Wednesday 21 December, 2011

కవీ !

కవీ !
గుండెల్లోనూ
జీవితాన ఎన్ని వైరుధ్యాలున్నా
ఉప్పెనైపొంగే ఆలోచనల్తో
గుండెగాయాలకు లేపనమయ్యే
స్వాంతన గీతమైపో!

గుక్కెడు నీళ్ళుతాగి
నీ గానంలో తడిసి ముద్దవ్వాలి

నీ దేహమెక్కడున్నా
నీ గీతం
వీధివీధిని తిరిగే కాళ్లకు
ఒంటరి రాత్రిచేదించే దిగులు కళ్ళకు
చీకటి విటుడై పుండుచేసిన దేహానికి
నాల్కలపై లాలాజలమైపోవాలి

కవీ !
ప్రభాత రాగాన్ని
పరిమళాల వనం చేసిపో!

Sunday 16 October, 2011

రెండు గదుల స్వేచ్చ



రెండు గదుల్లోకి
జీవితాన్ని సర్దుకున్నప్పుడే
సగం స్వేచ్చకు సంకేళ్ళు వేయబడ్డాయి

అప్పుడప్పుడూ
అతిథులై పలుకరించే అవసరాలలో
మౌనంగా ముడుచుకుంటుంది
అటూ ఇటూ తిరిగే పిల్లలమధ్య
కళ్ళుతెరిచేలోగా
తృప్తి అసంతృప్తుల మధ్య
తెల్లవెంట్రుకలేవో పొడుచుకొస్తాయి

గొంతులో అల్లలాడిన పలుకులు
గుటకలై మిగిలిన స్వేచ్చ
జ్ఞాపకాలుగా
వంటగదిలో వేళ్ళాడే చిత్రపటాలౌతాయి

అలుపెరుగని దేహం
వోవర్ హాలింగు కోరుకుంటుంది
కుంటుతున్న ఆర్థిక ద్వారం
తుప్పట్టిన మడతబందుల మధ్య యిరుక్కొని
తెరుచుకోనంటుంది

శిశిరం అకాలంగా ముసిరితే
రాలుతున్న ఆకుల్లోచి తెగిపడ్డ స్వేచ్చ
తన సంకెళ్ళను తానే విప్పుకొని
మరో రెండుగదుల జీవితాన్ని వెదుక్కుంటుంది.

Thursday 29 September, 2011

Foreword by Angalakurti Vidyasagar

Vidyasagar Foreword Alalapai                                                                                                   

Wednesday 28 September, 2011

Me…n …Mother… నేను ... అమ్మ


On the road….me and mother
Just then
Darkness engulfing
Winter slowly
Is throwing its paw
Momma …wrapped in a shawl
Both of us were walking
Mom was telling something
To make me forget the distance
Today….
The same distance
Same road
Same winter
But mother is not beside me
But …many things
Are still wrapped around me
Like a shawl.

Telugu original: NENU…AMMA BY JOHN HYDE KANUMURI
Eng trans: Jagathi Jagaddhatri Dhatri  ….3.35am 19.09.2011 Monday..

నేను ... అమ్మ
 


రోడ్డుపై నేను ... అమ్మ
అప్పుడే
చీకటి పులుముకుంటుంటోంది
చలి మెల్లగా పంజా విసురుతోంది
శాలువా కప్పుకున్న... అమ్మ
నడుస్తున్నాం ఇద్దరం
దూరం తెలియకుండా
ఏవో చెబుతోంది అమ్మ
నేడు
అదే దూరం
అదే రోడ్డు
అదే చలి
చెంత అమ్మలేదు
అయినా...
ఎన్నో సంగతులు
నన్ను కప్పేవున్నాయి
శాలువాలా !
-----------------
అమ్మ జ్ఞాపకం

Sunday 11 September, 2011

గుర్తొస్తుంటావు



గోచీబిగించి గోదాలో దూకే
పొచిగాడు గుర్తొస్తుంటాడు
గోచితొనే పాచిపొయిన జీవితమది

పెద్ద సంసారాన్ని
సంచిలో మూలికల్తో కలిపి
నిరంతరము మోసే
ఆచారి మాష్టారు గురొస్తుండాడు
తన ఇంటి కష్టానికి మందివ్వలేని
వైద్య రత్నకరమాయన

