Monday, 8 September 2014

ఏదైనా రాద్దామా! వద్దా!!

~*~
గోడలపై అలా
ఉప్పొంగిన సముద్రపు అలలా
రాయడానికి ఏమైనా ఉందా
గోడలిప్పుడు వీధుల్లో లేవు
ప్రపంచవీధుల్లోకి వచ్చాయి
నిద్రరాని రాత్రిని కత్తిరిస్తూ
గోడలపై ఎదో రాయాలని
గోడనిప్పుడు దేనికి ప్రతీక చేయలంటారు!
~*~ 
అలా బాల్యంలోకి నడిచివెళ్తే
నివాసాలమధ్య గోడలెక్కడా కన్పడవేం!
~*~
ఒకప్పుడు
 
గోడపై నల్లబోర్డుమీదా రాసినవాటిని
 
ఎప్పటికప్పుడు చెరిపేసినా
జ్ఞానమేదో వికసించిందంపించేది
ఒకప్పుడు 
గోడమీద రాతల్ని చదివి
 
ఎవరి తలరాతలో మార్చడానికి
ఉప్పెనయ్యేందుకు ప్రవాహాలు కదిలేవి
ఒకప్పుడు
కొందరు మిత్రులు కలిసి
రాత్రివేళల్లో గోడలపై రాస్తున్నప్పుడు
వెంటపడ్డ కుక్కలు, మీదపడ్డ లాఠీలు
చెప్పుకోలేని అనుభవ జ్ఞాపకాలు
ఇప్పుడు
ఎవరి గోడను వారు అందంగా అలంకరిస్తారు
*
అప్పుడూ ఇప్పుడూ
గోడలపై
వ్యాపార ప్రకటనలు, సినిమా పోస్టర్లు
పూలదండలు, బురద, పేడముద్దలు
ప్రవృత్తి సంకేతాలు

***

7.9.2014 02:40 hours ISD

Friday, 5 September 2014

ఇంతదూరం నడిచొచ్చాక - 3


~*~

నిన్ను ప్రేమిస్తున్నాని చెప్పలేని
ఒకానొక సందిగ్దావస్థలో
మొగ్గతొడిగిన ప్రేమ
లోలోనదాగి
పుస్తకంలోనే ఎండిపోయింది
ఇప్పుడు
వయస్సు తెచ్చిన ధైర్యమో, అనుభవమో
కథలు కథలుగా
మాటలు పొరలు పొరలుగా
ఎందరిముందైనా విప్పాలని చూస్తుంది

~*~

కొన్ని సిగ్గులపరదాలు తొలగిపోయాక
ఎగిరొచ్చే సీతాకోకచిలుకల ఊహలకు కిటికీలు మూసుకుపోయాక
ప్రతిస్పందనేది ఉండదు కదా!
అయినా
నిలబడ్డ చోటులోకి ఎగిరొచ్చే పిట్టలకు
తీరిగ్గా
కొన్ని గింజలు జల్లడమే!
ఒక్కసారి
ఎగిరిపోయిన పిచ్చుక
మళ్ళీ వస్తుందనే నమ్మకమేమీ లేదు

~*~

క్లాసు రూమో, లైబ్రరీయో
చేతులుమార్చుకున్న నోట్సు
ప్రత్యేకదుస్తుల్లో అలంకరణో
బస్సుకోసం నడిచిన కొద్దిదూరమో
దూరంగా మూగగాచూస్తూ గడిచిపోయిన కాలమో
ఒకానొక క్షణానికి కొంచెం జీవంపోసి
చిత్రించడాన్కి చేసే ప్రయత్నం
వర్తమానంలో నూతనుత్సాహాన్నిస్తుంది

4.9.2014.......08:20 hours ISD

Thursday, 4 September 2014

ఇంతదూరం నడిచొచ్చాక - 2

~*~
Photo :కాశి రాజు  

చెరువులను వెతుక్కుంటూ
కలువలను తెంపుకోవడం కష్టమే కావచ్చు
బురదంటిన కాళ్ళతో
కొన్ని
తామర/కలువ పూలను మిత్రులకివ్వడంలో
ఏముండేదో అంచనావేయడం సులువేనంటారా!

