Wednesday 25 June, 2008

అజా

ఆజ్ ఈ రోజే
నఖాబ్ వెనుకున్న
స్వరాన్ని చెవినవేసుకున్నాను
గొంతును గుళికగా
నా గొంతున మింగాను
ఇప్పుడే వాన మొగులు
అప్పుడే మెరుపుతీగలు
అంతలోనే వస్త్రం సహించని ఉక్కపోత
అప్పుడప్పుడూ దుప్పటి వెదకే చలి
ఎందుకో జ్వరమాని బద్దలయ్యింది
సరికొత్తరాగమేదో సుడులు తిరుగుతోంది
పల్లవించే బాటలో
గళం కలిపే పాటలో
ముళ్ళను పూలగా మార్చబోతూ
సరికొత్త అజా పిలుపు
నవోదయానికి మలుపు
ముళ్ళను నరుక్కుంటూ
పరచుకుంటున్న కొత్తబాట
కళ్ళలో ఇంకిపోతున్న నదులను
అక్షరాల రాడార్లలోకి
ఒకొక్కటిగా దృశ్యీకరిస్తున్న సాంకేతిక కన్ను
ఆధిక్యపు బుర్ఖాల వెనుక మెదలుతున్న
కంటికి కనబడని ఎన్నోక్రిములను వైరస్‌లను
ముందుంచుతున్న మైక్రోస్కోపు కన్ను
ఇన్సానియత్‌తో కవిత్వాన్ని పలవరిస్తున్న ఆర్తినాదం
ఇస్ హిమ్మత్‌కో సలాం
నడుంబిగించిన పైటకు ప్రణామం

షాజహానా - నఖాబ్ చదివి 14.3.2005

Tuesday 18 March, 2008

నీకూ నాకూ మధ్య....

నిన్నర్థంచేసుకోవాలనే ప్రయత్నంలో
మనోనేత్ర మసకల్తో
కళ్ళలో నలుసుల్తో
నాకు నేను అర్థం కాక
నన్ను నేను అర్థంచేసుకోలేక
ఈ నా చిన్ని ప్రపంచంలో
సమస్యల సంబంధాలలోచిక్కి
సంబంధాల కొత్త బంధాల్ని కూర్చుకుంటూ
సౌకుమార్యమైన బంధాల నడుమ
ప్రేమ దయ కరుణ జనించే మృదుత్వాలు
రుచించని నాలుకలాంటి భావంతో
గుంపుల్లోకి పరుగెడుతుంటాను

లేని మృధుత్వాన్ని ఆపాదించుకుంటూ
తెలియని రుచులకోసం వెదకుతుంటాను

ఆ ప్రయత్నంలో
అప్రయత్నంగా
మంచుతెర పొరలమాటున
నా కళ్ళెదురుగా ఎదురయ్యే బింబం
తేరిచూస్తే
నా ప్రతిబింబమేమోనని సందేహం

సందేహాలనడుమ
తెరకప్పిన దేహంవెనుక
ఎంతవికారమైనదో నా రూపం
నాలోని వికౄత రూపాలు
గోముఖ వ్యాఘ్రంలా
ఘట సర్పంలా ప్రదర్శనమౌతుంటాయి
కుళ్ళిన మాంసపు ముద్దలా
కంపుకొడుతుంటాయి
వికృత రూపం భయానకమౌతుంది

తెరను చింపుకొని
పొరలుతెంపుకొని
నన్నునేను గుర్తించీదేపుడు ?
నా వికృతరూపాన్ని అర్థం చేసుకొనెదెప్పుడు ?
నిన్ను అర్థంచేసుకొనేదెప్పుడు ?
నన్ను నేను అర్థంచేసుకుంటే కదా!
నిన్ను అర్థంచేసుకొనేది

ఎప్పుడైనా ఎక్కడైనా
వెలుగురేఖలు ప్రసరించినప్పుడు
నా మసకల్ని విప్పుకుంటాను

ఎప్పుడైనా ఎక్కడైనా
ప్రవహించే నై ఎదురైనప్పుడు
నా దేహాన్ని కడుక్కుంటాను

నేస్తం! ప్రియా!
నీ ఆలింగనం కోసం నన్ను నేను సిద్ధంచేసుకుంటాను.

