Tuesday 19 August, 2014

ప్రయాణం


నీవు నేనూ 
ఎప్పుడో కలిసాం అంతే!

తోపుల వెంబడి, బోదుల వెంబడి
 
చెరోమూల నాటబడ్డాక
ప్రయాణించడం మరచిపోతాం
వేర్లూ, కాండాలూ
 
ప్రయాణాలకు అడ్డు తగుల్తాయి

నీ చుట్టు పెరిగేవీ
నాచుట్టూ మొలిచేవీ వేరు వేరు కదా!

చెమటెక్కే పనుల్లో సేదదీరేందుకో
దించిన కల్లుముంతను తాగేందుకో
ఎవరొ ఒకరు ఆ నీడను చేరి
మాటల్లో నిన్నూ నన్నూ ముడివేసేందుకు ప్రయత్నిస్తారు

ఎండనూ, వాననూ
గాయాలను, హేయాలనూ
తుఫానులనూ, వడగాడ్పులనూ
దాచుకున్నవేవో ఒకొక్కటిగా విప్పుతారు 

~*~

నడకలు
అన్నీ ఒకేలా ఉండవు గదా!

ఎక్కడో చీలిన దారులు

ప్రయాణిస్తే కదా ఎవ్వరైనా 
ఎదురుపడేది, కలిసేది