Thursday 19 September, 2013

యుద్ధం...యుద్ధం...

|
కాలానికి ఏదో అంచున నీవు నేను
యుద్ధం మొదలయ్యిందిప్పుడే

నిన్ను చెక్కినవాడు
చేతివేళ్ళకు యుద్ధ తంత్రాన్ని నేర్పాడు తెలుసా!

వాక్యమనే రెండంచుల ఖడ్గాన్ని
వేళ్ళు ముడిచిన గుప్పెటలో పెట్టాడు

పలుకుతున్న కొద్దీ తెగిపడుతున్న
అంగాలు  ఎవరివో చూసావా!

తెగిపడ్డ వాటినుంచి మొలకెత్తే సాయుధులు
ఏపక్షాన్ని వహిస్తున్నారో గమనించావా!

***

ఒక్కోసారి యుద్ధతంత్రాలన్నీ
ఎండిన ఎముకల లోయైనప్పుడు
శబ్దించే నినాదమై
వెంటుండే సైన్యాన్ని ఊహించి పిలువగలవా

శత్రువును బలాబలాల ప్రక్కకు తోసి
నిరాయుధుడననే  దిగులుమాని ఎదిరించడానికి
తెగువ చూపగలవా!

***

యూద్ధం అనివార్యం
నీ చుట్టూ అందరూ యుద్ధాన్ని నేర్చినవారే
అయినా
కుటుంబమని, బంధువర్గమని బ్రమ పడుతుంటావు
ఎవరి యుద్ధం వారిదే.

***

సుడులు తిరిగే ఆలోచనలు
తేనెటీగల్ల రేగినప్పుడు
యుద్ధనైపుణ్యాలను సాధన చెయ్యాలి

కాలానికి ఏదో అంచున నీవు నేను
ప్రతిక్షణం యుద్ధం కొత్తగా  మొదలౌతుంది.

------------------------------19.9.2013 6:17 hours ISD