Saturday 16 February, 2008

నిజంగా కలుసుకుంటాం

ఒకేతోటలో పూచినపూలుగా
కత్తిరించబడినప్పుడు
ఒక్కటై జట్టుకడతాం
అంతలోనే ఒంటరి బొకేలుగా
విడిపోయి వెళ్ళిపోతుంటాం
ఎవరో ఒకర్ని అభినందించడానికి

కలిసిన పరిచయాల కరచాలన స్పర్శను
తనలోదాచుకొని జారిపోయాననుకొనే కాలం
అసంకల్పితం కాదు ... అందుకే
అది దాచుకోలేక
మనల్ని వర్తమానంలో కలుపుతూనే వుంటుంది

అక్షరాల నెగళ్ళలో
చలికాసుకుంటున్న వెచ్చదనం
తగులుతున్నప్పుడు
వేసుకున్న వస్త్రాలను విప్పుకుంటూ
కలుసుకుంటుంటాం

పదాల చౌరస్తాలలో
విభేదాన్ని భుజానవేసుకొని
చెరోదారై విడిపోయినా
నిరంతరం జ్వలించే అక్షరం
ఏవో బంధాల్ని కూరుస్తున్నప్పుడు
భుజానవేసుకున్న విభేదాన్ని కపడకుండా
ఓవర్‌కోటు వేసుకొని
పలకరింపుల నవ్వుల్ని పులుముకుంటూ
కలుసుకుంటుంటాం

ఒకరికొకరు తెలియని దృవాలలో
రేఖల వృత్తాలు గీసుకుంటున్నప్పుడు
అక్సాంశ రేఖాంశ పరిభ్రమణంలో
ఎక్కడోకచోట కలుసుకుంటాం

వెల్లువెత్తిన భావాలను
కెరటమై ఎగసిపడినప్పుడు
ఆనందాన్ని పువ్వులుగా పూయించి
అభినందనతో వెంటవచ్చిన పరిమళం
పదే పదే శ్వాసకు తగులుతున్నప్పుడు
కలుసుకుంటూనే వుంటాం

ఆగలేని ఒన్‌వేలలో పడి దాటిపోయినప్పుడు
చూపులతోనే మూగతరంగాలలో
స్పృసించుకుంటూ
కలుసుకుంటాం

కాని...
తన్ను తాను వెతుక్కుంటున్నవాడు
కాలాల దారుల్లో
నిన్నూ నన్నూ నిద్రలేపి
పదాల బంధాల ఫ్రేములలొ పెట్టి
భూతద్దపు నేత్రాలతో వెతుకుతున్నప్పుడు
వెతుకులాటల జీవనాదంలో
నిజంగా కలుసుకుంటాం


సాహిత్య ప్రస్థానం అక్టోబరు-డిశెంబరు 2004
కవిత 2004 (విశాఖ)

ఏదైనా...

అదో తేనెతుట్ట
ఆదమరచి పొడిచావో
ఈగలు చుట్టి ముట్టడిచేస్తాయి
ఒడుపెరిగావో
ధారల ధారల తేనంతా నీదే
ఇంకాస్త ముందుకుపో
రాణీ ఈగ నిన్ను మోహిస్తుంది
మిగతావన్నీ నీవెంటే.

Thursday 7 February, 2008

అలలపై మెరుపుతీగ

శ్రీమతి ప్రేమగా
పలుమార్లు పిలుస్తున్నా
పలుకని పరధ్యానం
పిల్లల ముద్దుపలుకులేవి
తీపిగా రుచించనితనం
టెన్నిస్ తెలియని నాకు
సానియాను ఓడిస్తున్నట్టు

బ్యాటు ఎప్పుడూ పట్టని నేను
సచిన్‌తో కలసి పరుగులుతీస్తున్నట్టు

నారాయణరెడ్డినో
శివారెడ్డినో
అనుసంధానపు దారాలతో
పతంగిలా ఎగరేస్తున్నట్టు

ఎక్కడెక్కడో రగిలి
కమ్ముకుంటున్న చీకట్లతో
ఎండిపోతున్న ఆకలిపేగులో
మెలివేస్తున్న బాధంతా
ఒక్కసారిగా అనుభవిస్తున్నట్టు

అధికవేడిమికి చిట్లిపోయే గాజులా
క్రౌర్యం కర్కశం పెళ్ళున పగిలి
వీధుల్లో పారుతున్న రక్తం
నాపై ప్రవహిస్తున్నట్టు
ప్రవాహంలో కొట్టుకపోయే
దేహపు గాయాల సలుపంతా
నా నరాలలో ఎగబాకుతున్నట్టు