తిరిగిన మలుపులూ
బసచేసిన మజిలీలూ
పొందిన అనుభవాలూ
కలసుకున్న అనుబంధాలూ
అన్నింటిమధ్య
బహుశ
మనోపలకంలో తామర/కలువలు చెరిగిపోవచ్చు
ఎండిపోయిన చెరువుగట్లపై
దారులు విడిపోయినట్లు
చెరోభావజాలాల దారులయ్యాక
అందుకున్న స్నేహహస్తం
భుజం తట్టిన ప్రోత్సహక స్పర్శ
ఎక్కడ మూటగా మిగిలిపోయిందో వెదకాల్సిందీ
పురావస్తు పరిశోధనలా తవ్వుకోవల్సిందేదీ లేదనిపిస్తుంది

~*~

గడచిన కాలం
ఏదొక భావావేశాన్ని దాచివుంచుతుంది !

~*~

వస్తుప్రపంచాన్కి కొలమానాలెక్కువ
అందుకే
ఏదీ ఎక్కువకాలం ఉండదు

నీవు నన్నూ
నేను నిన్నూ వెదకటం కష్టమే !
తెలియనితనపు సమయంలో
నవ్వినప్పుడు రాలిపడ్డ రేకల్లో
ఎంతోకొంత పరిమళం నాసికలో
రెప్పల్నిదాటి రాలిపడ్డ చుక్కలు
ఘనీభవించిన స్పటికమై దాగివుంటాయి

~*~

వెదకినప్పుడే కదా ఏదైనా దొరికేది !
అందుకు
కలవరేకుల కన్నుల్ని తెరవాల్సిందేగా !

...........29.8.2014.....13:00 Hours ISD

(ఎత్తుగడ మరియు ముందు  రాసిన కవితలోని పదాలు ఉన్నాయిందులో.)

ఇంతదూరం నడిచొచ్చాక - 1

దారిని వెతుక్కుంటూ
వెనక్కు వెళ్ళడం కష్టమే కావచ్చు
తిరిగిన మలుపులూ
బసచేసిన మజిలీలూ
పొందిన అనుభవాలూ
కలసుకున్న అనుబంధాలూ
బహుశ
మనోపలకంనుండి చెరిగిపోవచ్చు
పురావస్తు పరిశోధనలా తవ్వుకోవల్సిందే !

అందుకున్న స్నేహహస్తం
భుజం తట్టిన ప్రోత్సహక స్పర్శ
ఎక్కడ మూటగా మిగిలిపోయిందో వెదకాల్సిందే!

~*~

అపజయాలూ
అవమానాలూ
ఆనందాలూ
సన్మానాలూ
ఏదొక భావావేశాన్ని దాచివుంచుతాయి !

~*~

వస్తుప్రపంచాన్కి కొలమానాలెక్కువ
అందుకే
ఏదీ ఎక్కువకాలం ఉండదు
నవ్వుతూ ఏడ్వటం
ఏడుస్తూ నవ్వడం
రెంటినీ దిగమింగడం కష్టమే !
నవ్వినప్పుడు రాలిపడ్డ రేకల్లో
ఎంతోకొంత పరిమళం నాసికలో
రెప్పల్నిదాటి రాలిపడ్డ చుక్కలు
ఘనీభవించిన స్పటికమై దాగివుంటాయి

~*~

వెదకినప్పుడే కదా ఏదైనా దొరికేది !

..............................29.8.2014 08:30  

Tuesday, 19 August 2014

ప్రయాణం


నీవు నేనూ 
ఎప్పుడో కలిసాం అంతే!

