Tuesday, 8 April 2014

పగటిప్రయాణం


ఈ మధ్యకాలంలో ప్రయాణాలన్నీ రిజర్వేషన్లతో రాత్రిపూట సౌకర్యవంతంగా అలవాటయ్యాక, పగలు ప్రయాణం గురించి మర్చిపోయాము. నాన్న జ్ఞాపకార్థ ప్రార్థన (5.4.2014) అయ్యాక రిజర్వేషన్లు  ఏవీ దొరకక 6.4.2014 పగటిప్రయాణం వైపు ప్రయాణించక తప్పలేదు. ఏలూరు నుంది విజయవాడవరకు బస్సు ప్రయాణం. విజయవాడలో పాత బస్సును చూసాక ఫొటోలు తీయాలన్న ఆలోచన వచ్చింది. 

1932 నాటి బస్సు


విజయవాడలో auto



విజయవాడలో మద్యాహ్నం 2 గంటలకు నర్సపూర్ - నాగర్సోల్   ఎక్స్‌ప్రెస్స్ ఎక్కాక  మధ్యమధ్య కనిపించినవన్నీ తీస్తూ వచ్చాను. 







కచ్చితంగా ఊర్లపేర్లు గుర్తుకు లేవు అందుకని ఆవివరాలను ఇవ్వలేకపోతున్నాను. విజయవాడ నుండి గుంటూరు మీదుగా నల్గొండ వరకు ఫొటో సెషన్ నడిచింది.


ఎన్ని రంగులు , ఎన్ని నేలలు, ఎంత ప్రకృతి సౌదర్యం, పచ్చదనం, వరి, మొక్కజొన్న, మిరప 


రాతినేలలు





కొన్ని ఫ్లాట్ఫార్ములు 


పిల్లల సరదా సాహసాలు 


ఎప్పటినుంచో పరిచయమున్నట్లు కవ్వించిన చిన్నపిల్లలు Lasya, Surya Manaswini




రహదార్లు, జలాసయాలు 




.

 సూర్యాస్తమవ్వడంతో అక్కడికే స్వస్తి పలకడం జరిగింది

Thursday, 3 April 2014

కృపాతిసయము


తరతరములలో
నీ ఉపదేశములను
మా పితరులకిచ్చి
నడిపించితివి, నిలిపితివి ఇలలో

చీకటిలో నడచిన జనులకు
నీ వాక్యపు వెలుగు జ్యోతులతో
నీ త్రోవలలో తొట్రిల్లక
నివశింపజేసితివి నేటివరకు

మరియ సుతుని మాకొరకిచ్చుటకు
నీ దయకు ప్రాప్తురాలుగ జేసితివి                                                     
వేదన బాధలలో తోడుగనుండి
వదనము మార్చితివి నీ రూపులో

కలతలందు వెతలయందు
కల్లోలపరచిన కన్నీళ్ళయందు
ఏకాంతంగా సంధించి
అబ్రహాము తండ్రిగా బలపరచితివి

సంసోనుకిచ్చిన బలముతో
సమూయేలుకిచ్చిన నీ పిలుపుతో
సుందరత్రోవలలో నడచుటకు యిమ్ము
మరి యాశీర్వాద అపరంజి పాదముల్

సుందరపట్టణ బంగారు వీధులలో
నడువ కటాక్షం  బొసగ యిచ్చిన
గురూతులతో ఆశీర్వదించితివే
ఆనందమయముగా మమ్ము

మూడింతల దీవెన మాకొసగ
మా మససు నీతిఫలములు ఫలియింపగ
నీధ్యాసలో మిక్కుటముగ నడువ
నీ మధుర స్నేహ వచనమిచ్చితివి మాకొరకు

కృపాకనికరము లింకను
నిజానుభవములతో నింపి
అగష్టస్ కాలమునుండి
నింపితివే నిన్నెరిగిన వారికి

నా డెందముప్పొంగగ 
యేసుడే విడువక
నింపెనే సదా నందము
రత్నములై మెరిసెనిల

కృపాతిశయమేరీతి పాడెద
పద్మప్రియ తేజునికి
మరణం గెల్చిన విజయం
వందనమ్ములీ నా పదములెల్ల

సుధాకరుడగు యేసుని
నిత్యభూషణంగ ధరియింప
శాంతి స్వరూపులనుగా మార్చి
చైతన్యమే రివాజు చేసితివి ఇలలో 

ప్రీతిగల నీమాట, పాటలు
ఆశతో మేము నేర్వగా
శృతిచేసి మమ్ములను
సుందర సింగారము చేసితివి

పరమేరీతి పోనగునో
నీ దాసు నీలాగు దెల్పితివే
దావీదు రాజ కుమార జయకుమార
తరలితివే స్లీవకు మము రక్షించగ

ఏమిచూసో నుర్వితిగుచుండ
నీ వాక్యఖడ్గాన పరంజి చేసి
చీల్చితివే కీళ్ళ మూల్గులను
సుందరంబే స్సియోను మార్గము