రాలియెండిన ఆకులపై
నడుస్తున్న సవ్వడి వింటున్నట్టు

తపతపమంటున్న బురద దారుల్లో
కాళ్ళపైవస్త్రాన్ని పైకిలాగి
ఆచి తూచి అడుగేస్తున్నట్టు

సుదూరాలనుండి వస్తున్నాననే
ఆప్తులంపిన సందేశంతో
ఆలస్యమైన రైలుకోసం
గడియారపు ముల్లును
పరీక్షిస్తూ నిరీక్షిస్తున్నట్టు

నిద్రరాని రోగిలా
ధ్యానంకుదరని యోగిలా
సీటుదొరకని ప్రయాణికుడిలా
అసహనంగా పచార్లు చేస్తున్నట్టు

రేవులో బడపైనో
అటూ ఇటూ కదిలే వాషింగుమిషన్లోనో
వుతికిన దేహాని పిండుతున్నట్లు

శాఖలుగా విస్తరించిన చెట్టుఆకుల్లోంచి
మెరుస్తున్న సంధ్యలో
ఒక్కవుదుటన
ఎగిరే పక్షుల కోలాహలంలో
నేనో పక్షినై ఎగిరినట్లు

గజ గజ వణికిస్తున్న చలిలో
నెచ్చెలి వెచ్చని కౌగిట్లో బంధిస్తున్నట్లు

సలసల కాగుతున్న ఎసరు
కుతకుతవుడికి గంజివంచిన అన్నం
సెగలుపొగలు కక్కుతున్నట్లు

ఆగి ఆగి కూతవేస్తున్న కుక్కరులా చెవిలో ఏదో కూతలరొద
ఒ అలజడి ఓ బాధ
ఇది జ్వరం కాదు
అక్షరాలను చెక్కుతున్న ఉలి
పదాలను నెమరేస్తున్న అలికిడి
ఉబుకుతున్న జల
ఎగసిపడుతున్న తరంగం

అప్పుడప్పుడూ
ఉలితో నన్ను నేను చెక్కుకుంటాను
జలాలతో తలారా స్నానం చేస్తుంటాను
తరంగాన్ని పట్టుకోవడం కోసం
మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తుంటాను

అప్పుడది
అలలపైన తేలియాడే మెరుపుతీగ
నన్ను స్కానుచేస్తున్న యాంటీ వైరస్
నేటినిజం 11.08.2005

Wednesday 6 February, 2008

జారిపోయిన బాల్యం

చిన్నీ!
అని పిలిపించుకున్న బాల్యం
ఎప్పుడో ఎక్కడో
చటుక్కున జారిపోయింది
ఆ ఘడియేదో కొంచెంచెపుతారా!
ఆ చోటేదో కొంచెం చూపిస్తారా!
ఎంతదూరం నడిచివచ్చానో
ఎంత శ్రమైనా
ఒక్కసారి ఆ చోటులో
కేరింతల ఆనందాన్ని
ఆలింగనం చేసుకుంటాను
హంసల్ని పిలుస్తాను
వేరుచేయడానికి
కాకుల్ని పిలుస్తాను
పుండులో పురుగులేరుకోవడానికి
పక్షిరాజును ఆవాహన చేసుకుంటాను
ఒకొక్కటిగా ఈకలు రాల్చటానికి.

Tuesday 8 January, 2008

తప్పని మోతే యిది

నెలలునిండిన గర్భం
ప్రసవమో
సిజేరియన్నో తప్పదు

అక్షరం గర్భంలో
నిండేదెపుడో ?

ఇప్పుడే కుదురు కట్టినా
ఎప్పుడో దాల్చినా
మోయడం తప్పదు

దారుల్లో ప్రయాణాల్లో
శ్వాసలో నిద్రలో

బరువెక్కిన వక్షం
క్షీరమై పొగేవరకూ

అదిగో
పిల్లలు పాడుకుంటున్నారు పాటగా।


(శ్రీ ఎండ్లూరితో కొచెంసేపు 23.1.2006)

Saturday 5 January, 2008

తెరిసిన మూసిన కవిత

రెండచుల్ని పట్టుకొని
అచ్చాదనలేని దేహంపై
వస్ర్తాన్ని కప్పుకొన్నట్టే
చీరలుగా, చుడీదార్లుగా
షర్టులుగా, కోటులుగా మారుతుంటే
అద్దం భళ్ళున బద్దలయినట్టే
కవిత చదవడమంటే

పోటెక్కిన వరద వుదృతిలో
ఈదులాడుతున్నట్టే
వూతం దొరికితే, తీరం కనబడితే
వేసే బారల బారల బిగిసిన వూపిరి తెప్పరిల్లినట్లే
కవిత చదవడమంటే

