులయ్యాయని
పదే పదే నిలదీస్తున్నారు

చేతిన పండిన గోరింట
కొత్తరంగేదో మనసుకు పులిమింది

ఏ దుస్తులు ధరిస్తే
నీకందంగా కనిపిస్తానో తేల్చుకోలేక
ఉన్నవన్నీ చిందరవందరయ్యాయి

గుమ్మాలకు వేల్లాడే
పరదాల్లాంటి ఆంక్షల చూపులను తోసుకుంటూ
నీకోసం ఉద్యానవనంలో నిరీక్షిస్తున్నప్పుడు
నిశ్శబ్ద మైదాన పరిసరాల్లో
నా గుండె
శబ్దపు పరుగును పెంచుతుంటే
మిణుగురు చెస్తున్న ప్రేమకాంతిలో
పికిలిపిట్టల గానమౌతోంది

నీవొచ్చేలోగా
ఈగదినలంకరించాలని
తెచ్చిన పూలగుత్తులన్నీ
ఆత్రంలో అలసిన నన్నుచూసి
దిగాలుగా చూస్తున్నాయి

తీరా నీవొచ్చేసరికి
జిడ్డోడుతున్న మొహంతో
చెదిరిన కురులతో
నలిగిన వస్త్రాలతో
ఇక్కడే ఇలానే
నిలచేవున్నాను సుమా!

ఇలాక్కూడా అందంగావుంటావనే
నీ మాట
నన్నింకా గిలిగింతలు పెడ్తూనేవుంది.