Monday 17 December, 2012

ఒకానొక కోరిక




ఓ చిరునవ్వునై
ఆ బుగ్గపై వాలాలని
ఎప్పటినుంచో కోరిక

బాల్యం
ఎరుకలేని తనంలో
కరిగిపోయింది

యవ్వనం
రంగులద్దిన
కలలరెక్కలై వాలింది

కలల రాకుమారుణ్ణై
రెక్కల గుఱ్ఱాలు లేక
ఉన్నచోటునే చతికల పడ్డా

చొట్టబుగ్గకు
కొలమానాలేవో నే కొలుస్తుంటే
ఎవ్వరోపెట్టిన చుక్కతో
ఎగిరిపోయిన పాటయ్యిఎక్కడవాలిందో మరి!

తిరిగిన చక్రంలో పడి
చిర్నవ్వును మరచిన సందర్భమిది

* * *
ఇప్పుడు
తాను ఎదురైతే
అలల తాకిడికి
ఏ తీరంలోకో కొట్టుకుపోయిన కోరిక
అలలపై తేలియాడుతోంది

ఏమి మిగిలిందని నాదగ్గర
కరిగిపోయిన కాలం
నెరిసిన జుట్టుతప్ప


ముడతలు పడ్డ చెక్కిలి వెనుక
దాగినవి
పూసిన పూల నవ్వులు
రాలిని బిందువులు ఎన్నైనా

రెక్కవిప్పిన తుమ్మెదొకటి
అక్కడక్కడే తిరుగుతోంది.

Sunday 18 November, 2012

ఓడిగెలిచిన రాత్రి

  • మనసు, పరిస్థితులు చాలా అలజడిగా వున్నాయి. అందుకే చాలా రోజులుగా వివిధ కారణాలవల్ల ఒక్క కవితా వాక్యాన్ని చదవలేదు, రాయలేదు.

    అలజడిచెందిన మనసు, పరిస్థితులు, ఆలోచనల మధ్య కొన్ని వాక్యాలు ఇలా వొదిగాయి.
    ఇక రాసాక మనసు వూరుకోదు కదా ఓ కవిమిత్రునికి వినిపించాను. ఆయన చేసిన వ్యాక్యలు నన్ను ఆలోచింపచేసాయి.
    మొదటి రాసిన దానినే మరోధ్వనితో రాయడం జరిగింది.

    ఆ రెండు కవితల్నీ మీ ముందుచుతున్నాను. మీరు యేమనుకుంటున్నారో చెప్పండి.

    ***
    ఓడిగెలిచిన రాత్రి

     యవ్వనాన్ని ధరించిన దేహం
    కోర్కెలకు కళ్ళాలను తెలుసుకుంటూ
    పెనవేసుకున్న రెండుదేహాలు
    రాత్రిని చీల్చుకుంటూ
    ఆకాశపు అంచులను తాకుతున్నట్టు పరుగులు
    ఒలికిన నీరు మెల్లగా జారుతున్నట్టు
    మరుగుతున్న పాలు పొంగుతున్నట్టు
    కణం కణం రగిలిన అగ్నికణం
    చెలరేగే మంటలై
    అడివంతా దహించే జ్వాలలైనట్లు
    కన్ను గానని చీకటిలో
    భయమెరుగనిపోరు
    పల్నాటి పందెపు కోళ్ళలా
    రాత్రిని చెమటిచుక్కలుగా మారుస్తూ
    జ్వలించే దేహపు కణాలను ప్రజ్వలిస్తూ
    దేహాలతాకిడిమధ్య ఆర్పివేయాలనే ప్రయత్నం

    ఎవరికి ఎవరు పోటీ
    ఎవరికి ఎవరు భేటీ
      సమానమైన నిట్టూర్పులసెగలు   కుడి ఎడమల   సైకిల్ పెడలింగులా
     వడివడిగా కదులుతూ
     తుది తీరం
     మది సుదూరం
     ఆకును తాకిన
     మంచుబిందువు జారిపడ్డట్టు
     క్షణమెనుక ఒక్కక్షణం
     యుగాల నిరీక్షణ అంతమైనట్టు
     అంపశయ్యపై దాహార్తి తీర్చేందుకు
     పాతాళగంగ పైపైకి వచ్చినట్టు
      నలిగిన దేహమో
     సహకరించిన మోహమో
     గెలుపు జెండా ఎగిరే
     రెప్పల రెక్కలపై
     అతడు గెలిచాననుకుంటాడు

    అతన్ని గెలిపించే సూత్రంలో
     అతడ్ని గెలిచే రహస్యపు  తాళపుచెవి
     నాలోనే దాచుకుంటూ
     అరాత్రి గెలుస్తూ ఓడిపోయాను
     ఇక
     తన జీవితవిజయాలలో
     నేనే విజేత.