వర్తమానాన్ని సర్రున చింపి
జ్ఞాపకాల అంచులగుండా
స్మృతుల బావిలో బొక్కెనవేసి
బాల్యాన్ని చేదుకున్నట్టే
కవిత చదవడమంటే

చితుకులతో వుడికిన మెతుకు
కారాన్ని పులుముకొని
పంటిగాట్లకు నలుగుతూ
నకనకలాడే ఆకలి పేగులోకి
సర్రున జారుతున్నట్టే
కవిత చదవడమంటే

పరువాల పరదాలుతీసిన పండువెన్నెల్లో
పరిమళాల సుగంధాలతో
మరిమరి మురిపించే చెలితో
సరసాల సరాగాలు ఆలపించినట్టే
కవిత చదవడమంటే

చిక్కులవిచ్చుల మెలికల్లో
అరవిచ్చిన మొగ్గలఆలోచనకు
పరిష్కార పల్లవి దొరికి
మెట్టుమెట్టుగా సౌధాలపైకి ఎగబాకుతున్నట్టే
కవిత చదవడమంటే

శబ్దమై నిశబ్దమై
తరంగాలలో అటునిటు తేలియాడి
తీరాలకు చేర్చబడి సేదదీరి
అనంతసూర్య స్నానమాడుతున్నట్టే
కవిత చదవడమంటే

చిరుగుజేబుల దారుల్లో
పరుగుల వత్తిడి చక్రాలలో నలిగే
రక్తంస్రవించని గుండెగాయాలకు
లేపనం పూస్తున్నట్టే
కవిత చదవడమంటే

చదివి చదివి
నలిగి నలిగి
నడచి నడచి
పరుగెత్తి పరుగెత్తి
రాలిపడిన విత్తనంగా
ఆలోచనలో అంకురించడమే
తెరిచిన కవితను మూయడమంటే


సాహిత్య ప్రస్థానం (త్రైమాస పత్రిక) జనవరి-మార్చి 2005

Friday 4 January, 2008

తెరిసిన మూసిన కవిత

రెండచుల్ని పట్టుకొని
అచ్చాదనలేని దేహంపై
వస్ర్తాన్ని కప్పుకొన్నట్టే

చీరలుగా, చుడీదార్లుగా
షర్టులుగా, కోటులుగా మారుతుంటే
అద్దం భళ్ళున బద్దలయినట్టే
కవిత చదవడమంటే

పోటెక్కిన వరద వుదృతిలో
ఈదులాడుతున్నట్టే
వూతం దొరికితే, తీరం కనబడితే
వేసే బారల బారల బిగిసిన వూపిరి తెప్పరిల్లినట్లే
కవిత చదవడమంటే

వర్తమానాన్ని సర్రున చింపి
జ్ఞాపకాల అంచులగుండా
స్మృతుల బావిలో బొక్కెనవేసి
బాల్యాన్ని చేదుకున్నట్టే
కవిత చదవడమంటే

చితుకులతో వుడికిన మెతుకు
కారాన్ని పులుముకొని
పంటిగాట్లకు నలుగుతూ
నకనకలాడే ఆకలి పేగులోకి
సర్రున జారుతున్నట్టే
కవిత చదవడమంటే

పరువాల పరదాలుతీసిన పండువెన్నెల్లో
పరిమళాల సుగంధాలతో
మరిమరి మురిపించే చెలితో
సరసాల సరాగాలు ఆలపించినట్టే
కవిత చదవడమంటే

చిక్కులవిచ్చుల మెలికల్లో
అరవిచ్చిన మొగ్గలఆలోచనకు
పరిష్కార పల్లవి దొరికి
మెట్టుమెట్టుగా సౌధాలపైకి ఎగబాకుతున్నట్టే
కవిత చదవడమంటే

శబ్దమై నిశబ్దమై
తరంగాలలో అటునిటు తేలియాడి
తీరాలకు చేర్చబడి సేదదీరి
అనంతసూర్య స్నానమాడుతున్నట్టే
కవిత చదవడమంటే
చిరుగుజేబుల దారుల్లో
పరుగుల వత్తిడి చక్రాలలో నలిగే
రక్తంస్రవించని గుండెగాయాలకు
లేపనం పూస్తున్నట్టే
కవిత చదవడమంటే


చదివి చదివి
నలిగి నలిగి
నడచి నడచి
పరుగెత్తి పరుగెత్తి
రాలిపడిన విత్తనంగా
ఆలోచనలో అంకురించడమే
తెరిచిన కవితను మూయడమంటే


సాహిత్య ప్రస్థానం (త్రైమాస పత్రిక) జనవరి-మార్చి 2005