Tuesday, 25 September 2007

వుబికే బిందువుల్లో ఓ నది

(ఎక్స్ రే 2003 _ ఉత్తమ కవిత పురస్కారం డా. మిక్కిలినేని, శ్రీ శివారెడ్డి తదితరులు)

జీవనతీరాలలో

ఓ నది ప్రవహించింది

వురకలు వేసింది

పరవళ్ళు తొక్కింది

ప్రసాంతంగా నడిచింది

మలలమాడ్చిన ఎండల్లో

పొడిబారిన ఇసుకతెన్నెల్లో

సన్ననితీగై సాగింది

ఎడతెరుపెరుగని జల్లుల్లో

ఎదనిండా బురదున్నా

వురికి వురికి పొర్లింది

పాయలుగా రేవులుగా మారి

వురికి వచ్చే దాహార్తులకు

దాహం తీరుస్తూ

ఈతలు నేర్పుతూ

నిరంతర వాహినిగా

ప్రవాహపు నాదాన్ని, ఖేదాన్ని

అంతఃరాల లోతులలో దాచుకొని పారింది

పాఠాలు నేర్పింది

రాదారుల్ని పరచింది

జీవం పోయిందని

గుప్పేడుమట్టితో పూడ్చడానికి

తరలిపోయే ప్రవాహం

తలో పిడికిలితో గుట్టలుచేసినా

నిశ్శబ్దంగా

వుబికే బిందువుల్లో

నిశ్ఛింతగా నిదురోతున్నది

ఎప్పుడో

దోసిళ్ళు దాగిన నీళ్ళు

ఇప్పుడు అదే దోసిళ్ళలో

అశ్రువులై ప్రవహిస్తున్నాయి



ఎక్స్ రే 2003 _ ఉత్తమ కవిత పురస్కారం
విశాలాంద్ర 24.4.2005
జీవనోత్సవం _ సంకలనం

చెట్టంటే భయపడే మనసు

మొక్కగా ఎదుగుతున్నప్పుడు

లాలించే మనసు

చెట్టుగా ఎదుగుతుంటే భయపడ్తుంది

విస్తరించే కొమ్మల్లో ఏ నీడలుంటాయో?

చెట్టు జ్ఞానానికి ప్రతీకయే

ముచ్చటపడి కట్టుకున్న సరిహద్దుగోడలు

కూలిపోతాయంటే భయం

ఎండపొడ తగలనివ్వని

కాక్రీటు చెట్ల మధ్య

పత్రహరితానికై విలవిలలాడే కొమ్మలు

ఏమి యెదుగుతాయంటూ

ఏ దిక్కులోనో దాచిని వాస్తుగా

అవసరాల విద్యుత్తు కాంతికి

అడ్డు తగులుతున్నాయంటూ

చేతులను నరకడానికే ప్రయత్నలు జరుగుతుంటాయి

ఎన్ని భ్యయాలు ముసురుతున్నంత వరకూ

చిగురులుతొడిగే చెట్టులా

ఏదగడమే లక్ష్యం
११.११.२००५