పూల్జడేసుకొని పట్టు పరికిణీ కట్టి
ఘల్లు ఘల్లుమని నడచిన అందెల సవ్వడి
ఇంకా వినిపిస్తోంది
వాల్జడేసుకొని హేమంతపు చేమంతులు తురిమి
వయ్యారపు నడుమునకు
చందనచీర జీరాడగ చుట్టి
సిరికాంతుల సింధూరము నుదుటనద్ది
సాదరముగ ఆహ్వానించెడు ప్రౌడవోలె
తిరుగాడిన పాదల గురుతులు
చిత్రంగా కదిలే చిత్రాలుగా
కళ్ళలో కదలాడుతున్నాయి
పలుకులు మధురాంమృతములై
ఋజుమార్గ కాంతిలా పరుగిడి
పందిళ్ళ శ్వేతవస్త్రాలను తాకి
పరావర్తనమై రాలిపడుతున్నాయి పూలవర్షంగా
ఏడుపొరల దేహంలో ఇంకిపోతూ
ఎనిమిదవపొరగా రూపాంతరమైన అక్షరం
బందీని విడుదలనిస్తున్న .. అక్షరం
పశ్చిమాద్రికి జారే రవి
కాంక్రీటు గోడవతలనుండి
హేమంత శిశిరాలమద్య వూగే
ఆకుల్లోంచి తొంగిచూసి
అక్షర ప్రకాసిత ఫణితేజానికి సంబ్రమాశ్చర్యమై
ఆగలేక జారలేక నిలిచెగా అపరంజితమై
లీలా వినోదమాయిది?
అభ్యుదానికి ఆలవాలమాయిది??
అనుగ్రహానికి అకుంఠిత దీక్షకు అనుసంధానమా???
అదొక హోమం
హోమగుండం అక్షరం
హోమోపకరణాలు అక్షరం
సమిదలు అక్షరం
అగ్ని అక్షరం ఆజ్యం అక్షరం
ఆహుతి పూర్ణాహుతి అక్షరం
అక్షరం ... పదం .. పద్యం .. గద్యం.. హృద్యం..
పర్షంలో జ్వలించే పిడుగు .. అక్షరం
ప్రవాహంలో జనించే విద్యుత్ .. అక్షరం
పీడనంలో వుద్బవించే మహోజ్వలశక్తి॥అక్షరం
ఓ మేఘాన్ని వర్షింపచేసి
ఓ బండను పగులగొట్టి
జలజలమంటూ గలగలనురగలు పొంగుతూ
ప్రవాహపు వరద
ఇసుకతెన్నెలను నింపేస్తూ
లో లో పేరుకున్న కల్మషాన్ని కడిగేస్తూ
నూతనవిద్యుత్ కోసం వడి వడిగా ప్రవాహం
పదం పుడుతోంది
ఓ పథగమనాన్ని నిర్దేశిస్తుంది
దర్శించే వారికే వినిపిస్తోంది
అందుకోమని పిలుస్తోంది।
వేకువన వంచిన నడుముతో
ఏ రాత్రికో ఎన్ని పనుల్నో అవలీలగాచేసి
అలుపెరుగక కథలుచెప్పిన అమ్మా ఓ అవధానే!
ఉదయసాయంత్రాల్ని చక్రాల కాళ్ళతో పరుగులెట్టి
చల్లని వెన్నెల్లో పక్కపరచిన నా శ్రీమతి అవధానే!
హల్లో! అంటే ఏ భాషలోనైనా
అవలీలగా సమాధానం చెప్పే ఆపరేటరూ అవధానే!
బుడిబుడి అడుగులకంటే వడివడిగా
అక్షరాలనో అంకెల్నో నెమరేస్తున్నచిన్నారీ అవధానే!