Tuesday, 17 July 2007

నిద్రలో మరో కల


నిద్రలో మరో కల
అడుగులు నేర్వని
బుడుగు పాదాలను కడిగిన వేళ
జారుడు వూగిసలాటలో
మెరిసిన బిందువుగా
ముద్దుల వర్షంలో ఆవిరయ్యాయి
పదంనేర్చి పథం ప్రాకులాటలో
పొరలమాటున దాగిన
ఈ వన్నె దేహాన్నంటి
జారుతున్న బిందువులపై
ప్రసరించి మెరిసిన కిరణపు వెలుగు
తళుకు కాంతులైనప్పుడు
నీ ఆశల కిరణాలుగా చుటుముట్టాయి
నాకోసం పరిశమించిన పాదాలను ముద్దాడలనివుంది
నేనందుకోలేని దూరంలో నీ పాదాలు
ని రెప్పలు నిద్రలో మరోకల కంటున్నాయి
నా కోసం
__________
అమ్మ కోసం ఈ కవిత

ఓ ఉషోదయం



వెచ్చదనాన్నిచ్చిన దుప్పటితీసి
నిశిరాత్రి మింగేసిన నిద్రనుంచి
బద్దకంగా వళ్ళువిరుచుకుంటుంటే
చురుక్కున తాకిన దృశ్యం
వినీలాకాశం వింతసోయగాల్నిసింగరించుకుంటూ
లేతకిరణాల ప్యాషన్ డిజైన్లతో
కదిలిపోయే మేఘాలు
వయ్యారపు నడకలు నేరుస్తున్నాయి

దూరంలో
బారులు బారులుగా కొంగలు
రెక్కలాడిస్తున్నాయి

దగ్గరలోఇటూ అటూ పోతున్న కాకులు
సౌధాలపైవాలి ఇటో అటో ఎటో
ఎగరాలనిచూసే గువ్వపిల్లలు

చిత్రవర్ణ రాగాలతో
చిత్రంగా ఎగిరే పక్షుల మద్య
రంగుల ఆకాశాన్ని చించి
ఊహ ఆలోచనకు అద్దుకుంటూ
ఎగిరిపోతుంటాను నేనూ ఓ పక్షినై
కొత్త తీరాలకు మరో
కొత్త కిరణన్నందుకోవడానికి
నీతిసూర్యుణ్ణి వెతుక్కుంటూ.

29.9.2004

పోలవరం - మావూరు


5
పోలవరం - మావూరు
గోదారికి పశ్చిమాన ఓ ఊరు

పాపి కొండల నడుమ
సుడులుతిరిగి హొయలుపోయి
ఉరకలేసిన గోదావరి
ప్రశంత గోదావరిగా రూపుదాల్చిందిక్కడేనని
పాఠ్యపుస్తకాలలో వల్లెవేస్తున్న ఊరు

శ్రీనాధుని అగ్రహారమైన పట్టసంకి ప్రక్క ఊరు
ఫురాణ చరిత్రున్న రెండుకోవెలల నడుమున్న ఊరు

పేరును పోలిన పేరున్నందువల్ల
రెడ్డి రాజులు గతవైభవాని మిగల్చకపోయినా
రెడ్డినిమాత్రం ఊరికే వదిలేసి పోయారు

నేత్రుత్వం
నాటి ప్రధానైనా
నేటి ముఖ్యమంత్రైనా
రామపాదసాగరైనా పోలవరమైనా
ప్రాజెక్టుగా ప్రణాళికా సర్వేలలో
రూపాలు మారుతూ
రూపాయిలు మార్చుతూ
ప్రణాళికల పేజీల్లో నానుతూ
నిరంతరం
నాయకునిలో ప్రతినాయకునిలో
ప్రతీ నాయకుని నోట్లోంచి రాలుతూ
అసెంబ్లీనుండి పార్లమెంటు వరకూ
ఎసి కూపేలలో ఎపి ఎక్స్ ప్రెస్ తో
పట్టాలవెంబడి పరుగెడుతూనే వుంది ... ఆ వూరు।

పంతొమ్మిదివందల ఏభైమూడులో
వరదగోదారి ఉరకలేసిందని
కథలు వెతలుగా చెబుతుంటే
నోరెళ్ళబెట్టుకుని విన్నాం

పంతొమ్మిదివందల ఎనభైఆరులో
గోదావరి రుధ్రరూపం దాల్చి చిద్రంచేసి
గట్టూ పుట్టా కొట్టేస్తే విలవిలలాడాం
ఆటుపోటులకు అలవాటుపడిపోయాం

స్వాతంత్రానికి పూర్వం ఏర్పడిన
హయర్ సెకండరీ స్కూలు
ఎందరినో ఉన్నత విద్యాభ్యాసాల బాటనడిపి
రాష్ట్రంలోనే ఉన్నతస్థాయినిచేరి
సుదూర గోదారి తీరాలవెంబడి
ఆత్రంగా వచ్చి
ప్రణమిల్లిన విద్యార్థిలోకాన్ని అక్కున చేర్చుకొని
తన ప్రాంగణంలో తారాడినవారు
టిచర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు
పచ్చసిరా అధికార్లుగా ఎదిగినా
తను మిగిలిపోయింది
రూపురేఖలు లేకుండా
ఎదుగూ బొదుగూ లేకుండా।

ఎందరికో కళారంగపు స్ఫూర్తినిచ్చి
పాపికొండల నడుమ గోదావరి
కమనీయ సుందర దృశ్యాలతో
ప్రతినిత్యం నిత్యనూతనంగా
కనువిందు చేస్తూనేవుంది ... ఆ ఊరు

గణాంక లెక్కలలో
గుణకాలు తెలవని వూరివారిపైనా
ఉంది ప్రపంచ బ్యాంకు ఋణం
మరి ఆ వూరి రోడ్డే ఓ పెద్ద వ్రణం

హైటెక్ పాలనలో వర్షంవస్తే
బంకమట్టిపై స్కేటింగే శరణ్యం
దేశ చరిత్రలో అతిపెద్దదైన
పార్లమెంటు నియోజకవర్గంలో
రోడ్డులేని ఆ వూరు
రెడ్డి పోలవరం అనిపిలవబడే
పోలవరం

ప్రోజెక్టు పేరుతో దశాబ్దాలుగా
నానుతున్న పోలవరం
సరియైన రోడ్డులేని పోలవరం
అదేనేమో ఆ వూరికి వరం
ఎప్పుడు అందేనో ప్రాజెక్టు ఫలం?
___________________________

ప్రేరణ : ३१.८.२००३ నెలనెలా వెన్నెలలో


శ్రీ వాడ్రేవు చినవీరభద్రుడు చదివిన - తుపాకులగూడెం