సాయంత్రాలు, చెట్టునీడ ఒకప్పుడు కొత్తకాదు
విశాలపరచుకుంటున్న రహదార్లమధ్య నలిగి
అనంతానంత చక్రాలు దూసుకొస్తుంటే
తలపోయడంమే మిగిలింది.
* * *
అనుకోని సమయం ఎదురైనప్పుడు
ఒక సాయత్రం
ఒక చెట్టునీడ
వెన్నెల పరిచేందుకు సన్నాహం
జరీఅంచు చీరకట్టిన ఆకాశం
చినుకులై పలకరించకుండా ఎలావుంటుంది?
ధ్వనించే అక్షరాలు పుప్పొడులై రాలినచోట
నింగికెక్కిన చుక్కలు దిగివచ్చి పలకరించకుండా ఎలావుంటాయి?
అక్షరాలు రెక్కలుతొడిగి
చెట్టుకొమ్మలకు వ్రేల్లాడుతూ
నేర్చిన సంగీతమేదో ఆలపించకుండా ఎలావుంటాయి.?
* * *
అది...
ఎప్పుడో విన్న చదివిన పద్యమే కావొచ్చు
ఎప్పుడో కలిపిన హస్తమే కావచ్చు
ఎప్పుడో నడిచిన మార్గమే కావొచ్చు
కొన్ని జ్ఞాపకాలవెంట పరుగులెట్టి
చలికోసంవేసుకున్న ఉన్నివస్త్రాలను విప్పకుండా ఎలా ఉండటం?
నిద్రమాను పత్రాలు ముకిళితమౌతూ వెన్నెలను ఆహ్వానిస్తుంది
కాడమల్లె(నైట్‌క్వీన్) చుట్టూ పరిమళాన్ని పరుస్తుంది
అంతరళాలలోని కోకిల కొత్తపాటను సిద్దంచేస్తుంది
ఇక సాయత్రం ఆ చెట్టునీడ
మరో సన్నాహంకోసం ఎదుచూడకుండా ఎలావుంటుంది ?
రెప్పలనుంచి లోలోకి నడచిన పాదముద్రలు
భద్రపర్చేందుకు నన్ను నేను సిద్ధం చెసుకోకుండా ఎలా ఉండటం?