Wednesday 19 June, 2013

నిద్రను త్రాగి

కవిత్వాన్నో పుస్తకాన్నో
చదివి మూశాక
అల్మారాలోకి చేరితే
కనుమరుగయ్యిందనుకుంటాం
కానీ
భూమిపొరల్లో నీరు ప్రయాణిస్తున్నట్టు
అంతఃర్గతంగా
ఎక్కడెక్కడో  పయనించీ పయనించీ
నాకు తెలియకుండానే
లోలోన శుభ్రపరస్తూ
ఒకానొక సమయంలో
పొరలపొరల ఆలోచనల్ని తోసుకుంటూ ముందుకొస్తుంది

నిద్రరాని రాత్రిని చీలుస్తున్నప్పుడు
గుర్తొచ్చిన క్షణానికి
మేల్కొల్పుతూ  రింగుటోనై

నిద్రను త్రాగి
మత్తులో జోగుతున్న దేహపు చెవిలోకి
అభినందనేదో వొంపింది

ఇక మేల్కొన్న ఆలోచనలు
నడిచొచ్చిన అడుగులనూ
జారిపోయిన జ్ఞాపకాలనూ
పొడిబారుతున్న అనుబంధాలనూ
మిగిలిన రాత్రంతా జల్లిస్తున్నాను

ఏ ఒక్కటీ చిక్కదు
గదులు గదుల ఇంటిలో
ఏదోమూలనుంచి గురకలు వినిపిస్తున్నాయి

మధ్య మధ్యలో
శబ్దిస్తూన్న  సెల్లుఫోను

వాక్యమేదో దొరికిందని
అక్షరమేదో అల్లుకుందనీ
పదాలేవో గుండెను తట్టాయని

నీకూ నాకూ అనుబంధమేమిటి?
నేనోదో ధ్యాసలో వూగుతూ జోగుతూ
వొలకబోసుకున్నదంతా మధువేగా!

నీవు రుచిచూసిన ద్రాక్షరసమన్పిస్తే
ఊగలేని వుయ్యాల మధ్య
సతమతమౌతుంటే
నిన్నేదో ఊయలూగించాననిపిస్తే

***
రాత్రి నీడను కప్పుకొని
ఎలుకపిల్ల సాయంతో
ప్రపంచవీధుల్లోకో, భాషా సంకేతికాక్షరాల్లోకో
చూపుతోనే పరుగెడతాను

మెలకువల్లోంచి పలకరింపులు
కలలోంచి కలవరింతలు

నన్ను వెంటాడే పాము
వింతవింత తలల్ని మోహిస్తుంది

రాత్రిని మడత పెట్టడం రానివాడు
పగటినెట్లా దున్నగలడు ?

...........................10.05.2013

No comments: