Saturday 29 June, 2013

కలేనా???....



ఇప్పుడెందుకో పదే పదే
కలకంటుంది నా మనసు

నువ్వు నా స్నేహానివో, బంధువువో, అభిమానివో ఎలా తెలిసేది?

వ్యాయమ నడకకోసం ఉదయమే వెళ్తున్నప్పుడు
సెల్లుఫోనులో రింగుటోనై పలకరిస్తావని

పనుల మధ్య చిక్కిన సమయంలో
చిరునవ్వుల పూలగుత్తులతో వచ్చి పలకరిస్తావని

కూడలిలో నిలబెట్టిన సిగ్నల్ దగ్గర
యాదృచ్చికంగా కనిపించి పలకరిస్తావని

నీవు మేల్కొన్న సమయం నాకు రాత్రే కావచ్చు
మార్కెట్టు మాలుల్లో వస్తువుల్ని వెతుక్కోగలం
నిన్నెలా వెదకేది అక్కడ?

అయినా
ఇది నా కలేనా!

నీ గురించిన కలనిజమయ్యేదెలా!
ఎవర్ని అడగాలంటావు?

***
బాల్యంలో గోదావరి ఇసుకలో
రంగురాళ్ళు ఏరుకున్నట్టు
వెన్నెలలో ఆరబోసిన అక్షరాలతో
ఇలా
ఎవో వెదకాలని కలకంటుంది మనసు
.............................................22.6.2013 08:15 hours ISD

Wednesday 19 June, 2013

నిద్రను త్రాగి

కవిత్వాన్నో పుస్తకాన్నో
చదివి మూశాక
అల్మారాలోకి చేరితే
కనుమరుగయ్యిందనుకుంటాం
కానీ
భూమిపొరల్లో నీరు ప్రయాణిస్తున్నట్టు
అంతఃర్గతంగా
ఎక్కడెక్కడో  పయనించీ పయనించీ
నాకు తెలియకుండానే
లోలోన శుభ్రపరస్తూ
ఒకానొక సమయంలో
పొరలపొరల ఆలోచనల్ని తోసుకుంటూ ముందుకొస్తుంది

నిద్రరాని రాత్రిని చీలుస్తున్నప్పుడు
గుర్తొచ్చిన క్షణానికి
మేల్కొల్పుతూ  రింగుటోనై

నిద్రను త్రాగి
మత్తులో జోగుతున్న దేహపు చెవిలోకి
అభినందనేదో వొంపింది

ఇక మేల్కొన్న ఆలోచనలు
నడిచొచ్చిన అడుగులనూ
జారిపోయిన జ్ఞాపకాలనూ
పొడిబారుతున్న అనుబంధాలనూ
మిగిలిన రాత్రంతా జల్లిస్తున్నాను

ఏ ఒక్కటీ చిక్కదు
గదులు గదుల ఇంటిలో
ఏదోమూలనుంచి గురకలు వినిపిస్తున్నాయి

మధ్య మధ్యలో
శబ్దిస్తూన్న  సెల్లుఫోను

వాక్యమేదో దొరికిందని
అక్షరమేదో అల్లుకుందనీ
పదాలేవో గుండెను తట్టాయని

నీకూ నాకూ అనుబంధమేమిటి?
నేనోదో ధ్యాసలో వూగుతూ జోగుతూ
వొలకబోసుకున్నదంతా మధువేగా!

నీవు రుచిచూసిన ద్రాక్షరసమన్పిస్తే
ఊగలేని వుయ్యాల మధ్య
సతమతమౌతుంటే
నిన్నేదో ఊయలూగించాననిపిస్తే

***
రాత్రి నీడను కప్పుకొని
ఎలుకపిల్ల సాయంతో
ప్రపంచవీధుల్లోకో, భాషా సంకేతికాక్షరాల్లోకో
చూపుతోనే పరుగెడతాను

మెలకువల్లోంచి పలకరింపులు
కలలోంచి కలవరింతలు

నన్ను వెంటాడే పాము
వింతవింత తలల్ని మోహిస్తుంది

రాత్రిని మడత పెట్టడం రానివాడు
పగటినెట్లా దున్నగలడు ?

...........................10.05.2013

Saturday 15 June, 2013

జీవితంలో వస్తూపోయే జీవనచక్రం

సముద్రతీరంలో అలలు వచ్చినట్టు
ఎవరో ఒకరు
వస్తూవుంటారు, పోతూవుంటారు

తీరంపై వ్యవహాళికి నడిచినట్టు
పాదముద్రలను వదిలిపోతారు
రెప్పపాటులో
ఏ ఒక్కటీ కన్పడదు

కొన్ని జంటలు
కలలుతెచ్చి పరచిపోతారు
నిత్యం అలల్ని
ఆటుపోటుల్ని చూసే తీరవాసులు
ఏమీ పట్టనట్టే తిరుగుతుంటారు

పిల్ల కాల్వల్ని
పంట కాల్వల్ని
ఎన్నడూ చూడని కన్ను
ఆశ్చర్యాన్ని నోరు తెరచి ప్రకటిస్తుంది

అలలు వస్తూవుంటాయి పోతూవుంటాయి

చీకటివేళ గూడువెతుక్కునే పక్షులు
వెన్నెలను ఆశ్వాదించమని
సమయాన్ని ఒంటరిగా వదిలిపోతాయి

కొన్ని రంగుల్ని, కొన్ని చలనక్షణాలను
కెమేరాలో బంధించానని తృప్తిపడతారు

అనంత సాగరంలో
మోకాళ్ళ లోతుకు దిగి
సముద్రాన్ని ఒడిసిపట్టుకున్నట్టు
కేరింతలు కొడతారు

నలుగు చేరినచోట
ఏమీ తెలియనట్టే
ఎవరి వ్యాపారాన్ని వారు తెరుస్తారు
బృతికోసం దేహాల్ని కూడా పరుస్తారు

అలల్ని ప్రతీకల్ని చేసి
ఎరుపుల మెరుపులను పలికిస్తూ
ఇటుగా వచ్చినవాడే ఎటో వెళ్ళిపోయాడు!

నీరెండ కాంతిలోంచి ఒంపినదేదీ
ఎక్కడా దాచిపెట్టలేదు

గాయాలను ఇక్కడ వదిలేయాలని వచ్చి
పొంగే దుఃఖాన్ని ఆపుకోలేక
మరిన్ని గాయాలను మోసుకెళతారు
మైదానాలను
ఇక్కడణ్ణుంచే దారులు వేయాలని
విఫలయత్నాలు జరుగుతుంటాయి

***

వెళ్ళటం తప్పనిసరి అయ్యాక
మోసుకెళ్ళగల్గినవాళ్ళు
తడిసిన వస్త్రాన్ని జ్ఞాపకంచేసి
కొన్ని అనుభవాల్ని జేబుల్లో వేసుకొని
ఏరుకున్నదాన్నో, కొనుక్కున్నదాన్నో
అంటుకున్న ఇసుకనో
వెంటతీసుకెళ్తారు

ఎంతైనా 
అంతర్జాలమూ ఒక సముద్రమే కదా! 

సముద్రతీరంలో అలలు వచ్చినట్టు
ఎవరో ఒకరు
వస్తూవుంటారు, పోతూవుంటారు

జీవిత జీవన చక్రం తిరుగుతూనే వుంటుంది
అలలపై జీవనసంగీతం తేలియాడుతూ వుంటుంది

* * *