తోపుల వెంబడి, బోదుల వెంబడి
 
చెరోమూల నాటబడ్డాక
ప్రయాణించడం మరచిపోతాం
వేర్లూ, కాండాలూ
 
ప్రయాణాలకు అడ్డు తగుల్తాయి

నీ చుట్టు పెరిగేవీ
నాచుట్టూ మొలిచేవీ వేరు వేరు కదా!

చెమటెక్కే పనుల్లో సేదదీరేందుకో
దించిన కల్లుముంతను తాగేందుకో
ఎవరొ ఒకరు ఆ నీడను చేరి
మాటల్లో నిన్నూ నన్నూ ముడివేసేందుకు ప్రయత్నిస్తారు

ఎండనూ, వాననూ
గాయాలను, హేయాలనూ
తుఫానులనూ, వడగాడ్పులనూ
దాచుకున్నవేవో ఒకొక్కటిగా విప్పుతారు 

~*~

నడకలు
అన్నీ ఒకేలా ఉండవు గదా!

ఎక్కడో చీలిన దారులు

ప్రయాణిస్తే కదా ఎవ్వరైనా 
ఎదురుపడేది, కలిసేది

Tuesday, 22 July 2014

అమ్మను తలపోస్తూ

~*~

కాలం చిత్రంగా కదిలిపోతుంది
కొందరు చెప్పి
కొందరు చెప్పకుండా వెళ్ళిపోతారు
అలాచూస్తున్న కంటికి
జ్ఞాపకం మెల్లగా
భూమిని తాకిన ఆకాశంలా కనిపిస్తుంది
నీవు లేకుండనే రెండు దశాబ్దాలు గడచిపోయాయి
**
నేను కడుపున పడ్డప్పుడు ఎలా తలచావో
అడుగులు వేస్తున్నప్పుడు ఏమి వూహించావో
జ్ఞానజ్యోతిని వెలిగించిన వాక్యాన్ని కనులకు అంటించి పోయావు
**
కాలచక్రంలో ఏడుగురికి ఊపిరిపోసావు
ప్రతికాన్పు పునర్జన్మయితే
ఆరుసార్లు తిరిగి తిరిగి జన్మించావు
బహుమానాల, స్వాస్థ్యాల
అడుగులను తీర్చిదిద్దేందుకు
బాధలను సహించిన దేహం ఎటుగా కనుమరుగయ్యిందో కదా!
**
ప్రతివేకువలో  సన్నుతించిన గానం
చెవిలో ధ్వనిస్తూ నన్ను పురికొల్పుతూనేవుంది
నీవూ నేనూ కలిసే చోటు సమయం వుందనేగా మన విశ్వాసం!
**
అమ్మా!
చిన్నీ! నాన్నా! అని పిలిపించుకొనేందుకు
నీ వేలుపట్టి నడవాలనివుంది
**

Wednesday, 16 July 2014

నేను నీకు తెలుసంటావా?

~*~

ఎన్నాళ్ళపరిచయంమనది!

ఏ ప్లాట్‌ఫారం మీదో ఎదురయ్యిన ఎప్పటిదో తెలిసిన ముఖం
ఎంతకీ గుర్తురాని జ్ఞాపకమై కదిలిపోతుంది

ఆసుపత్రి మెట్లపై దిగాలుగా కూర్చున్న బాదాతప్త దేహం
ఏ బంధాన్నీ ముడివేస్తున్న గాలి అలల కలబోత

ఎప్పుడో విన్న
మహ్మద్‌రఫీ ముకేష్ సైగల్‌ల గాత్రంవెనుక సంగీతం

ఈ పరుగెడుతున్న నగరాన్ని
బాల్యంలో ఎప్పుడూ స్వప్నించలేదు
వలసపక్షుల గుంపులగుంపుల రెక్కలచప్పుళ్ళు
అప్పుడూ ఇప్పుడూ అలానేవున్నాయి