పద్మమే వికసింప
ధరిత్రిపాడెనే శ్రావ్యమై  
ఆకసం జయగీతమెత్తి
సంగీతమే అలరారే ప్రతినోట

నీ ప్రేమ కొనియాడగ
మధురమేగా మాటిమాటికి
రుచి చూతును, ధ్యానింతుము
బోధింతుము ఎల్లవేళల

హల్లెలూయ, హల్లెలూయ
హల్లెలూయ, హల్లెలూయ

ఆమేన్ ... ఆమేన్ 
-- :00: --

అబ్రహాము, మరియమ్మ అబ్రహాము, కాంతమ్మ సంసోను, సమూయేలు,  సుందర రావు, మరియ, ఆశీర్వాదం, అపరంజమ్మ, సుందరావు, కటాక్షమ్మ, రూతు,ఆశీర్వాదం, ఆనందరావు,
మూడి, సునీతి, లింకను, సలోమి, జాను, స్నేహవచన,అగష్టస్, డేవిడ్, సదానంద్, రత్నం, మేరీ, పద్మ, విజయ, లీనా, సుధాకర్, భూషణం, శాంతిస్వరూప్, చైతన్య, - మేరీ,  ప్రీతి, ఆశ, శృతి,   సుందర్ సింగ్,  రూపు ,
మేరిసుజాత, సునీలు, ప్రెస్లీ, రాజకుమార్, జయకుమార్, సోను, అపరంజి, సుందర బెస్సీ, పద్మ, శ్రావ్య, సంజయ్, సంగీత, షాను,

Monday, 17 March 2014

నేనూ .. నా కవిత


పద్మగారూ
నేను కొన్నిసార్లు విచిత్రమైన పరిస్థితులలో   అలాంటి ఒక పరిస్థితే ఇది. దీన్ని నాకు నేనుగా విమర్శించుకోవడం, అంచనా వేయడం సరి అయిన పద్దతి కాదుపద్మగారూ
నేను కొన్నిసార్లు విచిత్రమైన పరిస్థితులలో   అలాంటి ఒక పరిస్థితే ఇది. దీన్ని నాకు నేనుగా విమర్శించుకోవడం, అంచనా వేయడం సరి అయిన పద్దతి కాదు.  నేను వచనం రాయలేనని మీకు తెలుసు, అయినా వచనంలో రాయమన్నారు దీన్ని.
మీరు కోరిన దానికి వివరణ  అనుకోవచ్చు లేదా వచనము అనుకోవచ్చు.
***
నిద్రలో ఎవరో డిక్టేట్ చేసారు నిద్రలేవగానే టైపుచేసి ప్రక్కన పెట్టాను, మర్చిపోయాను అనుకున్నా మళ్ళీ వెంటాడేసరికి మళ్ళీ మళ్ళీ నాకునేను చదువుకున్నాను. ఏమీ బోధపడలేదు. మీకు పంపితే ఎమైనా చెబుతారులే అనుకుంటే ఇంకో పని అప్పచెప్పారు. తర్వాత నా వత్తిడునుంచి బయట పడటానికి  పోస్టు చేసాను.
***
సూర్పణక ఒకానొక సమయంలో లక్ష్మణుణ్ణి మోహించింది.  మోహంనుండి వచ్చే తాపాన్ని తీర్చమని శతవిధాలా కోరింది. లక్ష్మణుడు తిరస్కరించాడు. ఇంకా విసిగించేసరికి ముక్కూ చెవులూ కోసి తన తిరస్కరణను చూపించాడు.
పరిణామంగా బంగారు లేడి ఎరాగా చూపి సీతాపహరణ, చివరికి లంకా యుద్ధంలో వీరులు మరణించేవరకూ దారితీసింది.

ఇక్కడ లక్ష్మణుడి గుణశీలతను మెచ్చుకోవాలా! లేక తర్వాత దారితీసిన పర్యవాసానాలను తలపోయాలా!!

**
యోసేపు తనకు కలిగిన ప్రావీణ్యంతో పోతీఫరు రాజుకు నమ్మకస్తుడుగా పనిచేయండవల్ల తన ఇంటిలోని పనులను రాజు అప్పగించాడు.
యోసేపు యవ్వనానికో స్పురదౄపానికో యోసేపును మోహించింది.  తనకోర్కె తీర్చమని  ఎవ్వరికీ అనుమానం రాద్నే నమ్మకమైన మాటలతో వశపర్చుకోవాలని చూసింది. అయినా తిరస్కరించడంతో రాజుకు అబద్దపు పిర్యాదును చేసి యోసేపును చెరసాలలో వేయించింది.

ఆమె మొహానికి లొంగితే జీవితం రాజభోగంగా వుండేది అని ఒక తలంపు. తిరస్కరణతో చెరసాల పాలైనా అది శాశ్వతమైనదేమీ కాదు. తర్వాతి కాలంలో తన గుణ శీలతను బట్టి రాజ్యములో పాధానమైన పదవికి దారి కలిగింది. ఈ యన వల్లనే కరువు కలిగిన సమయంలో ఇఋఆయేలీయులు ఐగుప్తుకు వలస వచ్చారు.