     *****
     2nd Version

    ఓడిగెలిచిన రాత్రి

    యవ్వనాన్ని ధరించిన దేహం
    కోర్కెలకు కళ్ళాలను తెలుసుకుంటూ
    పెనవేసుకున్న రెండుదేహాలు
    రాత్రిని చీల్చుకుంటూ
    ఆకాశపు అంచులను తాకుతున్నట్టు పరుగులు
    ఒలికిన నీరు మెల్లగా జారుతున్నట్టు
    మరుగుతున్న పాలు పొంగుతున్నట్టు
    కణం కణం రగిలిన అగ్నికణం
    చెలరేగే మంటలై
    అడివంతా దహించే జ్వాలలైనట్లు
    కన్ను గానని చీకటిలో
    భయమెరుగనిపోరు
    పల్నాటి పందెపు కోళ్ళలా
    రాత్రిని చెమటిచుక్కలుగా మారుస్తూ
    జ్వలించే దేహపు కణాలను ప్రజ్వలిస్తూ
    దేహాలతాకిడిమధ్య ఆర్పివేయాలనే ప్రయత్నం

    ఎవరికి ఎవరు పోటీ
    ఎవరికి ఎవరు భేటీ
    సమానమైన నిట్టూర్పులసెగలు
    కుడి ఎడమల   సైకిల్ పెడలింగులా
    వడివడిగా కదులుతూ
    తుది తీరం
    మది సుదూరం

    ఆకును తాకిన
    మంచుబిందువు జారిపడ్డట్టు
    క్షణమెనుక ఒక్కక్షణం
    యుగాల నిరీక్షణ అంతమైనట్టు
    అంపశయ్యపై దాహార్తి తీర్చేందుకు
    పాతాళగంగ పైపైకి వచ్చినట్టు

    నలిగిన దేహమో
    సహకరించిన మోహమో
    గెలుపు జెండా ఎగిరే
    రెప్పల రెక్కలపై
    అతడు గెలిచాననుకుంటాడు

    అతన్ని గెలిపించే సూత్రంలో
    అతడ్ని గెలిచే రహస్యపు  తాళపుచెవి
    తనలోనే దాచుకుంటూ
    అరాత్రి గెలుస్తూ ఆమె ఓడిపోతుంది

    గంపక్రింద దాగిన కోడిపుంజు
    వేకువకోసం
    చీకటిని చీలుస్తుంది

    ఆమె
    ఓడిపోవడం
    అలవాటు చేసుకుంటుంది
     * * *
     ప్రతి వేకువలో
    మేల్కొలిపే కోడికూతల ధ్వని దూరమౌతుంటుంది

    ఆ రాత్రి
    మళ్ళీ మళ్ళీ రాదు
    ఆ జ్ఞాపకాన్ని  దాచుకోడానికి
    జీవితకాలం సరిపోదు

    * * *

    ఇక
    జీవిత విజయాలలో
    ఆమె విజేత.

    ********************** 12.11.2012

Sunday 7 October, 2012

జనం సంఘమిస్తారు


ఇక్కడ 
మూడురోడ్లు కలిసే కూడలివుంది
చాలాకాలం నేనూ అలానే అనుకున్నా
కానీ ఆ కూడలిలో
అప్పుడప్పుడు
జనం సంఘమిస్తూవుంటారు

***
ఇక్కడైనా మరెక్కడైనా జన్మించినా
ఉనికిని వెదక్కుంటూనో
అస్థిత్వాన్ని కాపాడుకుంటూనో
తిరుగాడిన దేహం
పార్థివంగా మారినప్పుడు
పూడ్చడానికో, కాల్చడానికో
జనం సంఘమిస్తారు