వెన్నెలరాత్రిలో రాలిపడ్డ నైట్‌క్వీన్ పరిమళం
నీ మీదుగా సన్నగా ప్రవహిస్తోంది

ఒకరికొకరం ఇక్కడే తచ్చాడుతూ పోల్చుకోలేం
అయినా
నీవు నాకు తెలిసినట్టే ఆకులు వూగుతున్నట్టూ జ్ఞాపకమొకటి వెంటాడుతుంది

అనంత దారంతో గాలిపటం ఎగురుతూనేవుంటుంది

...................................14.07.2014 22:43 hours ISD

Monday, 14 July 2014

???


నీ శ్రమవున్నంత మాత్రాన ఈ రహదారి సొంతమేమీ కాదు
కొందరు ముళ్ళను నరుక్కుంటూ కాలిబాటలో నడిచివెళ్ళారు
కొందరు కంకరరాళ్ళను పరచుకుంటూ ఎడ్లబళ్ళను తోలుకెళ్ళారు
దోచుకున్న సంపదను తరలించేందుకు
చెమటచుక్కల ఇందనాలతో రోడ్డురోళ్ళను నడిపారు కొందరు
ఊరు నాల్గక్షరాలు నేర్చాక
కాలిబాట రోడ్డయ్యింది
నాచుట్టూ పరుచుకున్న విషవలయంలో
ఊర్లోని రోడ్డు ఊరుమీదనుంచి రహదారిగా మారింది
నేనింకా తొక్కాలనుకునే సైకిలికిప్పుడు
ఆ రహదారిపై అనుమతిలేదు
నా ఊరిదేహభాగమైన రహదారిపై
కారు నడపాలంటే, బస్సెక్కివెళ్ళాలంటే పన్నుచెల్లించాల్సిందే!

 * * *

కాలిబాటకు కాలంలో ఎన్ని మార్పులు

* * *

అంతర్జాల ప్రయాణంలో
మార్పువెంట మార్పులు
నాదైనదేదీ నాది కాదు

*******************25.5.2014 6:00 - 7:25 pm ISD

Tuesday, 1 July 2014

50+ ....!


~*~
నాలుకకు కత్తెర కావాలి
మాటలనాపేందుకు కాదు
రుచులను కత్తిరించేందుకు
నాలుకకు పూతకావాలి
ఏది అందించినా ఒకేలా ఉండేందుకు
ఏం వయసు మీదపడిందని కాదు
బరువెక్కిన కాయం ఏ అనారోగ్యానికి ద్వారం తెరుస్తుందోనని

***

ఆ వేసవి కాలం గుర్తుందా
ఉప్పుకారంతో తిన్న పుల్లమామిడికాయలు
మోచేతులవరకూ కార్చుకుంటూ తిన్న రసాలు
నువ్వు ఎక్కువ తింతావో, నేను ఎక్కువతింటానో
లెక్కలేస్తూ తిన్న ముంజెకాయలు
ఎండలో తిరగొద్దని, తిరగకుండావున్నందుకు
జేబుల్లో పోసిన వేరుశెనగలు, చేతికిచ్చిన బెల్లంముక్క
ఇపుడు నిషిద్దాల జాబితాలోకి చేరాయి
పండిన ముక్కైనా, ఊరగాయ ముక్కైనా
చెక్కెర రక్తపోటులను మార్చేస్తుంది

***

దోస్తులతో పోటీపడి తిన్న సందర్భాలు
నోరూరించే జ్ఞాపకాలు మాత్రమే

***

అన్నం పులిహోరకు గారెలకు
నాలుక అర్రులు చాస్తుంది
ఇక బిర్యానీ అంటావా!
వాసన చూసినా పాపంమూటగట్టుకున్నట్టౌతుంది
రొయ్యలు, పీతలు ఊహించడమే మహాపాతకమౌతుంది

