Wednesday 24 September, 2014

ఇంతదూరం నడిచొచ్చాక -4

~*~
నీ కోసమే
నీకు నాకు తెలిసిన పాటొకటి పాడుకుంటూ తిరుగుతున్నా

ఎక్కడికి పారిపోగలం
బాల్యంలో ఆ చివర నువ్వు, ఈ చివర నేను
క్రిందికి మీదికి ఊగినట్టు ఊగుతుంది మనసు

నిత్యం చూసే ముఖాల మధ్య
అక్కడే అతుక్కుపోవడం
ఎవ్వరూ గుర్తించని ముఖాన్ని తొడుక్కుని
ఎక్కడికో పారిపోవడం
నిత్యజీవనంలో ఏదైనా సాధ్యమే!

**

ముఖ కవళికలతో ఎవర్నో గుర్తించాననుకుంటాను
సమూహాలలో పడి ఎక్కడో ఏదొ మర్చిపోతాను

మట్టి పరిమళాన్ని గుర్తించాననుకుంటాను
సరికొత్త అత్తర్లు(స్ప్రేల)మధ్య నాసికను కోల్పోతాను

నాల్గక్షరాలను పాదాలకు చక్రల్లా కట్టుకుని
జ్ఞానానంతర రెక్కలు చాపి
ఖండాంతరాలకు ఎగిరిపోతాను

రెక్కలనెవరో దొంగిలించాక
అమ్మవేలుపట్టి నడిచిన ఆ ఇల్లు కళ్ళముందు కదలాడుతుంది

బహుశ అప్పుడు
ఎక్కడోపెట్టి మర్చిపోయినట్టు
అమ్మానాన్నల చిత్రంకూడా సమయానికి చిక్కకుండాపోతుంది

**

నీకు తెలుసా !
నా జేబునిండా ఎన్ని గుర్తింపు కార్డులో
అయినా
నన్నెవరు గుర్తించని
ప్రతి వసంతానికి కొత్తచిగురొచ్చినట్లు
ఆ వీధి, ఆ బడి, ఆ వూరు

**

ఎటూ పారిపోలేని వంటరి రాత్రి
గదిలో నాల్గు మూలలూ తిరిగుతూ
ఎవ్వరినో కలుసుకోవాలని ఇటూ అటూ తిరుగుతుంటాను

**

గాలిపటంకోసం దారపుకొసను ముడివేసినట్టు
అరె!
మీరు ఫలానా కదూ! అనే పిలుపొకటి వినిపిస్తుంది
కొత్తరెక్కలు మొలుచుకొస్తాయి

---------------------------------------------------
24.9.2014 మూడవ జాము 02:20 గంటలు(ఇండియా)

Tuesday 16 September, 2014

సుమభాషితం


~*~

1
 సుతారంగా పూలల్లడం
ఓ కళ
ప్రతిదానికి ఒక సమయం ఉన్నట్టే
పూలల్లడాన్కి ఓ సమయం ఉంది

2
 పరిమళం నిండిన రేకల్ని
మునివేళ్ళతో పట్టుకుని
దారాన్ని ముడివేయడం
ఒకదానివెంటకటి చేర్చడం
కొన్ని చేతులకే సాధ్యం

3
మాటలల్లడం అందరూ నేర్చే విద్యే
మాటల్లో పరిమళాన్ని పొదగడం
ఒక మనసుతో మరో మనసును
కంటికి కనిపించని అనుబంధపు దారంతో
ముడివేయడమే క్లిష్టమైనది

4
పూలబాల పాడిన పాట
అప్పుడప్పుడూ చెవిలో దూరి ‘కరుణ ‘శ్రీని మేల్కొల్పుతుంది
అయినా సంవత్సరలుగా
కోటానుకోట్ల పూలమెడలో ఉరితాళ్ళు బిగుసుకుంటూనే ఉన్నాయి

5
 అన్నట్టు…
ప్రతి అవసరానికి ఏదొక పరికరాన్ని కనిపెట్టిన మనిషి
పూలల్లడానికి యంత్రమో పరికరమో కనిపెట్టాడా?

