Tuesday 12 February, 2013

నేను నాన్న

నీవు ఇలా ఉండటం
నాకెంత ఆఆసీర్వాదమో ఎలాచెప్పను?

నిన్ను
అనుకరించినదేమైనా ఉందా!
నీవులేని సమయంలో
నీ చొక్కవేసుకుని
అచ్చం నీలా నడవడమేనా!

నీ నుంచి నేర్చుక్కన్నదేమైనా ఉందా!
అరమోడ్పుకన్నులతో గాలిలో చేయూపుతూ
కీట్సునో, షేక్సిపియర్‌నో
వివరిస్తుంటే
నా కన్రెప్పలపై నిద్రవాలిందనుకున్నా
ఇప్పుడనిపిస్తుంది
నిదురోయిన ఇంగ్లీషు వెన్నెల్లోకి
నన్ను నడిపించావని!

లోకం ప్రవాహనికి కొట్టుకుపోతుందని తెలిసి
ఎదురీదడం ఎలానో
ఎంత వొడుపుగా నేర్పావో!

రాష్ట్రమంతా
సమ్మెల సమ్మెటపోట్ల మధ్య ఊగుతుంటే
నా పుట్టినరోజుకు కాన్కగా
బైబిలును ఇవ్వడాన్కి
పొంగుతున్న కాల్వలను దాటి
నడిచొచ్చిన ఆ జ్ఞాపకాన్ని భద్రంగా దాచుకున్నా
బైబిలును ఎక్కడో పారేసుకున్నా
దగ్గరుండి మననంచేయించిన వాక్యాలు
నన్ను నిరంతరం నడిపిస్తూంటే
ఎలా పోగొట్తుకోగలను?

నమ్మినదాన్ని నిలుపుకోవడంకోసం
ఎన్ని అవమానలను
ఎంత సంఘర్షణననుభవించావో
ఏనాడూ మాఎదుట ప్రదశించలేదు

తరచూ అయ్యే బద్లీలలో
ఎన్నిసార్లు నలిగినా
ఇమడటంనేర్పావు

ఆస్తులేమి ఇవ్వకుంటే
ఏమాశీర్వాదమని లోకులన్నట్టే
అందరూ అనొచ్చు
నీవు ధరించిన అక్షరంవెనుక
మమ్మల్ని నిలబెట్టే ధీరత్వం
ఎలా కనబడుతుంది ఎవ్వరికైనా!

నూతన దయాకిరీటం అని
ఎప్పుడు చదివినా అసంపూర్ణగానే అర్థమయ్యేది
ఉద్యోగంచేసిన సంవత్సరాలకంటె
పెన్షన్ తీసుకున్న వసంతాలే ఎక్కువైనప్పుడు
దయా కిరీటాన్ని కనులారా చూడగల్గుతున్నా!
---
91వ వసంతంలో అడుగిడిన నాన్నకు