ఇక్కడ యోసేపు గుణశీలతను మెచ్చుకోవాలా! లేక తర్వాత దారితీసిన పర్యవాసానాలను తలపోయాలా!!

**
ఇవి రెండు భిన్నమైన మతనమ్మకాలనుండి, కాలాలనుండి ప్రతీకలు వీటిని ఏ విధంగా అర్థం చేసుకోవాలి?

**
ఇప్పుడు జరుగుతున్న దేశ ప్రాంతీయ రాజకీయాలను దీనితో ఏమైనా పోల్చుకోవచ్చా అని.
ప్రజలు ఎటు అవస్థలు పడ్డా, మనోభావాలు ఎలావున్నా ఎవరి లెక్కలు వారివి.
ఒకవేళ ఇది కలియుగం అందామా, అయితే రాజకీయాలు మలికే మాటలు
ప్రతీకలన్నీ ప్రక్కకుతోసి
ప్రధానపదవికోసం ముక్కుచెవులుకాదు ఎవరి గొంతైనా కోద్దాం

ఎవరు ఎవరినైనా మోహించి
శయనమందిర పరదాలన్నీ చించేద్దాం!!
వంగివంగి మోసే దేహాలపై బాహాటంగానే శయనిద్దాం

***
కవి గొంతుక కూడా ప్ర్శ్నగా ముగింపు. నిజానికి ఇది ముంగింపేనా అనేది ఇంకా మిగిలిన ప్రశ్న.

కాపాడాల్సింది ప్రధాన పదవొక్కటేనా!!!!!!
పొందాల్సిందీ ప్రధాన పదవొక్కటేనా!!!!!!


------------------
ఇది పద్మగారూ ఈ మధ్య కాలంలో నన్ను విసిగించి, వేధించిన ఒక కవిత.
ప్రతి రాతకు ఒక కవిసమం ఉంటుంది దాన్ని నేనుగా చెప్పుకోవడం సబబు కాదు అయినా (20/30 సార్లు చదివాక) ఇంతా రాస్తున్నప్పుడు అదిమాత్రం ఎందుకు వదిలేయాలి. అందుకే
**
ప్రతీకలుగా చెప్పబడినవాటిలోని సూక్ష్మాన్ని అన్వయించడం.
బహుశ ఈ లాంటి ప్రతీకలు (పురాణ/ఇతిహాస/చారత్రిక) ఇదివరలో రాసి వుండటంవల్ల సునాయసంగా చొప్పించడమేమో.
సామాజిక స్థితిగతులు, జరుగుతున్న మార్పుల మధ్య ఏమీ చెప్పలేక ఒక విసుగు కావచ్చు.  లోలోపల దాగిన విసుగు ఇలా బయటికి వచ్చింది. 

?? //జాన్ హైడ్ కనుమూరి//

----

మోహించేది
రాక్షసే కావచ్చు
ముక్కు చెవులు కోసింది లక్ష్మణుడే
వెనుకెనుక ఓ యుద్దానికి వ్యూహ రచన జరుగుతుంది

మోహించేది
రాణికూడా కావచ్చు
తిరస్కరింపబడిన బిగికౌగిలి
చెఱశాల పాల్చేస్తుంది
లొంగని గుణశీలత యోసేపుదే
చెఱశాలనుండి ప్రధానపదవికి వ్యూహ రచన జరుగుతుంది

***

రకరకాల మోహాలు, సన్మోహాలు మధ్య
లక్ష్మణుణ్ణి యోసేపులను గుర్తించడమెలా!!

***

ప్రతీకలన్నీ ప్రక్కకుతోసి
ప్రధానపదవికోసం ముక్కుచెవులుకాదు ఎవరి గొంతైనా కోద్దాం

ఎవరు ఎవరినైనా మోహించి
శయనమందిర పరదాలన్నీ చించేద్దాం!!
వంగివంగి మోసే దేహాలపై బాహాటంగానే శయనిద్దాం

***

కాపాడాల్సింది ప్రధాన పదవొక్కటేనా!!!!!!
పొందాల్సిందీ ప్రధాన పదవొక్కటేనా!!!!!!

.........................................15.3.2014/16.3.2014

Wednesday, 12 February 2014

నిన్ను ఎప్పటికీ కలవలేను



ఊరించినదేదో సన్మోహనపరచి
ఆనందాన్నేదో నీవిస్తావని
రహస్య దారులవెంట నడచి నిన్నుచేరాను

నీ అడుగులకు మడుగులొత్తానో
నా పాదాలకు లేపానాలే పూసావో
ఓ గుడ్డిప్రేమతో నను బంధీనిచేసావు

నిన్ను నాలో వొంపుకున్న ప్రతిసారీ
మేఘాల పాన్పుపై పవళింపచేసావనుకున్నాను
కళ్ళుతెరిచినక్షణం
ముళ్ళనుపరిచో,బురదను పక్కేసో నన్ను ఒంటరిగా వదిలేసావు