***

ఆరోగ్యసూత్రాల జాబితాతో
ఆ గదిలో డాక్టరు ఎదురుచూస్తున్నాడు
జాబితా తెలీయనివేమీ కాదు
కానీ
నాలుకకు కత్తెర కావాలి
రుచులను కత్తిరించేందుకు
కొన్ని మొలకలో
మరికొన్ని పచ్చి ముక్కలో తినేందుకు
నాలుకకు పూతకావాలి
ఏది అందించినా ఒకేలా ఉండేందుకు


...........29.6.2014

Friday, 27 June 2014

నా నంబరు మారలేదు

~*~
నాకు మొబైలిప్పుడు కేవలం
సాంకేతిక సమాచార సాధనమే కాదు
నా దేహాన్ని, ఆలోచనల్ని వైబ్రేట్‌చేసే పరికరం కూడా.

అవసరాలమధ్య అనుసంధానమౌతున్న అనేకనెంబర్లతోపాటు
నీ నంబరు అలానేవుంది
అప్పుడప్పుడూ ఏదొకటి వెదకుతున్నప్పుడు
నీ పేరుతో నంబరు కన్పిస్తుంది
అంతటి వెదకులాటలో
ఓ జ్ఞాపకం సన్నగా తడుతుంది
ఒక్కసారి ప్రయత్నిద్దామని మదిలో తొలుస్తుంది
ప్రయత్నించిన వెనువెంటనే కలిసుంటే ఈ పద్యమే లేదు
అందుబాటులో లేవనో, పరిథిలో లేవనో పదే పదే పలుకుతుంది

దగ్గరవ్వాలనే ఆలోచనకు
విభజన రేఖేదో అడ్డమొస్తుందేమో!

వాణిజ్య బేరీజులమధ్య నెంబర్లు మారుస్తుంటాము
కానీ ఆది నా దగ్గర వుండదు

వాడని నెంబర్లను తీసివేస్తుంటాము
మరి నా నంబరు నీ దగ్గరుందో లేదో

నాకిప్పుడు
నీ పిలుపునుంచో, మాటల్లోంచో పొందే తరంగ తాకిడికోసం
నీ నుంచి రింగు కావాలి
నా నెంబరు మారలేదు సుమా!

హఠాత్తుగా
జీవితాన్ని ఏమీ మార్చలేదు

అయినా
అదే ఐడియా 9912159531
***

19.6.2014 04:37 hours ISD

Friday, 30 May 2014

జీవన గమనం - కవిత - విశ్లేషణ ఎం. నారాయణ శర్మ


ఈనాటి కవిత-33
_______________________
జాన్ హైడ్ కనుమూరి-జీవన గమనం


ఉదయమైనట్లు అలారంచెప్పింది
వడివడిగా పలకరింపుల ఎస్ఎంస్సులు
అల్పాహారా సమయం
చానళ్ళలోనో, ఆన్‌లైన్‌లోనో కొన్నివార్తలు కళ్ళముందు స్క్రోరింగులు

ఇరుక్కుపోయే రహదారుల్లోకి నా కారునడపాలిక
అర్జెంటయితే ఓ మిస్స్‌కాల్ చెయ్యి
నీతో పనివుంది ఆఫీసుకెళ్ళగానే ఆన్‌లైన్లోకి రా!

రూపాయి పతనాలు
రాజకీయ ధర్నాలు
నమ్మించి మోసంచేసే పధకాలు ...వాటంతటవే జరిగిపోతాయి!

ఇప్పుడు సమయంలేదు
రావాలంటే ఎన్ని ఆంక్షలో, ఎంతకర్చో తెలుసా నీకు
బాల్యం అందమయినదే
అదే తలపోస్తూ దాటివచ్చిన ఖండాంతరాలలో మనలేను!

మీటింగులు, అప్పాయింట్‌మెంట్సుతో
డైరీ ఎప్పుడో నిండిపోయింది.