స్మశానం

***
నమ్మిన సత్యాన్ని వెదక్కుంటూ
ఆత్మ ప్రాణ దేహాలతో

ఇకరిద్దరుగా కూడినచోటుల్లో
దేవుడుంటాడని
ఆరాధించాలంటూ

ఉరుకుల పరుగుల
లోకంలో తమకంటూ
సమయాన్ని కేటాయించుకుంటూ
అప్పుడప్పుడూ
జనం సంఘమిస్తారు

చర్చి

***
లోకంచేసే మాయాజాలం
వాణిజ్యాన్ని ప్రభుత్వం కనుసన్నల్లో

మత్తును నింపుకొనేందుకు
శ్రమను మర్చిపోవాలనుకుంటూ
సమయాన్ని ఆనందించాలనుకుంటూ
బానిసైన బ్రతుకై
నాలుకను చప్పరిస్తూ
కూలిపోతున్న కుటుంబాలను
మత్తువెనుక మర్చిపోయేందుకు

ప్రతినిత్యం జనం
సంఘమిస్తున్నే వున్నారు

బ్రాందీ షాపు

***
ఈ సంఘమాలను
ఎలా అర్థంచేసుకోవాలి??

ఈ సంఘమాల కూడలిని
ఎక్కడ ఎలా ఎక్కడ చిత్రించాలి
చరిత్ర పుటలపై.

********** 7.10.2012

Wednesday 3 October, 2012

పునఃశ్చరణ


గాంధీ జయంతంటే   
మందు, మాంసం దొరకని రోజని
అప్పట్లో నాకు గుర్తు

దేన్నీ ముందుగా దాచులేదు
కానీ
ఓ వారం ముందుగానే
ఎంత ప్రణాలికని! ఎంత ప్రయాసని!
శెలవుదినాన్ని ఆనందించడానికి

మందుమానేసిన ఇన్నాళ్ళకి
అప్పుడు  ఏమి పోగొట్టుకున్నానోనని
ఒకటే ఆలోచన

* * *

రూపాయి మారకం చేస్తున్న ప్రతిసారీ
గాంధీ ఒక్కడినే
ముద్రిస్తారెందుకని అడిగే  పిల్లలు గుర్తొస్తారు
ఎవరు దేశానికి ఏమి చేసారు
పదేపదే పిల్లలు  ప్రశ్నిస్తుంటే
పారిపోయి
దాచుకున్న మందులో దాక్కునేవాణ్ణి

* * *

అందరూ
గాంధీ వెనుక నడిచిన వాళ్ళు కాదు
వెనుకున్నవారు
చిల్లర నాణాలకే పరిమితమయ్యారు
ఎవరు ఏంచేసారో
రూపాయి మారకంలో ఎలా తెలుస్తుంది

* * *

విగ్రహాల్లా! స్ఫూర్తి దాతల్లా!
కొన్ని అంతే! ఎప్పటికీ నిలిచి ఉంటాయి

* * *

నినాదమై నిలిచిన వారు
నినాదాల్లోనే మిగిలిపోయినట్లా?
మార్గాల మలుపుల్లో
మడంతిప్పని వారు
మరుపుల్లోకి చేరినట్లా!
బూటు కాలిక్రిందో
తుపాకి మడం క్రిందో
రక్తసిక్త మొఖాలను
ఎవరు గుర్తుంచుకుంటారు

* * *


నినాదంలో స్వరమయ్యేందుకు
ఉరికొయ్యకు వ్రేల్లాడే చిహ్నమయ్యేందుకు
నెగడు బాటల్లో నడిచేందుకు
నలుగుర్ని కనలేకపోయానని
ఓ అమ్మ ఆక్రోశిస్తుంది


* * *

ఎవరి అక్షరం
నా వేలినంటుకొని
కలుపుకున్న ముద్దల్లోచేరి
వంటినంటినట్టులేదు!  

