Monday 4 July, 2011

ఉబికేగాయం


ఎదలో దాచుకోవాలనుకొన్న
ప్రతిసారీ
గాయమై వుబికొస్తావు

పలకచేతపట్టి
గెంతుకుంటూ పరిగెత్తుకుంటూ
తోడొచ్చిన నేస్తంగా
పట్టుకోవాలని చూస్తుంటాను
ఏ నడకో నేర్చిన
కాలేజీ దారుల్లో
నన్నొంటరిగా వదిలేస్తుంటావు

నాల్గక్షరాలు నేర్చేసరికి
నా ముఖంలో సరస్వతీకళ ఉందంటూ
పల్లెనుంచి పట్నం మారి
పెద్ద ఆఫీసరైనట్టు కలలు కంటున్న
తల్లిదండ్రుల్నితోసి
లేలేతప్రాయ సొగసుల్ని
పొగడి పొగడి
బుగ్గలు ఎరుపెక్కించి
ఉద్రేకమై వళ్ళంతా పాకి
అయస్కాంతానికి ఆకర్షింపబడే
ఇనుములా చేసిపడేస్తావు

ఎప్పుడైనా
చలిరాత్రుల్లో వెచ్చదనపు స్పర్శగా
హత్తుకోవాలనుకున్నప్పుడు
మాటలన్నీ మూటగట్టి
మనసున గట్టిన స్వార్థమేదో
మెల్లగా విప్పుతుంటావు

ఎదురుచూపంతా వాకిలిచేసి
అడుగుల చప్పుళ్ళకోసం
నిరీక్షిస్తే
నిదురరాని రాత్రిని మిగిల్చిపోతావు

స్వప్నాలను కళ్ళలోనో
ముంగాలి మువ్వల్లోనో దాచి
విరజిమ్మాలనుకుంటే
వసంతంరాని శిశిరవాకిట్లో నిలిపి
ఊడ్చేకొద్దీ పోగయ్యే
ఆకులగలగలల్లో ఎండుటాకునుచేస్తావు

ఆకలినిచూసే తల్లిగానో
అనురాగపు తోబుట్టువుగానో
ఆలోచనిచ్చే చెలిగానో
అల్లుకోవాలనే ఆత్రాన్ని
అడుగులకు మడుగులొత్తే దాసినిచేసి
అహంకార పాదంతో తొక్కుతుంటావు

ప్రతిభనో పనితనమో
ప్రోత్సహిస్తున్నట్టే కన్పిస్తూ 
ఎదుగుతున్న దారుల్లో
అందొచ్చే ఫలాలకు
తెరవెనుక సూత్రధారిగా
సొగసుచూపేదో ప్రదర్శిస్తుంటావు

విరబూసిన పువ్వు
కోసిన హృదయమై విలవిలలాడుతోంది