ఐదుపదుల్లొనూ హుషారుగా ఈలేస్తూ
సైకిలితొక్కే భాషా గుర్తొస్తుంటాడు
బీబిని, బేబీని ఒకే రిక్షాలో
లేబరు రూముకు నడిపించిన వైనమతనిది

పువ్వుల్నో, వెన్నెల్నో జడలొ తురుముకొని
పరువాల సంధ్యవంపులా
గుభాళించిన రాణి గుర్తొస్తూంటూంది
ఎందరినో కాటుకరేఖతో
కొంగున ముడివేసుకున్న పూబోణి

అన్ని వీధుల్లొని
పాడి పశువులను ఏకంచేసి
మేతకోసం ఎక్కడెక్కడో రొజంతా మేపి
చీకటి, వాకిట్లో వాలకముందే
ఎవరి చావిళ్ళకు వాటిని తోలుకెళ్ళే
పాలేర్లు గుర్తొస్తుంటారు
వెట్టితో వట్టిపోయిన జీవితపు ఆనవాళ్ళు

ఉదయాన్ని సాయంత్రాన్ని
పాత వంతెన్నుంచి కొత్తపేటవరకు
పగిలిన మడమల నడచి నడచి
అలసిపోని సత్తవ్వ గుర్తొస్తూంటుంది
ఆకుకూరలతో ఊరిని ముడివేసే ఒంటరిజీవితం

ఎందరో ఎప్పుడో ఒకప్పుడు
ఓ నిముషమైనా గుర్తొస్తుంటారు
జ్ఞాపకాన్ని ముడివేసి
మరింత చేరువౌతారు
* * * *

నీవు మాత్రం

నిత్యం నడుస్తున్న దారిలో
పాదాలకు ఆంక్షలు తొడుక్కుంటావు

కొలతతెల్వక
ఇమడనిపాదాలతో కుస్తీపడ్తుంటావు

కనులు కాంక్షించే
చట్రాలేవో దొరక్క తికమకపడ్తుంటావు

చలవ కళ్ళదాలలో
కన్పించేదంతా నలుపని బ్రమిస్తుంటావు

నీకు నీవే నేస్తానివి
నీకు నీవే శత్రువ్వి

తోడురాని ఆరడుగుల దూరానికి
అనుమానపు కన్నులతో చూస్తుంటావు

ఆంక్షల సలుపుతో
మాట, మనస్సుల తెరనుండి
కొంచెం కొంచెం దూరమౌతూనేవుంటావు
మరెక్కడో నను నిద్రలేపుతుంటావు
                ........................................సాహిత్యనేత్రం - జూలై 2006 (బొమ్మ కరుణాకర్)

Wednesday 31 August, 2011

కవిత్వాలాపన - నా కవిత్వం


బాల్యంలో
బడిలోనో, అరుగుపైనో
అక్షరాలు దిద్దినప్పటి నేస్తం
పట్టిసీమ శివరాత్రి తిరునాళ్ళలో
తప్పిపోయిన 'బిక్కి' బక్కపిల్ల …. నా కవిత్వం

చలిరాత్రుల్లో
గువ్వపిల్లలా ముడుచుకొని
వెచ్చదనపు మంగవడిలో
రాకుమారుల సాహసాలకు
ఊకొట్టిన కథల సవ్వడి …. నా కవిత్వం

వెలుగుల్లేని వాడల్లోకి
కాలినడకన గడప గడపను దర్శించి
మండే చితుకుల వెలుగుల్లో
అక్షరాలను, వాక్యాలను
వెదజల్లిన బోధకురాలు
రత్నమ్మ బైబిలుసంచి …. నా కవిత్వం

నవరాత్రుల సంబరాల్లో
పల్లెగుండెల్లో తడిపొడి చిందుల్లో
ఉర్రూతల కేరింతల చిందేయించిన
వీరాస్వామి డప్పు వాద్య
చిర్రా చిటికిన పుల్లా …. నా కవిత్వం