* * *

ఈ పూటకి నా కడుపునిండింది
ఎవరి కడుపు ఎలావుంటే
నాకేం పని?
గాందీ రూపాన్ని కట్టల్లో  దాచేద్దాం!
చిల్లర ఏరుకునేవాళ్ళుంటేనే కదా
గాంధీని దండిగా నడిపించి
దాచుకోవచ్చు, దోచుకోవచ్చు

Tuesday 4 September, 2012

ఒక పచ్చని చెట్టు...స్పృశించిన అనేక హస్తాలు




ఈ విశాల క్షేత్రంలో ఓ మూల
నన్ను ఓ చెట్టుగా నాటావు

విత్తేప్పుడు పట్టుకున్న మునివేళ్ళు
ఆ మునివేళ్ళనుంచి ప్రసరించిన
అంతఃఅర్గత ఉద్దీపనం
నాలో దినదిన ప్రవర్ధమానమౌతుంది
ఇక
కమ్మటి ఫలాలనివ్వకుండా ఎలావుండగలను!

"చెట్టు జ్ఞానానికి ప్రతీకే"

* * *

మొక్కకు నీరుపోసినట్లు
నా వేళ్ళు పట్టి
దిద్దించిన అక్షరం
శఖోప శాఖల చెట్టవ్వకుండా ఎలావుంటుంది!

ఎదుగుతున్నదశలో
ఆకారంకోసం చేసిన సన్నద్దం
ఒంకర్లుపోని మార్గాలను చూపుతూ
పదాలకూర్పుతో తినిపించి
పరిపుష్టితమైన నా దేహం
నీ ఆలన, పాలనల రూపమేగా!

శాఖలైన దేహాన్కి
చిగురులిచ్చే ఆలోచనలు
పురిలేని దరాలౌతుంటే
పట్టుదారమైన నిర్ణయాలు
జీవిత పథాన్ని నిర్దేశిస్తున్నాయి

అటు... ఇటు ... కొట్టే
వాతావరణ జాడల్లో
మీరిచ్చిన బలమేదో వేర్లలో కనిపిస్తుంది

నీడనిచ్చే చల్లదనంలో
ఫలమిచ్చే తీపిదనంలో
ఎక్కడో లోలోన
మీ ఊపిరే దాగివుంటుంది

అప్పుడప్పుడూ
ఆకులను రాలుస్తూ
కొమ్మలను పోగొట్టుకుంటూ
విత్తిన, నీరుపోసిన, పాలించిన
హస్తాలు లేకుండానే
పచ్చదనంతో కళకళలాడుతున్నా!

పచ్చదనంవెనుక అనేకానేకాంశాలుంటాయి సుమా!

ఈ పచ్చదనంకోసమే
ఎన్నో తపించిన ఆత్మతో
చేతులు శ్రమించి స్పృశించాయి.

లెక్కించలేని సిరులైన
జీవిత జీవన పథంలో
జ్ఞానాన్ని   త్రాగించిన గురువులు

శిరసువంచి నమస్కరిస్తున్నా!!

--------
తారసిల్లిన గురువులను తలపోస్తూ... on Teacher day

Tuesday 21 August, 2012

బంధంనుంచి అనుబంధానికి అక్షరమాలలు



ఒక్కసారిగా గుప్పుమన్న సుగంధం
రంజాన్ సన్ననిచంద్రుడిలా
అంతర్జాలాన్ని తోసుకుంటూ
సప్తసముద్రాలనుంచి నా గదిలోకి దిగింది

ఎలా పదిల పర్చుకోవాలో తెలియనితనం
దువాకై చేతులెత్తింది

నిజంగా ఉదయం తిన్న కీర్ కన్నా
నీ పలుకు తీయదనం
బహుశ నీకు తెలియకపోవచ్చు
అప్పుడే పిండిన జుంటుతేనె
అరచేతినుండి మోచేతికి కారుతున్నట్టు

జ్ఞాపకాల గోదారి వెన్నెల్లో
తోసుకుపొతున్న పడవేదో నాకోసం వచ్చినట్టు
ఎన్ని యుగాలనుంచో
వినాలనే నీ పలుకు

వెన్నముద్దను చూపి గోరుముద్దలు తినిపించిన అమ్మ
నన్ను నాన్న అని పిలిచి నాతో ఆడుకున్న మరో అమ్మ
అక్షరాలను గ్లాసుల్లోనింపి
గోదారి నీళ్ళలా తాగించిన మరో అమ్మ

బంధంనుంచి అనుబంధానికి అక్షరమాలలు


***************************************
 రాధిక రిమ్మలపూడి తో చాలాకాలానికి చాట్ చేసిన ఘడియ

Monday 20 August, 2012

మా రోడ్లు - పెంటోలు






దాటేందుకేగా జీబ్రా లైన్సు
ఎటునుంచి ఏదివస్తుందో జీవితంలోకి!



