Saturday 29 November, 2014

ఇంతదూరం నడిచి వచ్చాక - 9

~*~

చల్లుకుంటూవచ్చిన గింజల్ని
వెనక్కు తిరిగి 
మొలకలొచ్చాయో లేదో అని చూడటం కష్టమే

రూపం మార్చుకున్న ఊరిలో 
వదిలివచ్చిన 
బాల్య స్నేహితుల్ని వెతుక్కోవడం కష్టమే కావచ్చు

మానులైనీడనిచ్చే చెట్లుకు    
తన్ను నాటినదెవరో ఎలా తెలుస్తుంది?

**

పొరలపొరల జ్ఞాపకాలనుంచి
ప్రవహించిన నదిపాయొకటి
బాల్యంలో విన్న
సవతితల్లి అడవిలోకి వదిలేసిన  కథను వెంటాడుతుంది
తప్పిపోయిన దారిని వెదకడంలో
తెలియని శక్తొకటి సహకారమందిస్తుంది  
 

పచ్చదనన్నే మోసుకొస్తుందో
ఏడారితనాన్ని ముందుంచుతుందో 

వీచే గాలుల్లో
ముసురేసిన జల్లుల్లో
దీపమొకటి మిణుకు మిణుకుమంటుంది  

**
ఎగిరే జీల్లేడుగింజ దూదిపింజం
దేశాంతరాలలోకి విత్తనాన్ని మోసుకెళ్తుంది

విత్తనం 
నీ పరిమళం నిక్షిప్తంగా దాచివుంచుతుంది 

--------------------------
  28.11.2014 ఇండియా సమయం 14:51 గంటలు

Wednesday 26 November, 2014

ఇంతదూరం నడిచి వచ్చాక - 8



~*~
ఏకాంతం అనుకుని 
ఎవ్వరు సడిచెయ్యని చోటొకటి వెదుక్కొని
కూర్చొని
గతం వర్తమానలాల మధ్య చిక్కుకుపోయిన
మాయాజాలాన్ని విదిలించుకొని రావడం కష్టమే కావచ్చు
**
కాలానికి వేసిన గాలపు ఎరను కదుపుతున్నట్లు
ఆకుల మధ్య గాలి కదులుతుంటుంది
కంటికికన్పడని చేపకోసం
మనసు మున్కలువేస్తుంది

**
చిరునవ్వు పులుముకున్న బాల్యమిత్రులు
అవసారాలనవ్వును అతికించుకున్న సహోద్యోగులు
ఎదురెదురుగా కళ్ళెదుట వెళ్ళిపోతుంటారు
నవ్వుల వెనుక రహస్యాలకు
ఉగ్గబట్టిన శ్వాసకు
ఆ క్షణమెంతో దుర్భరమనిపిస్తుంది
**
కదలని స్థితిని చూసి
సాలీడు గూడల్లడం మొదలెడుతుంది
సాలెగూడల్లిక నైపుణ్యమే కావచ్చు
చేచిక్కించుకొనేందుకు మాయాజాలం కూడా
తెలిసీ తెలియక ఇరుక్కున్నవి ఏకాంతంలోనూ వెంటాడతాయి
ఎంతవెదకినా మొదలూ చివరా అంతుపట్టదు
**
సైనౌట్ చేసి సూర్యుడు వెళ్ళిపోయాక
దారి మరచిన పక్షి అరుపుల్లోంచి
ఇల్లు
. .
. .
. .
. .
. .
గుర్తుకొస్తుంది

**
ఏకాంతం రేపటికి వాయిదా పడుతుంది


------------------------------------------------------
26.11.2014 ఇండియా సమయం 23:04 గంటలు

Saturday 15 November, 2014

చాట్

~*~

జీవనం
నిత్య నడక, పరుగులు
ప్రాధాన్యతలు మారుతూ ఉంటాయి
ప్రాధాన్యత ఆసక్తిని తొక్కిపడుతుంది
ఒక్కోసారి మరుగైపోతుంది

**

ఏది కవిత్వం
ఏది జీవితం
ఏది ప్రాధాన్యత

**

ఒక సంభాషణ
నాతో నేను
నీతో నేను
అందరితో నేను

**

పని ప్రతిఫలానిస్తుంది
సంభాషణేమిస్తుంది
ఎప్పుడైనా ఒక్కసారి సంభాషించి చూడు
నడకలో ఎక్కడొకచోట ఊతమిస్తుంది

కన్రెప్పమూసి
కళ్ళలోనే ఆలింగనంచేసుకో
ఏదీ ఎక్కడికీ పారిపోదు సుమా!

----

Radhi Radhikaతో మాట్లాడాక 14.11.2014

Saturday 8 November, 2014

ఒక ఊహ

లేఖినిని
ఆవిష్కరించినదెవరో

నాలో
ఒక ఊహ స్పురించగానే
సర్రున ఎక్కడెక్కడో ప్రాకి  
చేతివేళ్ళలో చేరగానే
ఒక్కొక్క అక్షరం ఒకదానితో ఒకటి పేర్చబడుతుంది

కవితై మీముందు నిలుస్తుంది
...

Wednesday 5 November, 2014

కనుమరుగైన మిత్రుడా!

రెవ. షాలేం రాజు, ఏలూరు  

సముద్రమంత దుఃఖానికి
ఒక్కసారిగా నేత్రాలివ్వడం
రెపరెప ఎగసే గుండెచప్పుళ్ళను పొదవి పట్టుకోవడం
ఎవ్వరికైనా సులువేమీ కాదు

**

చెట్టున పండిన ఆకులు రాలినట్టు
రాలిపోతున్న ఆనవాళ్ళకు
ఒంటరికొమ్మ
సాక్ష్యంగా నిలబడి ఉండటం కష్టమే కావచ్చు

**

ఒకొక్కటిగా
చితాబస్మమౌతున్న జ్ఞాపకాలు
సమాధులకు పుష్పగుచ్చాలు
కాసింత అనుబంధంతో హృదయాన్ని మెలిపెడుతుంటాయి
చూస్తున్న కళ్ళకు
రహదారిపై నడుస్తూ నడస్తూ
మలుపుతిరిగి కనబడనట్టు
దృశ్యాదృశ్యాల మధ్య మనసు చిక్కుకుంటుంది

**

కొన్ని
పాదముద్రలను వదిలేయడం
కొన్ని పాదముద్రలను వెదుక్కోవడం
అనివార్య నిరంతర పరిభ్రమణం
భావోద్రేకాలలో
పొంగే నదులు ఎండిన ఎడారులతో
జోలెనింపుకోవడం తప్పనిసరి

**

నాల్గక్షరాలను నదుల్లోముంచి
ఆరబెట్టినప్పుడు
ఎవరో ఒకరు జలధార పాయలను వెదుక్కోక మానరు

**

నా నుంచి కనుమరుగైన మిత్రుడా!
పదిలపరుచుకున్న
నీ అక్షరం, నీ పాదముద్రలకు నమస్కరిస్తాను

**

మిత్రులారా!
ఎన్నడైనా రహదారిలో నేను కనుమరుగైతే
సమాధులలో వెదక్కండి
అక్కడుంచేపూలు జ్ఞాపకాన్ని రగిలించేందుకేనని గుర్తుంచుకోండి
ఎప్పుడైనా నాతో కలివున్న
చిత్రంలో వెదకండి ఒక్క జ్ఞాపకమైనా దొరుకుతుంది.

--------
బావతోపాటు...... ఈ మధ్యకాలంలో కనుమరుగైన కొందరిని తలస్తూ