ఈ బాధలు నాకెందుకని ఎన్నిసార్లు అనుకున్నానో!!
అయినా
మల్లెలు గుభాళించినట్టు
పెదవినంటినదేదో పదేపదే గమ్మత్తుగా నీవైపు లాగేస్తుంది

వెన్నెలను విడచి
చీకటి వెలుతురులమధ్య దోబులాచులాటలతో
పాదాక్రాంతుణ్ణిచేసావు

వినోదమైన చోటుల్లో
చన్నీటిస్నానం చక్కిలిగిలిపెట్టినట్టు స్వరగతులతో చిందేయించావు

నేను నిన్ను ప్రేమించాననుకుంటే
నన్నాక్రమించి నాట్యమాడిన నీపాదాలు
ఆరు పెగ్గులనంతరం వాంతిని పరచి పొర్లించావు

సన్మోహాలను తెంచుకోవడానికి
నరాలెంతగా విలవిలలాడయో తెలుసా!
అందుకే
నీ ప్రేమాలింగనాలకు విడాకులిచ్చేసా!!

ఎన్నిసార్లు గుర్తొచ్చావో
ఎన్నిసార్లు ఎందరితో కబురంపావో
నా కోసం ఎంత విరహ సందేశాలంపినా
ఎందుకో నిన్ను కవలేకపోతున్నా!!

***

***
ఎందుకంటే
నన్ను నేను ప్రేమిస్తున్నాను
నీ ప్రేమ అబద్దమని తెలుసుకున్నాను కాబట్టి


**12.2.2014** 17:15 ISD

Wednesday, 29 January 2014

ఏదో రాయాలని అనిపిస్తూనే ఉంటుంది


ఇలాగో అలాగో.. ఎలాగో ఓలాగ
ఎదొకటి రాయాలని
గొంతు గుటగుటమంటుంది
మింగుడుపడనిదేదో నిలువరిస్తుంది

అయినా...
ఏమిరాస్తే ఏంటట
కూటికొచ్చేనా గుడ్డకొచ్చేనా!
నాలుగు చప్పట్లు ఒక్కింత పొంగిన మనసు తప్ప.
***

అప్పుడప్పుడూ వదిలి వచ్చిన అడుగుల చప్పుళ్ళు
మనసును మెలిపెట్టాలని చూస్తాయి

ఒక్కసారిగా గలగల రాల్తున్న శిశిరం నుంచి
అక్కడక్కడా పొడుచుకొచ్చే చిగురు
గాయం కనపడని నొప్పిని రాత్రిలో నింపిపోతుంది

ఇప్పుడు ...
నొప్పిని రాయాలా!
చిగురును స్పర్శించాలా!! ఎప్పటికప్పుడు మీమాంసే
అయినా
ఏదో రాయాలని అనిపిస్తూనే ఉంటుంది  
రాసాక
చిగురులోంచి మొగ్గగా రూపాంతరం చిత్రంగా కన్పిస్తుంది 

Saturday, 25 January 2014

నిన్ను అలాగేచూస్తుంటాను


నీ పరిచయం తెరపైనే

నా బాల్యంనుంచీ
నిన్ను కలిసే సందర్భమేదీ తారసపడలేదు
నీదైన గొంతును వింటూ వింటూ
నీ అభినయాన్ని చూస్తూ చూస్తూ
నేను కాలేని ఎన్నో వ్యక్తిత్వాలను నాలోనే ముద్రించుకున్నాను

ఒక్కోసారి మిత్రుడవయ్యావు
మరోసారి అన్నవయ్యావు
నాన్నవై మార్గాన్ని బోధించావు
అయినా
నీ దేహ స్పర్శేదీ నేను తాకలేదు
నీనొదిలిన పాదముద్రలు దిక్కులకు దిక్శూచికలుగా అగుపిస్తాయి

నీ ఆత్మ దేహాన్ని వదిలి వెళ్ళిపోయింది
దేహం మట్టిలో కలిసిందీ నిజమేకావచ్చు
నా యెదలోనో, కళ్ళలోనో నీవుంచిన చిత్రాలు
నా రెప్పపడెంతవరకూ నాలోనే వుంటాయిగా

ఎక్కడకీ పోలేవు నా చూపుల్లోంచి

అందుకే
చిగురుతొడిగే లేత ఆశగా
చెదరిపోని ఉల్లాసాల మూర్తిగా నిను చూస్తుంటాను

***

(అక్కినేనికి అశ్రునివాళి) 22.01.2014

Friday, 13 December 2013

ఈ అంతర్జాలం



ఉదయ సాయంత్రాలకు వారధి
ఆహ్వానమెవరికి!
ప్రవేశమెవరికి!