6
 పూలపరిమళం లాంటి మనుషుల్ని
సుకుమార రేకల్లాంటి మనసుల్ని
వార్ని కట్టివుంచే దారాల్ని
పొత్తిళ్ళకు మెత్తలు సిద్ధంచేసిన చేతుల్ని
బాల్యాన్ని బాల్యమిచ్చిన అనుబంధాల్నీ
దూరం దూరంగా వేళ్ళాడదీయడం
ఇప్పటి కళ్లలో మెరిసే కళ.

7
జీవితంలో
ఒక్కసారైనా పూలల్లడాన్కి ప్రయత్నించాలి.

Published : http://vihanga.com/?p=12737


దర్శిస్తే .....

కొండమీదనుంచి దృష్టిసారిస్తే
సుందరదృశ్యాలు కన్పడతాయి

అక్కడక్కడ కొన్ని కొండలు
నగరాలను చూపిస్తాయి

పాము మెలికలు తిరుగుతూ నడుస్తున్నట్టు
కొన్ని కొండలను తాకుతూ నదులు సాగిపోతాయి
చెట్లాకులతో హరితవస్త్రాన్ని ధరించి హొయలుపోతాయి

నదికి నిశ్చలత్వం లేనట్టే మనసు కూడా
కొద్దిసేపు ఆ నదిలో చేపనై ఈదాలని
ఈది ఈది అలసిన చేపకు రెక్కలొచ్చి
హరిత వస్త్రంపై వాలి సేదదీరాలని ఉవ్విళ్ళూరుతుంది

కొన్ని కొండలు దేవతానిలయాలు
వలయాలు వలయాలుగా చిక్కుకున్న మనిషి
వీటిమధ్య తిరుగుతూ ఉంటాడు

***

కొండలను పిండిచేసే రహస్యాన్ని పసిగట్టిన మనిషి
సొరంగాలు తవ్వి, రోడ్లు పరిచి
తన కనుసన్నల్లోకి తెచ్చుకోవాలనుకుంటాడు
సాధ్యమయ్యిందనుకున్నప్పుడు విర్రవీగుతాడు

తన రహస్యాలను విప్పనివాడు
ఇంకా కొన్ని కొండల రహస్యాలను దాచివుంచుతాడు

........13.9.2014 23:00 hours ISD

Wednesday 10 September, 2014

కవిత రాయాలని నేను ఎన్నడూ ప్రయత్నించను

ఆలోచనల్ని మడచి
బద్దకంగా రాత్రి నిశ్శబ్దంలోకి జారుకోవాలనుకుంటాను
అనుకుంటాం గానీ
రాత్రి నిశ్శబ్దమైనదేమీ కాదు సుమా!

రాతిపొరల్లోంచి నేలపొరల్లోంచి
ప్రయాణించే ప్రవాహమొకటి మొదలౌతుంది

వరదనీటికి పోటెక్కిన నదీతీరాలను దాటలేక నిస్తేజంగా నిలబడిపోతాను

ప్రవాహాలలో ఈదడం ఓ సాహస కళ

*
చీకటిని ముసుగుగా తెచ్చుకున్న రాత్రి
రోజూ నే నడిచే చోటుల్లోనే భయపెట్టాలని చూస్తుంది

*
పూలకుండీలో కనకాంబరవిత్తనం పగిలిన చప్పుడు

పక్కింటిలో పాలకేడ్చే పసిపిల్లల  ఏడ్పు 

రాత్రిని పెనవేసుకున్న దేహాల శ్వాసలు                     

నిద్రరాని రాత్రినీ
నిర్లక్షానికి గురయ్యే ముసలితనంతో గెలవాలనే మూల్గులు

నిద్రలేపి
ట్రాఫిక్ ఆక్షలు లేని రహదారులగుండా
బ్రేకులేని వాహనంలో కూర్చోబెడుతుంది

అప్పుడే పడుతున్న తుంపర జడివానగా మారుతుంది
అలజడిరేపేందుకు గాలి తోడౌతుంది

ఒక బెదురు
ఒక ప్రకంపన
ఒక సందిగ్దం
లోయలగుండా, వరద ప్రవాహాలగుండా కొట్టుకుపోతున్నట్టే
*
ఒక్కొక్కటిగా
అక్షరాలు ఒదగబడతాయి
*
కనులు తెరిస్తే
తూర్పున వెలుగు రేఖకు
చీకటి ఎలా పారిపోయిందో గుర్తుకు రాదు