ఆన్‌లైన్‌లో ఆకుపచ్చగా కన్పించినంతమాత్రాన
నీతో నాల్గక్షరాలు చాట్ చెయ్యలేను
అంతకంటే అవరమైన వారితో సంబాషణలో వున్నాను
అది నీకు తెలియాల్సిన అవసరంలేదు
నా పనులు నాకున్నాయి

నువ్వు ఎలావుంటే నాకేంటి?
నీవుపెట్టే స్టేటస్సుకు ఏదొక సమయంలో లైకు పెడ్తాలే!
..................................................1.9.2013,  06.55 hours. ISD

ప్రపంచీకరణ తరువాత జీవన గమనంలో మార్పు వచ్చింది.ఈ మార్పుతో బాటు ఆధునికావసరాలు కొత్తగా జీవితంలో చేరిన పరికరాలు.వీటన్నిటికి కావలసిన ఆదాయపు వేట.ఇందులో మనిషి సామజిక దశనికోల్పోయి ఆర్థిక పశువుగా మిగిలాడు. ఈ క్రమంలో యాంత్రిక జీవనానికి అలవాటు పడి పోయాడు.
ఈ ఆధునిక, ఆధునికానాంతర స్థితిలో మనిషి జీవితాన్ని నిర్వచించే ప్రయత్నం జాన్ హైడ్ కనుమూరి కవిత "జీవన గమనం"చేసింది.
"ఉదయమైనట్లు అలారంచెప్పింది
వడివడిగా పలకరింపుల ఎస్ఎంస్సులు
అల్పాహారా సమయం
చానళ్ళలోనో, ఆన్‌లైన్‌లోనో కొన్నివార్తలు కళ్ళముందు స్క్రోరింగులు "

ఉదయం నించి ప్రతి అంశం యాంత్రికమైన తీరు మనిషి తన మారిపోయి ప్రతీ అవసరానికి యంత్రం మీద ఆధార పడి తన ఉనికిని మార్చుకున్నాడు.
"ఇప్పుడు సమయంలేదు
రావాలంటే ఎన్ని ఆంక్షలో, ఎంతకర్చో తెలుసా నీకు
బాల్యం అందమయినదే
అదే తలపోస్తూ దాటివచ్చిన ఖండాతరాలలో మనలేను!"
"మీటింగులు, అప్పాయింట్‌మెంట్సుతో
డైరీ ఎప్పుడో నిండిపోయింది."

తన జీవితానికి ఙ్ఞాపకానికి, ఊరికి, బాల్యానికి తానుగా దూరమవుతున్న అంశం. రోజూవారి జీవితం ఇరుకుగా మారుతున్న స్థితి ఇవన్ని ఈకవిత లో కనిపిస్తాయి. ఆత్మీయతలు కూడ యాంత్రికంగా మారిన స్థితితో కవిత ముగుస్తుంది.
జాన్ గారి వచనం ఎక్కువగా వస్తువు పైనే ఆధార పడింది. ఎలాంటి ఆర్భాటాలు లేని ఈ తరహా కవితని "సరళ కవిత(plain poem)అంటారు.అత్యంత సూక్ష్మంగా జీవితాన్ని పరిశీలించిన నేపథ్యం ఇందులో ఉంది.
ప్రపంచీకరణ తరువాత జీవితం అనే వస్తువు సాహిత్యంలో మరింత విస్తృతమయింది. ఈ క్రమంలో జీవితంలోని ఒక రోజుని గడుపుతున్న క్రమాన్ని కవితగా అందించారు.
అభినందనలు జాన్ హైడ్ కనుమూరి గారు.