పాదచారులకు ప్రత్యేకమే
ఆచరించినప్పుడేగా అనువుగా కన్పించేది!

Sunday 19 August, 2012

అవీ... ఇవీ...కొన్ని ఫెంటోలు



ఒక చిరునవ్వు వెంట
నాల్గక్షరాలు ఒలికించి చూసావా! ఎప్పుడైనా!

***

నడినెత్తిన ఎండపొడలో
స్నేహ కౌగిలికై నగ్నపాదాల నడిచావా!

***

గుమ్మటాలలోని పావురాలు
గింజలేరుకుంటూ తీసే కూనిరాగం విన్నావా!

***

ఎదురుచూసి సొమ్మసిల్లిన
పూరేకులను ప్రేమారగా ముద్దాడావా!

***

తలుపు తెరిచిన గదిలో
పగులగొట్టిన సుగంధాన్ని ఆఘ్రాణించావా!

***

కొంగలబారు రెక్కల శబ్దం
వెనుకెనుకే పయనించాలని చూసావా!

***

ఒక్కసారి ఇటువస్తావా
పొరలువిప్పి బాల్యంలోకి దూకి ఆడుకుందాం

Thursday 9 August, 2012

అంబులెన్సు అనుభవం

  

రయ్... రయ్... రయ్... రయ్...
వోయ్... వోయ్... వోయ్... వోయ్...
తప్పుకో ....తప్పుకో ....తప్పుకో ....తప్పుకో ...అన్నట్టు ఒకటే రొద

పొంగి పరవళ్ళుతొక్కే గోదారిని ఈదుతున్నట్టు
ప్రవాహపు ట్రాఫిక్ రహదారుల్లో తోసుకుంటూ
గమ్యానికి అతివేగంగా రోగిని చేర్చాలని
ఓ డ్రైవర్ తాప్రత్రయం

ఇరుకు ఇరుకు నగర ట్రాఫిక్ మధ్య ఎవరికి వారు దారిస్తూ
ఎవరున్నారో
ఏమిజరిగిందో అనుకుంటూ
ఆత్రంగా తోంగిచూసే కళ్ళు
ఏమీ కనబడలేదనే నిరుత్సాహం
దారిన పోతున్న వాళ్ళకు
వారి వారి అనుభవాలను తవ్వితీస్తుంటాయి

* * *

ఎమి జరగనుందో
ఏమీ చెబుతారో ఒకటే ఉత్కంఠ

అంబులెన్స్ అంటే
ఎగిరిపోతున్న ఆయువును హస్తాల్లో పట్టుకొని
రిలే పరుగు పందెం కోసం పరుగెడుతున్నట్టే

ఏది సుఖాంతమో
ఏది దుఖాఃంతమో
ఎవ్వరికీ తెలియని ఓ వింత పరుగు


( నలతగా వుందని ఆసుపత్రికి వెళితే అంబులెసు ఇచ్చి వేరే ఆసుపత్రికి పంపారు..... ఆ అనుభవంనుండి)
*25-07-2012

Wednesday 18 July, 2012

రాజేశ్ ఖన్నా



రాజేశ్ ఖన్నా
********

ఒక దేహం కనుమరుగౌతుంది
కాలంలో తీపి జ్ఞాపకాలే తెరపైకొస్తాయి

జిందగీ ఎక్ సఫర్ హై సుహానా
నాటి నాల్కలపై నడయాడిన గీతలహరి

జ్ఞాపకం రైల్లో ప్రయాణిస్తుంటుంది
తలపు రోడ్డువెంట రైలును వెంబడిస్తుంది

సన్నని మౌతార్గాన్ సంగీతం
పెదాల్లోంచి చెవుల్లోకి ప్రవహిస్తుంది


షర్మిలా, హేమ, ఆశా,  ముంతాజ్
ముచ్చటైన అభినయ జంటలై అలరిస్తుంటారు

లోకులు ఏదొకటి అంటుంటే
ఎవరి మాటలు వారికే వదిలేసిన జీవితం

అచ్చా తో హమ్ చల్తే అంటూ
మళ్ళీరాని చోటు వెదక్కుంటూ ఊపిరి

ఆరాధించిన కళ్ళూ, మనస్సు
అలరించిన చిత్తరువెంట పరుగులు తీస్తుంది

పల్ పల్ దిల్‌కే పాస్
కుచ్ బాతే .. ఉన్ మే సె కుచ్ యాద్ రహజాతేహై!