ఇక కవితై మీ ముందు కూర్చుంటుంది 
9.9.2014 00:20 hours ISD
******

Monday 8 September, 2014

ఏదైనా రాద్దామా! వద్దా!!

~*~
గోడలపై అలా
ఉప్పొంగిన సముద్రపు అలలా
రాయడానికి ఏమైనా ఉందా
గోడలిప్పుడు వీధుల్లో లేవు
ప్రపంచవీధుల్లోకి వచ్చాయి
నిద్రరాని రాత్రిని కత్తిరిస్తూ
గోడలపై ఎదో రాయాలని
గోడనిప్పుడు దేనికి ప్రతీక చేయలంటారు!
~*~ 
అలా బాల్యంలోకి నడిచివెళ్తే
నివాసాలమధ్య గోడలెక్కడా కన్పడవేం!
~*~
ఒకప్పుడు
 
గోడపై నల్లబోర్డుమీదా రాసినవాటిని
 
ఎప్పటికప్పుడు చెరిపేసినా
జ్ఞానమేదో వికసించిందంపించేది
ఒకప్పుడు 
గోడమీద రాతల్ని చదివి
 
ఎవరి తలరాతలో మార్చడానికి
ఉప్పెనయ్యేందుకు ప్రవాహాలు కదిలేవి
ఒకప్పుడు
కొందరు మిత్రులు కలిసి
రాత్రివేళల్లో గోడలపై రాస్తున్నప్పుడు
వెంటపడ్డ కుక్కలు, మీదపడ్డ లాఠీలు
చెప్పుకోలేని అనుభవ జ్ఞాపకాలు
ఇప్పుడు
ఎవరి గోడను వారు అందంగా అలంకరిస్తారు
*
అప్పుడూ ఇప్పుడూ
గోడలపై
వ్యాపార ప్రకటనలు, సినిమా పోస్టర్లు
పూలదండలు, బురద, పేడముద్దలు
ప్రవృత్తి సంకేతాలు

***

7.9.2014 02:40 hours ISD

Friday 5 September, 2014

ఇంతదూరం నడిచొచ్చాక - 3


~*~

నిన్ను ప్రేమిస్తున్నాని చెప్పలేని
ఒకానొక సందిగ్దావస్థలో
మొగ్గతొడిగిన ప్రేమ
లోలోనదాగి
పుస్తకంలోనే ఎండిపోయింది
ఇప్పుడు
వయస్సు తెచ్చిన ధైర్యమో, అనుభవమో
కథలు కథలుగా
మాటలు పొరలు పొరలుగా
ఎందరిముందైనా విప్పాలని చూస్తుంది

~*~

కొన్ని సిగ్గులపరదాలు తొలగిపోయాక
ఎగిరొచ్చే సీతాకోకచిలుకల ఊహలకు కిటికీలు మూసుకుపోయాక
ప్రతిస్పందనేది ఉండదు కదా!
అయినా
నిలబడ్డ చోటులోకి ఎగిరొచ్చే పిట్టలకు
తీరిగ్గా
కొన్ని గింజలు జల్లడమే!
ఒక్కసారి
ఎగిరిపోయిన పిచ్చుక
మళ్ళీ వస్తుందనే నమ్మకమేమీ లేదు

~*~

క్లాసు రూమో, లైబ్రరీయో
చేతులుమార్చుకున్న నోట్సు
ప్రత్యేకదుస్తుల్లో అలంకరణో
బస్సుకోసం నడిచిన కొద్దిదూరమో
దూరంగా మూగగాచూస్తూ గడిచిపోయిన కాలమో
ఒకానొక క్షణానికి కొంచెం జీవంపోసి
చిత్రించడాన్కి చేసే ప్రయత్నం
వర్తమానంలో నూతనుత్సాహాన్నిస్తుంది