నీకు తెలియని మార్గమేదీ లేదు
ఒకానొక సమయాన స్పర్శించిన స్నేహ హస్తపు స్పర్శ
ఈ వంతెనెను నిర్మిస్తుంది

విప్లవాలు ఆలోచనల్నుంచే పుడతాయి
ఇదో విప్లవం
పడమటినుంచి తూర్పును కలిపే మంత్రం

వంతెనపై
నా మాటలు అటు
నీ మాటలు ఇటు పరుగులు తీస్తున్నాయి
 
మిత్రమా!
రాత్రినిద్రను విదిలిస్తూ
ఉష: కాంతికి ఆహ్వానం పలుకుతున్నాను

అలసి, నిద్రను ఆహ్వానిస్తూ
సంధ్యకు వీడ్కోలు పలుకుతున్నావు నువ్వు

ఈ అంతర్జాలం వారథి నిర్మిస్తూనేవుంది

(వీదేశంలోవున్న మిత్రులతో చాటింగు)

Tuesday, 10 December 2013

చలినిచీలుస్తూ



మంచుదుప్పటికప్పిన మాసం వస్తుంటే
కొందరు ఆహ్వానాన్ని పలుకుతుంటారు
కొందరు కొరుకుతున్న చలికి భయపడి
తలుపుమూసిన గదిలో మునగదీస్తారు

దేహాన్నితడిమే చలిచేతుల్ని తోసేందుకు
ఆకలి మంటలతో నిత్యం పోటీ పడుతుంటారు
నలుగురుగా ఒక్కచోట చేరే దారి కనలేక
చలిమంటలు ఎప్పుడో కనుమరుగయ్యాయి

ఎప్పుడో ఈ చలి కాలాన ఆకాశాన తారొకటి వెలిగిందని
ఇప్పుడు ఈ చలిలో కాగితపు నక్షత్రాలు విద్యుత్తుకాంతితో
మిణుకుమిణుకుమంటూ ప్రతి ఇంటా వేళ్ళాడుతున్నాయి
పశులపాకొకటి అనేకానేక అలంకరణలతో అలరారుతుంటాయి

స్వరపేటికలో ఉత్సాహం ఆనందంనిండిన గాన ప్రతిగానాలు
నిదురించిన కళ్ళను మేల్కొల్పుతూ ప్రతిధ్వనిస్తుంటాయి
బృందాలు బృందాలుగా ధ్వనించే పాటలిప్పుడు చలినిచీలుస్తూ
"మన యేసు బెత్లహేములో చిన్న పసులా పాకలో బుట్టెన్"

Monday, 9 December 2013

ఎవరైనా ఎందుకు కన్నీరొలికిస్తారు



ఎన్నడో
నిద్రలోనో, మగతలోనో, మెలకువలోనో
పరిచయమనుకున్న ఓ నవ్వు
ఎప్పుడైనా ఎక్కడైనా
ఒక్కసారి కౌగలించుకున్న స్నేహ హస్తపు స్పర్శ
వదిలించుకున్నామని అనుకున్నా
పెనవేసుకున్నామనుకున్నా వెంటాడుతూనే వుంటుంది

జీవితాన్ని నడిచిన క్షణాలు కొన్ని
ధనుర్మాసపు మంచుకమ్మినట్టు కమ్మొచ్చు
మసక మసక వెలుతురుమధ్య జ్ఞాపకాలు కప్పినప్పినప్పుడు
చలికి మునగదీసుకున్న దేహంలా అనుబంధం కుంచించుకున్నప్పుడు
కళ్ళు చెమర్చమడం మరచిపోతుంది

***

అనుబంధాలు
మమకారాలు
కరన్సీని ఉన్నిగా తొడుక్కున్నాక
మాటలు కలిపి కలబోసుకోవడం కనుమరుగయ్యాక
ఎవరైనా ఎందుకు కన్నీరొలికిస్తారు

***

నీవు ఒంటరివై
రాత్రిలోకి నిన్నునీవు దూర్చుకొని
తాగినవన్నీ కన్నీళ్ళే కదా!

రగిలిస్తున్న యెదమంటలను
చల్లార్చడం మధువుకే చేతనౌనని అనుకున్నాక
తలుపులు ఒకొక్కటిగా మూసుకుంటుంటే
తలుపు తెరచి తొంగిచూసే ధైర్యలేనప్పుడు
ఎవరైనా ఎందుకు కన్నీరొలికిస్తారు

***

కొలమానాల లోకం
బిగించుకున్న చట్రాల చూపుల్లో ఇమడనప్పుడు
నీవు వేసిన అడుగులన్నీ
తప్పుడుగానో, తడబాట్లుగానో కన్పిస్తుంటాయి

ఇక ఏ అనుబంధం ముడిపడనప్పుడు
ఎవరైనా ఎందుకు కన్నీరొలికిస్తారు

***

నీలో నీవే దాచుకున్న దేహాన్ని విదిల్చుకుని
నీవు అలా వెళ్ళిపోతావు
కన్నీరొలికించలేనివారు కళ్ళలోంచి తీసేస్తారు
గుప్పెడుమట్టిని సమాధిపైవేసి
ఎవ్వరిని పలకరించకుండానే వెళ్ళిపోతారు
నిన్ను కప్పిన మట్టిలో సమస్యలు దాక్కోవు

