Saturday 11 February, 2012

నీలా వుండటం ఇష్టం


నీలా వుండటం ఇష్టం
ఇష్టాన్ని ప్రేమగా మలచలేని వాణ్ణి

నీవు పలికిన మాటలు నిజరూపం దాలుస్తుంటే
నీ హస్తం క్రింద అభయమేదో వెదకుతున్న జనం
మురికి పట్టిన జీవితాల్లోకి నడుస్తున తీరు
ఇంకా ఎన్నో.....

నీలా వుండటం ఇష్టం

నన్ను నేను ప్రేమించుకుంటూ
నిన్ను వెదకుతుంటాను
చిరునామా చెప్పగలిగినవాణ్ణి  తోసుకుంటూ పోతుంటాను
నువ్వు నా ప్రక్కనే వున్నా గుర్తించలేని వాణ్ణి
నిన్ను గురించి గొప్పగా స్నేహితులకు చెబుతుంటాను

ప్రేమ పంచలేని వాణ్ణి
ప్రేమని నిరంతరం వల్లిస్తుంటాను

నీదగ్గరన్నది ఏదో మంత్రదండమని
దానికోసం వెర్రిగా వెదకుతుంటాను
దానికోసం నీవుచేసే సాధన నాకు గుర్తురానేరాదు!

పాలలాంటి మనసులో కనిపించని వెన్నవు నీవు
తోడుపెట్టని పాలతో చిలకడం కోసం అవస్థపడుతుంటాను.

నా దేహాన్ని నేను దర్శించడంకోసం వస్త్రాలనెత్తుకెళతావు
నాదేదో పోయిందని దిక్కులు పిక్కటిల్లేలా ఏడుస్తుంటాను
సిగ్గుగుర్తొచ్చి ఎక్కడైనా దాక్కోవాలని చూస్తాను

నీలా వుండటం ఇష్టం

నీలా మారాలని అవస్థలు పడుతుంటాను

Tuesday 7 February, 2012

కాంక్ష తీరిందో లేదో?



పెదవులకు
ముద్దు కాంక్ష ఎప్పుడు మొదలయ్యింది?

పాఠం చెబుతున్న పెదవులపై
రెప్పలార్పని కాంక్ష

నడకలౌతున్న శరీరం
తరగతి గదులు మారినట్టు
పరీక్షలకోసం చదువుతున్న పెదవులు
లాంతరువెలుగులో తళుక్కుమన్న కాంక్ష

ఊహ రెక్కవిప్పి అక్షారలై చేరిన
తొలి లేఖను
పదే పదే చుంబిస్తున్న పెదవులు
యవ్వనపు గిలిగింతలెట్టిన కాంక్ష

హఠాత్తుగా తగిలిన స్పర్శకు...
కాకతాళీయంగా కళ్ళబడిన నగ్నదేహానికీ...
అదిరిన పెదవుల కాంక్ష

పాలగ్లాసు ఎంగిలిపెదవులు
మరోపెదవుల్ని కప్పుకున్నాయి

కాంక్ష గుండెలో
గుట్టుచప్పుడు కాకుండా దాక్కుంది
కరుణొలికించే మరోపెదవికెలా తెలుస్తుంది?

నెమరువేస్తున్న పెదవులపై
కొత్త చిగురు తొడిగింది
-------------------------------------
చాలారోజుల తర్వాత అక్షరాలు పెనవేసుకున్నాయి
28.01.2012 20.35 hours