Wednesday, 3 October 2012

పునఃశ్చరణ


గాంధీ జయంతంటే   
మందు, మాంసం దొరకని రోజని
అప్పట్లో నాకు గుర్తు

దేన్నీ ముందుగా దాచులేదు
కానీ
ఓ వారం ముందుగానే
ఎంత ప్రణాలికని! ఎంత ప్రయాసని!
శెలవుదినాన్ని ఆనందించడానికి

మందుమానేసిన ఇన్నాళ్ళకి
అప్పుడు  ఏమి పోగొట్టుకున్నానోనని
ఒకటే ఆలోచన

* * *

రూపాయి మారకం చేస్తున్న ప్రతిసారీ
గాంధీ ఒక్కడినే
ముద్రిస్తారెందుకని అడిగే  పిల్లలు గుర్తొస్తారు
ఎవరు దేశానికి ఏమి చేసారు
పదేపదే పిల్లలు  ప్రశ్నిస్తుంటే
పారిపోయి
దాచుకున్న మందులో దాక్కునేవాణ్ణి

* * *

అందరూ
గాంధీ వెనుక నడిచిన వాళ్ళు కాదు
వెనుకున్నవారు
చిల్లర నాణాలకే పరిమితమయ్యారు
ఎవరు ఏంచేసారో
రూపాయి మారకంలో ఎలా తెలుస్తుంది

* * *

విగ్రహాల్లా! స్ఫూర్తి దాతల్లా!
కొన్ని అంతే! ఎప్పటికీ నిలిచి ఉంటాయి

* * *

నినాదమై నిలిచిన వారు
నినాదాల్లోనే మిగిలిపోయినట్లా?
మార్గాల మలుపుల్లో
మడంతిప్పని వారు
మరుపుల్లోకి చేరినట్లా!
బూటు కాలిక్రిందో
తుపాకి మడం క్రిందో
రక్తసిక్త మొఖాలను
ఎవరు గుర్తుంచుకుంటారు

* * *


నినాదంలో స్వరమయ్యేందుకు
ఉరికొయ్యకు వ్రేల్లాడే చిహ్నమయ్యేందుకు
నెగడు బాటల్లో నడిచేందుకు
నలుగుర్ని కనలేకపోయానని
ఓ అమ్మ ఆక్రోశిస్తుంది


* * *

ఎవరి అక్షరం
నా వేలినంటుకొని
కలుపుకున్న ముద్దల్లోచేరి
వంటినంటినట్టులేదు!  

* * *

ఈ పూటకి నా కడుపునిండింది
ఎవరి కడుపు ఎలావుంటే
నాకేం పని?
గాందీ రూపాన్ని కట్టల్లో  దాచేద్దాం!
చిల్లర ఏరుకునేవాళ్ళుంటేనే కదా
గాంధీని దండిగా నడిపించి
దాచుకోవచ్చు, దోచుకోవచ్చు