.......................................... విశ్లేషణ ఎం. నారాయణ శర్మ
comments from fb
  • Pusyami Sagar జాన్ గారి వచనం ఎక్కువగా వస్తువు పైనే ఆధార పడింది.ఎలాంటి ఆర్భాటాలు లేని ఈ తరహా కవితని "సరళ కవిత(plain poem)అంటారు.అత్యంత సూక్ష్మంగా జీవితాన్ని పరిశీలించిన నేపథ్యం ఇందులో ఉంది.
    chala saralm ga vunna lotina vishelshana chakkaga selaviccharu sharma sir, John Hyde gariki abinandanalu ..
  • Humorist N Humanist Varchaswi Yes! His poem is 'plain' ... but ex'plain's a lot! Thanx for the nice review.
  • Kavi Yakoob జాన్ గారి వచనం ఎక్కువగా వస్తువు పైనే ఆధార పడింది.ఎలాంటి ఆర్భాటాలు లేని ఈ తరహా కవితని "సరళ కవిత(plain poem)అంటారు.అత్యంత సూక్ష్మంగా జీవితాన్ని పరిశీలించిన నేపథ్యం ఇందులో ఉంది./జయహో !
  • బాలసుధాకర్ మౌళి ప్రపంచీకరణ తరువాతజీవితం అనే వస్తువు సాహిత్యంలో మరింత విస్తృతమయింది.
  • Bhavani Phani విశ్లేషణ తో పాటు గా పూర్తి కవిత కూడా ఇక్కడ పోస్ట్ చేస్తే బాగుంటుంది 
    అంతకుముందు చదవని వారికోసం

Thursday, 22 May 2014

కళ్ళెదుటే సరోవరం


అప్పుడప్పుడూ
కళ్ళెదుటే సరోవరం కదిలించబడతుంది
కదలలేని స్థితిలోపడి ఎదురుచూస్తుంటాం
సహాయమందించే స్పర్శకోసం
నిరాశగా సంవత్సరాలు గడచిపోతాయి
అలా పడివుండటం అలవాటయ్యిందనుకుంటారు
తోసుకువెళ్ళడాన్కి మనసే లేదనుకుంటారు
దేహాన్ని కృంగదీసిన వ్యాధి
అంతరంగాన్ని కృంగదీస్తుందని ఎవరికైనా ఎలా తెలుస్తుంది?
చెట్లు ఆకుల్ని రాల్చినట్టు
కాలం సంవత్సరాలను రాలుస్తుంది
కదిలే దేహాలన్నీ కదలిపోతుంటాయి
ఎవరికోసమో ఎదురుచూసినంతకాలం
అలా పడివుండటం తప్పదు
* * *
నన్ను నన్నుగా ఎరిగి
దేహాన్నీ అంతరంగాన్నీ లేవనెత్తి
సాగిపొమ్మని ఆజ్ఞాపించినవాడి మాట
ఆశ్చర్యమే!
*****************29.04.2014 04:50 hrs ISD

ఈ రోజు గడిచిపోతుంది


తరతరాలుగా
ఏమీ లేదిక్కడ నినాదాలు తప్ప
ప్రపంచ కార్మికులారా! ఏకంకండి!
ఏమిసాధించాం
మళ్ళీ బానిసత్వానికి తెరలు తీద్దాం
కాంట్రాక్టు పనులన్నీ బానిసత్వమేగా!
చెమట రంగు పులుముకొని నినదిద్దాం
చెమటకు అన్నిరంగులొక్కటే
అక్కడో బిర్యానీ దొరుకుతుంది! ఈ రోజు గడిచిపోతుంది
ఎండిన డొక్కలు మండే కడుపులపై ఎసి కార్లు దూసుకుపోతాయి
నిన్నెవరో పుట్టారు! ఈ రోజెవరో గిట్టారు!
ఎవ్వరు మిగిల్చిందేమీ లేదు
అలా అలా విదిల్చిన అక్షరాలను అద్దాల మేడల్లో పదిలపర్చుకుంటున్నారెవరో!
రెక్కల కష్టం నాదే! ఆకలి అరుపు నాదే!
ఆత్మఘోష, కంఠశోష కన్నీటి చెరువులెండిపోతున్నాయి
సూర్యుడు ఉదయిస్తూనే ఉంటాడు
ఏమీ లేదిక్కడ నినాదాలు తప్ప
.............some mixed feelings 1.5.2014 05:40 hours ISD
L

