Saturday, 16 February 2008

నిజంగా కలుసుకుంటాం

ఒకేతోటలో పూచినపూలుగా
కత్తిరించబడినప్పుడు
ఒక్కటై జట్టుకడతాం
అంతలోనే ఒంటరి బొకేలుగా
విడిపోయి వెళ్ళిపోతుంటాం
ఎవరో ఒకర్ని అభినందించడానికి

కలిసిన పరిచయాల కరచాలన స్పర్శను
తనలోదాచుకొని జారిపోయాననుకొనే కాలం
అసంకల్పితం కాదు ... అందుకే
అది దాచుకోలేక
మనల్ని వర్తమానంలో కలుపుతూనే వుంటుంది

అక్షరాల నెగళ్ళలో
చలికాసుకుంటున్న వెచ్చదనం
తగులుతున్నప్పుడు
వేసుకున్న వస్త్రాలను విప్పుకుంటూ
కలుసుకుంటుంటాం

పదాల చౌరస్తాలలో
విభేదాన్ని భుజానవేసుకొని
చెరోదారై విడిపోయినా
నిరంతరం జ్వలించే అక్షరం
ఏవో బంధాల్ని కూరుస్తున్నప్పుడు
భుజానవేసుకున్న విభేదాన్ని కపడకుండా
ఓవర్‌కోటు వేసుకొని
పలకరింపుల నవ్వుల్ని పులుముకుంటూ
కలుసుకుంటుంటాం

ఒకరికొకరు తెలియని దృవాలలో
రేఖల వృత్తాలు గీసుకుంటున్నప్పుడు
అక్సాంశ రేఖాంశ పరిభ్రమణంలో
ఎక్కడోకచోట కలుసుకుంటాం

వెల్లువెత్తిన భావాలను
కెరటమై ఎగసిపడినప్పుడు
ఆనందాన్ని పువ్వులుగా పూయించి
అభినందనతో వెంటవచ్చిన పరిమళం
పదే పదే శ్వాసకు తగులుతున్నప్పుడు
కలుసుకుంటూనే వుంటాం

ఆగలేని ఒన్‌వేలలో పడి దాటిపోయినప్పుడు
చూపులతోనే మూగతరంగాలలో
స్పృసించుకుంటూ
కలుసుకుంటాం

కాని...
తన్ను తాను వెతుక్కుంటున్నవాడు
కాలాల దారుల్లో
నిన్నూ నన్నూ నిద్రలేపి
పదాల బంధాల ఫ్రేములలొ పెట్టి
భూతద్దపు నేత్రాలతో వెతుకుతున్నప్పుడు
వెతుకులాటల జీవనాదంలో
నిజంగా కలుసుకుంటాం


సాహిత్య ప్రస్థానం అక్టోబరు-డిశెంబరు 2004
కవిత 2004 (విశాఖ)

ఏదైనా...

అదో తేనెతుట్ట
ఆదమరచి పొడిచావో
ఈగలు చుట్టి ముట్టడిచేస్తాయి
ఒడుపెరిగావో
ధారల ధారల తేనంతా నీదే
ఇంకాస్త ముందుకుపో
రాణీ ఈగ నిన్ను మోహిస్తుంది
మిగతావన్నీ నీవెంటే.