4.9.2014.......08:20 hours ISD

Thursday 4 September, 2014

ఇంతదూరం నడిచొచ్చాక - 2

~*~
Photo :కాశి రాజు  

చెరువులను వెతుక్కుంటూ
కలువలను తెంపుకోవడం కష్టమే కావచ్చు
బురదంటిన కాళ్ళతో
కొన్ని
తామర/కలువ పూలను మిత్రులకివ్వడంలో
ఏముండేదో అంచనావేయడం సులువేనంటారా!

తిరిగిన మలుపులూ
బసచేసిన మజిలీలూ
పొందిన అనుభవాలూ
కలసుకున్న అనుబంధాలూ
అన్నింటిమధ్య
బహుశ
మనోపలకంలో తామర/కలువలు చెరిగిపోవచ్చు
ఎండిపోయిన చెరువుగట్లపై
దారులు విడిపోయినట్లు
చెరోభావజాలాల దారులయ్యాక
అందుకున్న స్నేహహస్తం
భుజం తట్టిన ప్రోత్సహక స్పర్శ
ఎక్కడ మూటగా మిగిలిపోయిందో వెదకాల్సిందీ
పురావస్తు పరిశోధనలా తవ్వుకోవల్సిందేదీ లేదనిపిస్తుంది

~*~

గడచిన కాలం
ఏదొక భావావేశాన్ని దాచివుంచుతుంది !

~*~

వస్తుప్రపంచాన్కి కొలమానాలెక్కువ
అందుకే
ఏదీ ఎక్కువకాలం ఉండదు

నీవు నన్నూ
నేను నిన్నూ వెదకటం కష్టమే !
తెలియనితనపు సమయంలో
నవ్వినప్పుడు రాలిపడ్డ రేకల్లో
ఎంతోకొంత పరిమళం నాసికలో
రెప్పల్నిదాటి రాలిపడ్డ చుక్కలు
ఘనీభవించిన స్పటికమై దాగివుంటాయి

~*~

వెదకినప్పుడే కదా ఏదైనా దొరికేది !
అందుకు
కలవరేకుల కన్నుల్ని తెరవాల్సిందేగా !

...........29.8.2014.....13:00 Hours ISD

(ఎత్తుగడ మరియు ముందు  రాసిన కవితలోని పదాలు ఉన్నాయిందులో.)

ఇంతదూరం నడిచొచ్చాక - 1

దారిని వెతుక్కుంటూ
వెనక్కు వెళ్ళడం కష్టమే కావచ్చు
తిరిగిన మలుపులూ
బసచేసిన మజిలీలూ
పొందిన అనుభవాలూ
కలసుకున్న అనుబంధాలూ
బహుశ
మనోపలకంనుండి చెరిగిపోవచ్చు
పురావస్తు పరిశోధనలా తవ్వుకోవల్సిందే !

అందుకున్న స్నేహహస్తం
భుజం తట్టిన ప్రోత్సహక స్పర్శ
ఎక్కడ మూటగా మిగిలిపోయిందో వెదకాల్సిందే!

~*~

అపజయాలూ
అవమానాలూ
ఆనందాలూ
సన్మానాలూ
ఏదొక భావావేశాన్ని దాచివుంచుతాయి !

~*~

వస్తుప్రపంచాన్కి కొలమానాలెక్కువ
అందుకే
ఏదీ ఎక్కువకాలం ఉండదు
నవ్వుతూ ఏడ్వటం
ఏడుస్తూ నవ్వడం
రెంటినీ దిగమింగడం కష్టమే !
నవ్వినప్పుడు రాలిపడ్డ రేకల్లో
ఎంతోకొంత పరిమళం నాసికలో
రెప్పల్నిదాటి రాలిపడ్డ చుక్కలు
ఘనీభవించిన స్పటికమై దాగివుంటాయి

~*~

వెదకినప్పుడే కదా ఏదైనా దొరికేది !

..............................29.8.2014 08:30