సుబ్రమన్యుని తిరునాళ్ళలో
గమ్మత్తైన లాజిక్కుతో
ఒకటికి మూడంటూ బొమ్మలజూదం
కనికట్టో మేజిక్కో
పాములనో మనుషులనో ఆడించి
విసిరే మంత్రించిన తాయత్తు …. నా కవిత్వం

అక్కకోరిన కోర్కె
తీర్చలేనిది కాదంటూ
కుక్కలున్న వీధినిదాటి
ఎండవేళను మరచి
స్కూలు వెనకున్న ముళ్ళపొదొంచి
కోసుకొచ్చిన గొబ్బిపూలు …. నా కవిత్వం

గట్టు డొంకల్లోని కాకరకాయలు
కొండ దిగువలో వాక్కాయలు
చింతతోపుల్లో చింతకాయలు
తూముల కెదురెక్కిన చేపలు
చిటారు కొమ్మనో
తూము ప్రవాహాన్నో
వడిసిపట్టుకున్న గుప్పిట వేళ్ళు …. నా కవిత్వం

ఆజానుబాహుడు
వాచక నటనావైదుష్యంతో
సహజకవచకుండలాల కర్ణుణ్ణి
అవలోకగా సాక్షాత్కరింపచేసిన
క్రిష్ణమూర్తి(జడ్జి) కొట్టిన చప్పట్లధ్వని …. నా కవిత్వం

కొవ్వూరు పశివేదల మద్య
నిరంతర సమాంతర రేఖాపట్టాలను కలుపుతున్న
కొంగలబాడవ వంతెన
రైల్వేకమ్మీ భుజాలు దాటిన లేతపాదాలు ...నా కవిత్వం

ఎదుగుతున్న బాల్యంనుంచి
ఆటవిడుపుల చెలిమిరెక్కలు విప్పుకుంటూ
ఆడుకున్న ఏడుపెంకులాట బంతి ... నా కవిత్వం

సంవత్సరాంతర పరీక్షలకోసం
క్వార్టర్ నంబరు ఐదు వాకిట్లో
పెద్దలాంతరో, పెట్రోమాక్సు లైటో వెదజల్లే కాంతికి
చేరిన పిల్లల చదువుల కోలాహలం ... నా కవిత్వం

పెరటిలోచి సర్రున పాకి
వీధిలోకి తొంగిచూసి
బావి అంచు పగుళ్ళలో దాక్కొని
నీళ్ళకొచ్చినవారిని భయపెట్తిన తాచును
ఒక్కవుదుటన చంపి భయాన్నితీర్చిన క్షణాలు ... కవిత్వం

హైస్కూల్లో ఎదుగుతున్న పడచుల
ప్రేమలేఖల పరిమళాలు
పుట్బాలు కబడ్డీలు వాలీబాలు
పోటీలతో సీనియర్స్
స్పూర్తినిచ్చే చెమటచుక్కలు ... నా కవిత్వం

గోదారి ఈతలు
అలల గలగలలు
జలరివలలు
ఇసుకతెన్నెల పరుగులు కుస్తీలు
నిర్ణీత సమయ సంకేతాల ప్రేమజంటలు
వేళను గోధూళి చేసే పశువులు
చూస్తూ చూస్తూనే జారిపోతున్న పొద్దులో
భాను థియేటరునుంచి వినిపించిన
ప్రార్థనా గీతపు గ్రాంఫోను రికార్డు ... నా కవిత్వం

Wednesday 13 July, 2011

మట్టిపొరల్లో జ్ఞాపకాలు


ముద్దులొలికే పిల్లలు
తొలి  అడుగులు నేర్చింది ఇక్కడే!
అడుగు వెంట అడుగేస్తూ
ఒకరివెంట మరొకరు
పరుగులు నేర్చింది ఇక్కడే..!!