***

పొద్దు గ్రుంకుతుంది
కాలచక్రం ఎక్కడా ఆగదు
కోలాహలమైన పక్షుల కిలకిలరావాలతో
రాత్రిదుఃఖాన్ని విదిల్చి మళ్ళీ తూర్పున సూర్యోదయం

***

నువ్వు ఎవరైనా
మళ్ళీ మనం కలుస్తామనే ఓ నిరీక్షణయైనప్పుడు
ఎవరైనా ఎందుకు కన్నీరొలికిస్తారు

Monday, 25 November 2013

తెరముందు - తెరవెనుక

తెరముందు సన్మానాలు
తెరవెనుక అవమానం
చూస్తున్న కళ్ళకు కత్తెరపడ్డదేదీ తెలియదు

**
కళ్ళు ముందుకే చూస్తుంటాయి
మనసు నలుమూలకు తిరిగి చూస్తుంది
**
బూడిదెకు ప్రతిగా పూదండను
దుఃఖమునకు ప్రతిగా అనంద తైలమును
అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతను
నూతనమైన పేరును కలిగి
రక్షణవస్త్రాన్ని కప్పినవాడు నిరంతము వెంటున్నాడు
**

అవమాన కర్త స్థానం కాళ్ళక్రిందేనని మర్చిపోకు

Saturday, 16 November 2013

అలలపై మెరుపుతీగ


ఎప్పుడో కన్న కల నెరవేరలేదు. కలల ప్రపంచం నుంచి కనుమరుగౌతున్న సచిన్ గుర్తొచ్చి, ఎప్పుడో రాసింది.
****


శ్రీమతి ప్రేమగా
పలుమార్లు పిస్లుస్తున్నా
పలుకని పరద్యానం

పిల్లల ముద్దుపలుకులేవి
తీపిగా రుచించని తనం

టెన్నిస్ తెలియని నాకు
సానియాను ఓడిస్తున్నట్టు
బ్యాటెప్పుడూ పట్టని నేను
సచింతోకలిసి పరుగులుతీస్తున్నట్టు

నారాయణరెడ్డినో
శివారెడ్డినో
అనుసంధానపు దారాలతో
పతంగిలా ఎగరేస్తున్నట్టు

ఎక్కడెక్కడో రగిలి
కమ్ముకుంటున్న చీకట్లతో
ఎండిపోతున్న ఆకలిపేగులో
మెలివేస్తున్న బాధంతా
ఒక్కసారిగా అనుభవిస్తున్నట్టు

వేడిమికి చిట్లిపోయే గాజులా
క్రౌర్యం, కర్కశం పెళ్ళున పగిలి
వీధుల్లో పారుతున్న రక్తం
నాపై ప్రవహిస్తున్నట్టు

ప్రవాహంలో కొట్టుకుపోయే
దేహపుగాయాల సలుపంతా
నా నరాలలోకి ఎగబాకుతున్నట్టు

రాలి ఎండిన ఆకులపై
నడుస్తున్నసవ్వడి వింటున్నట్టు

తపతపమంటున్న బురదదారుల్లో
కాళ్ళపై వస్త్రాన్ని పైకిలాగి
ఆచితూచి అడుగేస్తున్నట్టు

సుదారాలనుండి వస్తున్నాననే
ఆప్తులంపిన సందేశంతో
ఆలస్యమైన రైలుకోసం
గడియారపు ముల్లును
పరీక్షిస్తూ నిరీక్షిస్తున్నట్ట్లు

ధ్యానం కుదని యోగిలా
సీటుదొరకని ప్రయాణికుడిలా
అసహనంగా పచార్లు చేస్తున్నట్ట్లు

శాఖలుగా విస్తరించిన చెట్టు ఆకుల్లోంచి
మెరుస్తున్న సంధ్యలో
ఒక్కవుదుటన
ఎగిరేపక్షుల కోలాహలంలో
నేనో పక్షినై ఎగిరినట్లు

గజగజ వణికిస్తున్న చలిలో
నెచ్చెలివెచ్చని కౌగిట్లో బంధిస్తున్నట్లు

సలసలకాగుతున్న ఎసరు
కుతకుత ఉడికి గంగివంచిన అన్నం
సెగలు పొగలు కక్కుతున్నట్టు

ఆగీఅగి కూతవేస్తున్న కుక్కరులా
చెవిలో ఎదో కూతల రొద
ఓ అలజడి, ఓ బాధ
అది జ్వరంకాదు
అక్షరాలను చెక్కుతున్న ఉలి
పదాలను నెమరేస్తున్న అలికిడి
ఉబుకుతున్న జల
ఎగిసిపడుతున్న తరంగం
***
అప్పుడప్పుడూ
ఉలితో నన్ను నేను చెక్కుకుంటాను
జలాలతో తాలారా స్నానంచేస్తుంటాను
తరంగాన్ని పట్టుకోవడం కోసం
మళ్ళీమళ్ళీ ప్రయత్నిస్తుంటాను

అప్పుడది
అలలపైన తేలియాడే మెరుపుతీగ
నన్ను స్కానుచేస్తున్న యాంటీవైరస్.

........నేటినిజం 11.8.2005.........
 

