Thursday, 8 November 2007

మొలక

గింజగుండెల్ని రెండుగా చీల్చి

అంకురించిన అంకురం

ఎక్కడ్నించి వచ్చిందో!

దేహపు అలయంలో

గుండెగూడులో వొదిగి

ప్రతిష్టించిన ఆరాద్యరూపాన్ని

అంజనీపుత్రుడు

ఛాతీని చేతులతో చీల్చినప్పుడు

లీలలై ఎలాకదలాడిందో!

తూరుపు పడమరల

పొటమరించిన రసకాంతి

ఋజుమార్గపు చలనం

మూడట్టల ప్రయోగంగా

ఏక రేఖాంశమవడానికి

ఎన్ని మలుపుల పయనం

మలుపుల వొంపుల్లో

ఎక్కడో వొకచోట అంకురిస్తుంది

స్పర్శించడమే కష్టం

కదిలికల రాపిడుల్లో

ఎక్కడో వొకచోట చీల్చుకొస్తుంది

దర్శించడమే కష్టం



(విజ్ఞానసుధ మాసపత్రిక - అక్టోబరు 2004)