చిట్టి తల్లులు
ఒలకబోసిన పసిడి పలుకులను
ముక్కున కరచి ఎత్తుకెళ్ళి
కొత్త గీతానికి
శృతిచేసుకున్న కోయిలలుండేవి..
కేరింతలు కొట్టిన ఆనందం
మతాబులై వెలిగి
తారాజువ్వలై ఎగసి పడిందిక్కడే!!!

బాల్యాన్ని వీడి
జీవిత  పార్శవాలను
తెలుకుంటున్న  వారికి కానుకగా
పుటంవేసిన జ్ఞాపకాలనుండి
పాదముద్రలు తనలో  దాచుకున్న మట్టిని
బాల్కనీ కుండీలో   నింపాలని వచ్చాను

ప్రతి ఉషోదయాన్ని
కిలకిలరావాల విడిదైన
ఆ చెట్టువేరును నాటాలని వచ్చాను

ఇపుడిక్కడ
బహుళ అంతస్తుల నిర్మాణం కోసం
పెద్ద పెద్ద గోతులు తీయబడ్డాయి
------------------------------
హైదరాబాదులో 1987-92 మధ్య ఇ.యస్. .ఐ. (సనత్ నగర్) క్వార్టర్‌లో వుండేవాళ్ళం
అక్కడే నాకు ఇద్దరు ఆడపిల్లలు కలిగారు.
ఈ మద్య ఎదో పనిపడి అటువైపుగా వెళెతే అక్కడ ఉన్న పరిస్థితి అది.
అభివృద్ధిని ఆహ్వానించాల్సిందే.   పిల్లల జ్ఞాపకాలు లేకపోవడమే ఎంతత్వరగా మార్పులు వస్తున్నాయి అని చెబుతుంది.

Monday 4 July, 2011

ఉబికేగాయం


ఎదలో దాచుకోవాలనుకొన్న
ప్రతిసారీ
గాయమై వుబికొస్తావు

పలకచేతపట్టి
గెంతుకుంటూ పరిగెత్తుకుంటూ
తోడొచ్చిన నేస్తంగా
పట్టుకోవాలని చూస్తుంటాను
ఏ నడకో నేర్చిన
కాలేజీ దారుల్లో
నన్నొంటరిగా వదిలేస్తుంటావు

నాల్గక్షరాలు నేర్చేసరికి
నా ముఖంలో సరస్వతీకళ ఉందంటూ
పల్లెనుంచి పట్నం మారి
పెద్ద ఆఫీసరైనట్టు కలలు కంటున్న
తల్లిదండ్రుల్నితోసి
లేలేతప్రాయ సొగసుల్ని
పొగడి పొగడి
బుగ్గలు ఎరుపెక్కించి
ఉద్రేకమై వళ్ళంతా పాకి
అయస్కాంతానికి ఆకర్షింపబడే
ఇనుములా చేసిపడేస్తావు

ఎప్పుడైనా
చలిరాత్రుల్లో వెచ్చదనపు స్పర్శగా
హత్తుకోవాలనుకున్నప్పుడు
మాటలన్నీ మూటగట్టి
మనసున గట్టిన స్వార్థమేదో
మెల్లగా విప్పుతుంటావు

ఎదురుచూపంతా వాకిలిచేసి
అడుగుల చప్పుళ్ళకోసం
నిరీక్షిస్తే
నిదురరాని రాత్రిని మిగిల్చిపోతావు

స్వప్నాలను కళ్ళలోనో
ముంగాలి మువ్వల్లోనో దాచి
విరజిమ్మాలనుకుంటే
వసంతంరాని శిశిరవాకిట్లో నిలిపి
ఊడ్చేకొద్దీ పోగయ్యే
ఆకులగలగలల్లో ఎండుటాకునుచేస్తావు

ఆకలినిచూసే తల్లిగానో
అనురాగపు తోబుట్టువుగానో
ఆలోచనిచ్చే చెలిగానో
అల్లుకోవాలనే ఆత్రాన్ని
అడుగులకు మడుగులొత్తే దాసినిచేసి
అహంకార పాదంతో తొక్కుతుంటావు