Wednesday, 13 November 2013

నేస్తంతో ఒకప్పటి సాయత్రం





*
రెండుమనసుల్లోని గూడుకట్టిన దిగులుకు
వంతెన కట్టాలని
ఒకే సీసాలోంచి రెండు గ్లాసుల్లోకి వొంపుకుని
మిక్సర్ పొట్లాం విప్పినట్టు మాటలను విప్పుతాం
పలుగు, పారపెట్టి పెరటిని త్రవ్వినట్టు తవ్వుకుంటాం
**
హఠాత్తుగా
కాలేజీలో యదగిల్లినపిల్ల మద్యకొచ్చి వాలుతుంది
కొన్నివూసులు, గిలిగింతలతో ఊరిస్తుండగా
సీసా ఖాళీతనానికి శబ్దం చేసేసరికి
చటుక్కున ఆ పిల్ల ఎటో ఎగిరిపోతుంది.
***
ఒడ్డున ఖాళీగా లంగరేసిన నావ
గాలికి ఊగినట్టు ఊగుతుంటాయన్నీ
ఎక్కడో దాక్కుందనుకున్న దిగులు నావెక్కి తనూ ఊగుతుంటుంది.
అలల భయాన్ని పోగొట్టేందుకు మరో సీసామూత తెరుచుకుంటుంది.
****
వేగిన ముక్కల్లోంచి బయటపడ్డ బొమికలు
లోలోన అణచిన భాధించేవన్నీ చిరవందరౌతుంటాయి
కాళీయైన ప్లేట్లు
తమనెవారైనా శుభ్రంచేస్తారని ఎదురుచూస్తుంటాయి
*****
ఖాళీయైన సీసాలా దేహం దొర్లుతుంటుంది
******
దేన్ని వంపుకున్నామో
దేన్ని నింపుకున్నామో
తడబడుతూ ధీమాగా నడిచెళ్ళేవైపు
రెండుగ్లాసులు అలుపెరుగక అలానేనిల్చుని చూస్తుంటాయి
*******
బహుశ గ్లాసులకు  తెలియదు
మళ్ళీ కల్సినప్పుడు ముద్దాడేది  వాటినేనని


----------------------------------------------------
4.11.2013  రాత్రి 8-10   గంటలమధ్య

Monday, 30 September 2013

ప్యార్ హువా ఎక్‌రార్ హువా




ఇన్నేళ్ళ తర్వాత 
మళ్ళీ
నర్గీస్ నీపై ప్రేమ పుట్టింది

వర్షం కురుస్తున్న రహదారిపై 
ఒంటరితనం బిక్కుబిక్కు మంటోంది
ఇప్పుడు ఎక్కడ వెదాకాలి?

ఇప్పుడు కూడా గుండె వేగంగా కొట్టుకుంటుంది

కాలం రహదారిపై వాహనమై లైట్లు వేసుకుని నిన్ను దాటిపోయి 
కనుచూపులో కనుమరుగయ్యింది

ఎక్కడవెదకాలి నిన్ను?
జ్ఞాపకాల గుర్తులు మిగిలేవుంటాయిలే ఎప్పటికీ.



(ప్యార్ హువా ఎక్‌రార్ హువా - శ్రీ 420 పాట చూసి )
http://youtu.be/y01uvU0UAoU

Thursday, 19 September 2013

యుద్ధం...యుద్ధం...

|
కాలానికి ఏదో అంచున నీవు నేను
యుద్ధం మొదలయ్యిందిప్పుడే

నిన్ను చెక్కినవాడు
చేతివేళ్ళకు యుద్ధ తంత్రాన్ని నేర్పాడు తెలుసా!

వాక్యమనే రెండంచుల ఖడ్గాన్ని
వేళ్ళు ముడిచిన గుప్పెటలో పెట్టాడు

పలుకుతున్న కొద్దీ తెగిపడుతున్న
అంగాలు  ఎవరివో చూసావా!

తెగిపడ్డ వాటినుంచి మొలకెత్తే సాయుధులు
ఏపక్షాన్ని వహిస్తున్నారో గమనించావా!

***

ఒక్కోసారి యుద్ధతంత్రాలన్నీ
ఎండిన ఎముకల లోయైనప్పుడు
శబ్దించే నినాదమై
వెంటుండే సైన్యాన్ని ఊహించి పిలువగలవా

శత్రువును బలాబలాల ప్రక్కకు తోసి
నిరాయుధుడననే  దిగులుమాని ఎదిరించడానికి
తెగువ చూపగలవా!

***

యూద్ధం అనివార్యం
నీ చుట్టూ అందరూ యుద్ధాన్ని నేర్చినవారే
అయినా
కుటుంబమని, బంధువర్గమని బ్రమ పడుతుంటావు
ఎవరి యుద్ధం వారిదే.

***

సుడులు తిరిగే ఆలోచనలు
తేనెటీగల్ల రేగినప్పుడు
యుద్ధనైపుణ్యాలను సాధన చెయ్యాలి

కాలానికి ఏదో అంచున నీవు నేను
ప్రతిక్షణం యుద్ధం కొత్తగా  మొదలౌతుంది.