Wednesday, 16 April 2014

నాన్నా! నిన్నే ప్రేమిస్తున్నాను


నాన్న జ్ఞాపకంగా రాసిన నాలుగు  అక్షరాలకు స్వరపరిచి వినేసరికి  ఎందుకో వెంటాడుతూవుంది.
అందుకే కొన్ని చరణాలుగా చేర్చడానికి సాహసిస్తున్నాను


* * *

బాధలోనూ సంతోషంలోనూ
హల్లెలూయా అన్న స్వరం మూగబోయింది
గడచిన కాలంలో జ్ఞాపకాలు వెంటాడుతాయి

నన్ను ఎత్తుకొని ఆడించిన చేతులు
కళ్ళెదుట లేకున్నా

జీవిత నడక నేర్పటంకోసం గోదావరి ఇసుక తెన్నెలపై నడుస్తూ
చెవిలో చెప్పిన సంగతులు ధ్వనిస్తునే ఉన్నాయి

నాన్నా!
నిన్నే ప్రేమిస్తున్నాను

జీవితమంటే చంద్రమాన లెక్కలు కాదు
ఎవరో ఒకరిని తాకిన క్షణాలు జ్యోతులై వెలుగుతూనే ఉంటాయి

నాన్న! నీవే స్పూర్తి దాయకం

ముదిమి వచ్చువరకూ ఎత్తుకునే వాడున్నాడనే నమ్మకం
జీవిత పదానా మిమ్మల్ని నడిపించీ, మమ్మల్నీ నడిపిస్తూనే ఉంటుంది

నాన్నా! నువ్వే గొప్ప సాక్ష్యం

***

Tuesday, 8 April 2014

పగటిప్రయాణం


ఈ మధ్యకాలంలో ప్రయాణాలన్నీ రిజర్వేషన్లతో రాత్రిపూట సౌకర్యవంతంగా అలవాటయ్యాక, పగలు ప్రయాణం గురించి మర్చిపోయాము. నాన్న జ్ఞాపకార్థ ప్రార్థన (5.4.2014) అయ్యాక రిజర్వేషన్లు  ఏవీ దొరకక 6.4.2014 పగటిప్రయాణం వైపు ప్రయాణించక తప్పలేదు. ఏలూరు నుంది విజయవాడవరకు బస్సు ప్రయాణం. విజయవాడలో పాత బస్సును చూసాక ఫొటోలు తీయాలన్న ఆలోచన వచ్చింది. 

1932 నాటి బస్సు


విజయవాడలో auto



విజయవాడలో మద్యాహ్నం 2 గంటలకు నర్సపూర్ - నాగర్సోల్   ఎక్స్‌ప్రెస్స్ ఎక్కాక  మధ్యమధ్య కనిపించినవన్నీ తీస్తూ వచ్చాను. 







కచ్చితంగా ఊర్లపేర్లు గుర్తుకు లేవు అందుకని ఆవివరాలను ఇవ్వలేకపోతున్నాను. విజయవాడ నుండి గుంటూరు మీదుగా నల్గొండ వరకు ఫొటో సెషన్ నడిచింది.


ఎన్ని రంగులు , ఎన్ని నేలలు, ఎంత ప్రకృతి సౌదర్యం, పచ్చదనం, వరి, మొక్కజొన్న, మిరప 


రాతినేలలు





కొన్ని ఫ్లాట్ఫార్ములు 


పిల్లల సరదా సాహసాలు 


ఎప్పటినుంచో పరిచయమున్నట్లు కవ్వించిన చిన్నపిల్లలు Lasya, Surya Manaswini




రహదార్లు, జలాసయాలు 




.

 సూర్యాస్తమవ్వడంతో అక్కడికే స్వస్తి పలకడం జరిగింది