ప్రతిభనో పనితనమో
ప్రోత్సహిస్తున్నట్టే కన్పిస్తూ 
ఎదుగుతున్న దారుల్లో
అందొచ్చే ఫలాలకు
తెరవెనుక సూత్రధారిగా
సొగసుచూపేదో ప్రదర్శిస్తుంటావు

విరబూసిన పువ్వు
కోసిన హృదయమై విలవిలలాడుతోంది

Tuesday 14 June, 2011

కోయిల @3.30AM IST

మా ఇంటి చుట్టువున్న చెట్లలోంచి
కోయిల పదే పదే గొంతెత్తి పాడుతోంది
వినడం ఒక్కసారి అలవాటయ్యాక
ఇక ఈ పరుపు దిండ్లపై ఎలా వుండగలను?
బహుశ
వసంతాన్ని ముగించుకొనే తొందరలో
తొలిజాముల సందడిని నా చెవ్వుల్లో నింపుతోంది

మరోవైపు ఇంకో కోయిల
ప్రోత్సాహగీతాన్ని వంత పాడుతోంది

నేనిప్పుడు మరో దినాన్ని జయించడానికి
తొలివెలుగుల కిరణఖడ్గాన్ని ధరించాలి
దుప్పట్లు దులిపి
సాయంత్రం పాడాల్సిన విజయగీతానికి
ఈ కోయిలలు పాడని సరికొత్త రాగమాలపించాలి

Monday 7 March, 2011

తవ్విపోత


తవ్వకాలలో దొరికిన శకలం
చరిత్రనేదో నిర్థారిస్తున్నట్టు
జ్ఞాపకంగా పదిలపర్చిన
ఒక సంవత్సరం కలిసి చదివిన ఓ అనుభవం
నే ప్రయాణిస్తున్న బస్సెక్కి ఎదురై పలుకరించింది

ఓ మిత్రమా!
నీవు నన్నుగా గుర్తుంచుకొన్నది
పొరలులేని నా బాల్యరూపాన్నే కదా!
అందుకే గుండెల్లో అలజడి

ఎవరి జీవితాన్ని వారు
భుజాన వేసుకొని విడిపోయినవాళ్ళం
ఇలా కలవడం యాదృచ్ఛికమా!

మనతోపాటు పాఠశాల ప్రాంగణంలో
తిరుగాడినవారెవరూ గుర్తులేరంటూనే
మనం గుర్తుచేసుకున్న వారందరూ
ఎవరు ఇప్పుడెక్కడున్నారో కదా!

విరామసమయంలో
చేది పోసినవి తాగి
చలోక్తులతో చిలకరించిన నీళ్ళు
ఏ పులకరింపుల నిచ్చాయో !
బావి ఆనవాళ్లేలేని ఈ రోజు
ఏ పదాలతో వివరించను?

జీవితానికి సెలవు చీటిపెట్టిన  ఉపాధ్యాయుల్ని
మననం చేసుకున్నప్పుడే కదా
వాళ్ళు మనకెంత ధారపోశారో తెలిసేది?

మనం విడిపోయిన తరగతుల్నుండి
పోటిలను, ఆటుపోటులను ఎదుర్కొంటూ
జీవితాల్ని కట్టుకుంటూ
సృష్టించుకున్న కొత్త ప్రపంచంలోకి
నీకు అనుమతుందో లేదో!

పాత విద్యార్థుల పేరిట కలిసే చోటుల్లో
పచ్చసిరావో వ్యాపారివో
తెలుసుకుందామనే
మన పలకరింపులు
వాసనలేని కాడమల్లెలౌతున్నాయి

కొంత ప్రయాణం తర్వాత
తెరిచిన జ్ఞాపకాలను మూసేసి
ఎవరి జీవితంలోకి వాళ్ళం జారిపోయి
ట్రాఫిక్‌లో చిక్కుకున్న వాహనాల్లా విలవిలలాడతాం

అయినా!
ఈ అనుభవం
మరోజ్ఞాపకమై మిగిలేవుంటుంది
అది బాల్యాన్నే ముడివేసుకుంటుంది.

ఈమాట, జనవరి 2011 ప్రచురణ