------------------------------19.9.2013 6:17 hours ISD

Monday, 9 September 2013

ఎవరికి ఇష్టముంటుంది?



జీవనాన్ని నిర్మానుష్య రోడ్లలో కోల్పోవడం
కలతచెందిన కళ్ళలో కలనిచ్చే రాత్రిని కోల్పోవడం

అనుబంధం ముడివేసుకుని
పాలుతాగే లేతపెదవికి స్తన్యం కోల్పోవడం

బిడ్డనుపొంది సహచరి కోల్పోవడం
నూతనాంకురాన్ని పొదవి మమకారాన్ని కోల్పోవడం
కట్టిన కలలగూళ్ళు కుప్పకూలిపోవడం

నడుస్తున్న దారిలో ఎటో తప్పిపోయి మార్గాన్ని కోల్పోవడం

నీడనిచ్చినచెట్టు వేళ్ళతో కూలి పోవడం

ఒకేబెంచీపై నేర్చిన అక్షరాలు విద్వేషమై దోస్తీని కోల్పోవడం

 చెమటోడ్చి, కడుపుకట్టి దాచుకున్నది
సొంతమనుకున్నది హఠాత్తుగా కోల్పోవడం  

* * *

కోల్పోవడం ఆశల్ని కత్తిరిస్తుంది
పూడ్చలేని ఖాళీని నింపుతుంది

నిరాశనిండిన కన్ను
చెరువుఅలలపై తేలియాడుతుంది

....................................8.9.2013 22:25 hrs ISD

Monday, 2 September 2013

జీవన గమనం


ఉదయమైనట్లు అలారంచెప్పింది
వడివడిగా పలకరింపుల ఎస్ఎంస్సులు
అల్పాహారా సమయం
చానళ్ళలోనో, ఆన్‌లైన్‌లోనో కొన్నివార్తలు కళ్ళముందు స్క్రోరింగులు

ఇరుక్కుపోయే రహదారుల్లోకి నా కారునడపాలిక
అర్జెంటయితే ఓ మిస్స్‌కాల్ చెయ్యి
నీతో పనివుంది ఆఫీసుకెళ్ళగానే ఆన్‌లైన్లోకి రా!

రూపాయి పతనాలు
రాజకీయ ధర్నాలు
నమ్మించి మోసంచేసే పధకాలు ...వాటంతటవే జరిగిపోతాయి!

ఇప్పుడు సమయంలేదు
రావాలంటే ఎన్ని ఆంక్షలో, ఎంతకర్చో తెలుసా నీకు
బాల్యం అందమయినదే
అదే తలపోస్తూ దాటివచ్చిన ఖండాంతరాలలో మనలేను!

మీటింగులు, అప్పాయింట్‌మెంట్సుతో
డైరీ ఎప్పుడో నిండిపోయింది.

ఆన్‌లైన్‌లో ఆకుపచ్చగా కన్పించినంతమాత్రాన
నీతో నాల్గక్షరాలు చాట్ చెయ్యలేను
అంతకంటే అవరమైన వారితో సంబాషణలో వున్నాను
అది నీకు తెలియాల్సిన అవసరంలేదు
నా పనులు నాకున్నాయి

నువ్వు ఎలావుంటే నాకేంటి?
నీవుపెట్టే స్టేటస్సుకు ఏదొక సమయంలో లైకు పెడ్తాలే!

..................................................1.9.2013,  06.55 hours. ISD

Monday, 26 August 2013

ఇటురా!



అలా ఆరేసిన జ్ఞాపకాలు

మర్చిపోయిన వామనగుంటల్లోని గింజల లెక్క
వాననీటిలోవదిలిన కాగిత పడవల సృజన

పలకపట్టి గెంతుకుంటూ బడికెళ్ళిన వీధులు

చెదిరిపోయిన కలల అంచుల నెమలీకలు
తొక్కుడుబిళ్ళ, కుంటాట,
గోళీలు, గూటీబిళ్ళ
ఏడుపెంకులాట, బచ్చాలు

వొడుపెరిగిన   చేతివాటం
...............చెరువునీటిలో కప్పగంతులైనట్లు
...............కొబ్బరాకు సన్నయిగా మారినట్లు
...............ఎండిన తాటాకుముక్క, తుమ్మముల్లు, జొన్నదంటు గాలిపంఖాగా మారినట్టు

ఆరుబయట వెన్నెలతోటలో
నచ్చినవారి ప్రక్కనచేరి విన్న
రాజకుమారుల సాహసగాధలు, భయపెట్టిన దెయ్యం కథలు

నలుగురు పిల్లల్నిచేర్చి నేర్చిన వేమన పద్యం
* *

పదిలంగా దాచుకున్న మరికొన్ని
మెల్లగా మూటలు మూటలుగా విప్పుదాం

***

గతించించినదేదీ అలానే మిగిలిపోదు
ఒడిసి పట్టుకోవడం, మూట కట్టుకోవడమే మనంనేర్చే గొప్ప విద్య