Wednesday, 13 July 2011

మట్టిపొరల్లో జ్ఞాపకాలు


ముద్దులొలికే పిల్లలు
తొలి  అడుగులు నేర్చింది ఇక్కడే!
అడుగు వెంట అడుగేస్తూ
ఒకరివెంట మరొకరు
పరుగులు నేర్చింది ఇక్కడే..!!

చిట్టి తల్లులు
ఒలకబోసిన పసిడి పలుకులను
ముక్కున కరచి ఎత్తుకెళ్ళి
కొత్త గీతానికి
శృతిచేసుకున్న కోయిలలుండేవి..
కేరింతలు కొట్టిన ఆనందం
మతాబులై వెలిగి
తారాజువ్వలై ఎగసి పడిందిక్కడే!!!

బాల్యాన్ని వీడి
జీవిత  పార్శవాలను
తెలుకుంటున్న  వారికి కానుకగా
పుటంవేసిన జ్ఞాపకాలనుండి
పాదముద్రలు తనలో  దాచుకున్న మట్టిని
బాల్కనీ కుండీలో   నింపాలని వచ్చాను

ప్రతి ఉషోదయాన్ని
కిలకిలరావాల విడిదైన
ఆ చెట్టువేరును నాటాలని వచ్చాను

ఇపుడిక్కడ
బహుళ అంతస్తుల నిర్మాణం కోసం
పెద్ద పెద్ద గోతులు తీయబడ్డాయి
------------------------------
హైదరాబాదులో 1987-92 మధ్య ఇ.యస్. .ఐ. (సనత్ నగర్) క్వార్టర్‌లో వుండేవాళ్ళం
అక్కడే నాకు ఇద్దరు ఆడపిల్లలు కలిగారు.
ఈ మద్య ఎదో పనిపడి అటువైపుగా వెళెతే అక్కడ ఉన్న పరిస్థితి అది.
అభివృద్ధిని ఆహ్వానించాల్సిందే.   పిల్లల జ్ఞాపకాలు లేకపోవడమే ఎంతత్వరగా మార్పులు వస్తున్నాయి అని చెబుతుంది.