Thursday 5 July, 2012

చేపలు

బస్సులో వెళుతుంటే
గుప్పుమంటూ ఒక్కసారిగా చేపల కంపు
ఏ చేప ఎలాంటి వాసనొస్తుందో!
ఏ చేప ఎలాంటి రుచినిస్తుందో !
నేనిప్పుడు చెప్పలేను

అమ్మ చేసిన చేపల పులుసు గుర్తొచ్చింది
కొంతకాలం
అమ్మ చేతివంట
తినకుండా బ్రతికేసా!
ఇప్పుడు
అమ్మే లేకుండా బ్రతికేస్తున్నా!
నాసికకు
కంపుకొట్టే చేపలు
జిహ్వకు ఇంపుగా ఎలా మారతాయి!
జతచేసే  మషాలా దినుసులనుకుంటాం
కానీ
కలిపేచేతుల్లో మహిమే లేదంటావా?

***
"కంపుకొట్టే వాటికి
కొన్ని మార్పులుచేస్తే ఇంపవుతాయి " అని సూత్రీకరిద్దామా?
***
మరిప్పుడు
రాజకీయాల మాటేమిటి
పనిచేస్తుందా ఈ సూత్రం?
రాజకీయాల్లేకుండా ఉండలేమేమో!







Wednesday 4 July, 2012

నీతో మాట్లాడానివుంది




పెదవుల కదలికల్లో
ధ్వనించే అంతరంగంతో సంభాషించాలి

సాంకేతిక పనిముట్లు శబ్దాన్నే అంతరీకరిస్తాయి
వ్యవహాళికెల్లిన చేతిస్పర్శ వాటికేం తెలుసు పాపం!

వంటరిరాత్రి మోసుకొచ్చే ధ్వనిచిత్రాలు
భయపెడుతూనో ముద్దాడుతూనో
సమూహాంతర ప్రవాహంలోకి నెట్టేస్తున్నాయి

నలుదిక్కులనుండి విసిరే వలలు

ఎదురెదురాగా వుంటూనే మనం
ముక్కలు ముక్కలుగా విసిరేయబడుతున్నాం

సంభాషణకోసం సమయాన్ని వెదుక్కునేలోగా
ముచ్చటపడ్డ రింగుటోను పాట
ఏదో మూలకు లాక్కెళుతుంది

ఎవ్వరూలేని తరగతి గది ఓమూల బెంచీలో
మనదైన ప్రపంచానికి ఎల్లలుగీస్తూ
ఎన్ని మాటలు ఎన్ని సంభాషణలు

రావిచెట్టుక్రింద ఎంకిపాటలతో
వర్డుస్వత్తు కీట్సుతో కలిపి
రాల్తున్న ఆకుల్ని ఏరుతూ
మారకంలేని చిరునవ్వుతో సంభాషణ కావాలన్పిస్తుందిప్పుడు

అక్షరీకరించలేని ఎన్నో సంభాషణలు
మెమరీనుంచి డిలీట్ అవుతూనేవున్నాయి

కాలానికి ఎదురీదడం కొత్తేమీ కాదు
కాలంలో కలిసిపోవడం పాతా కాదు

మాట్లాడలనే ఆశ
కోర్కై గూడుకట్టడానికి ప్రయాణిస్తుంది
 ------------------------------------------------------
if you wish to call me +91 9912159531 , 9700637732........................ 1.7.2012

Monday 2 July, 2012

జ్ఞాపకం నడక అనుభవం నాదే కదా!


