బాల్యంలో                                       
ఓ లేతనీలం చొక్కా వుండేది
బహుకరించిన ఆప్తులెవరో గాని     
అది తొడుక్కోవడమంటే మహా సరదా        
మెత్తగా వంటిని హత్తుకొనేది      
మెరుపేదో ఆ చొక్కాలోంచి ముఖంలో కనిపించేది
దాన్ని భద్రంగా         
ఇస్త్రీ మడత నలగకుండా పెట్టెలోదాచి     
ప్రత్యేక సమయాలకోసం                                              
నిరీక్షించడంలో ఉత్సుకత వుండేది     
వారం వారం       
ఇంటిలోని బట్టలన్నీ     
చాకలికి వుతకడానికిచ్చినా     
ఆ చొక్కా లేకుండా చూసేవాణ్ణి     
ఏ బండపైనైనా వుతికితే                       
దాని మెరుపుపోతుందని      
అంతమక్కువ ఆ చొక్కాయంటే      
కొంచెం పెద్దయ్యాక       
అందరూ ఏవేవో అంటున్నా      
అప్పుడప్పుడూ     
బిగుతైన ఆ చొక్కాని     
పెట్టెలోంచే తడుముతుండేవాణ్ణి      
యౌవ్వనం వివాహం సంసారం         
విద్య వుద్యోగం వెదకులాటల మధ్య    
మృదుత్వమేదో మర్చిపోయినా            
ఎప్పుడైనా ఎక్కడైనా       
లేతనీలం రంగుతో అందంగా కనిపిస్తే    
తప్పక అది నా భార్య ఎంపికే    
బాల్యపు అడుగులతో                
అద్దిన ఆ రంగు         
నా దేహంలో అంతర్భాగమయ్యింది      
నా కుటుంబంలో భాగమయ్యింది.           
------------------
13.9.2005
వార్త - ఆదివారం 22.1.2006