చాలా సంవత్సరాల తర్వాత
ఖైరతాబాద్ వెళ్లాను
కొన్నివీధులు నడుచుకుంటూ తిరిగాను

కళ్ళముందు దాటుకుంతూ వెళ్లిపోయిన
సంవత్సరాల దొంతరను వెదకాలని ప్రయత్నం
యవ్వన రోజులను తనలో దాచుకున్న
శ్యాం, రీగల్ సినిమాలు
శిథిల జ్ఞాపకంగా మిగిలాయి

ఇక్కడే
నా జీవన పోరాటాన్ని
ప్రారంభించడానికి
ప్రింటింగుప్రెస్సులు ఆసరానిచ్చాయి
అవి ఇప్పుడులేకపోవచ్చు
ఆ అనవాళ్ళింకా మిగిలేవున్నాయి
భవనాలు, షాపులు రూపు మార్చుకున్నాయి
బహుశ
యజమానులు మారివుండొచ్చు
వ్యాపారాలేవి మారలేదు
అదే రైల్వేగేటు.
కూరగాయలు, కుండలు, కట్టెలు, మద్యం
ప్రతిసంవత్సరం
ప్రపంచచూపును తనపైకి త్రిప్పుకొనే
గణేషుని పెట్టే చోటు అలాగేవున్నాయి

నన్ను పలకరించేవారు ఎవరూ లేకపోవచ్చు

ఇక్కడెక్కడో శివారెడ్డి తిరిగేవాడట
నల్లగేటుండేదని నందివర్దనం పూసేదని శిఖామణి చెబుతాడు

ఏదీ కనబడదు
అయినా
జ్ఞాపకం నడకే కదా!
అనుభవం నాదే కదా
December 24, 2011


Friday 29 June, 2012

ఏదీ ఒక్కటీ చిక్కదు


స్నానాల గదిలో
ముఖానికి సబ్బునురగైనట్టు

ఎన్ని ఆలోచనలో
తెరవలేని కన్నులతో ఎన్ని అవస్థలో

కడిగి ముఖాన్ని తుడుచుకుంటూ
కలాన్నందుకోబోతే  ఏదీ ఒక్కటీ చిక్కదు

ఎటువైపుగా
ఏ నీటి మాటున జారిపోయిందో

ఇక పద్యంకోసం
పగలంతా వెదకులాట మొదలయ్యింది

Wednesday 27 June, 2012

జ్ఞాపకాల ప్రోది


తిరిగిన దారులెంబడి
నడుద్దామా జ్ఞాపకాలు ప్రోది చేసేందుకు

రాలిన రేకలు ఏరితే
సుగంధం ఇంకా మిగిలేవుంటుంది


ఎప్పుడైనా వచ్చి పోతూవుండు
సన్నగిల్లినవార్కి సత్తువిచ్చేందుకు


పలుకలేని నాలుక
నడిచే కాళ్లకు బంధమేస్తుంది

పంటకాల్వ దూకిచూడు
పయనించే దారుల్లో ఎప్పుడైనా పనికొస్తుంది

నాటింది చెట్టు ఐతే
ఫలమిస్తుంది.. ఎప్పుడో ఒకప్పుడు

ఏమి వెతుకుతున్నావు
నీవొదిలిన పాదముద్రలేవీ లేవక్కడ

మాష్టార్లు వెళ్ళిపొయారు
జ్ఞాపకాలే మిగిలున్నాయి గోడల్లా

బాల్య పరుగెత్తిన మేరా
పెరిగిన ముళ్ళపొదలు  తొలగించాలి

గంగడోలును నిమిరి చూసావా
జీవితమంతా వెంటాడుతూనేవుంది

Friday 15 June, 2012

ఒక్క ప్రక్కటెముక… కొన్ని ఆలోచనలు



ఆమె నా ప్రక్కటెముకని
చెప్పడానికి ఎర్రర్ లేని ప్రోగ్రాంలెన్ని చేసానో!

నాకు తెల్సిన కొలమానాల్తో
ప్రక్కటెముక ఇమిడిందో లేదో! ఎంత సందేహం!

రూపురేఖల్తో ఎంపిక
ప్రక్కటెముకగా అతుక్కుపోయే సాధనమా!!

ఆడంపై ఎప్పుడూ సందేహమే!
ఈవ్ తన ప్రక్కటెముకేనని హత్తుకున్నాడా??    

ఆడం ఎన్నికకు ఈవొక్కతే
నేటి ఆడంకు చుట్టూ ఈవ్‌ల సందడే!

నీ ప్రక్కటెముకకు స్క్రూలుంటాయా
ఇమడలేదని మార్చుకోడానికి!