నీ పరిచయం తెరపైనే
నా బాల్యంనుంచీ
నిన్ను కలిసే సందర్భమేదీ తారసపడలేదు
నీదైన గొంతును వింటూ వింటూ
నీ అభినయాన్ని చూస్తూ చూస్తూ
నేను కాలేని ఎన్నో వ్యక్తిత్వాలను నాలోనే ముద్రించుకున్నాను
ఒక్కోసారి మిత్రుడవయ్యావు
మరోసారి అన్నవయ్యావు
నాన్నవై మార్గాన్ని బోధించావు
అయినా
నీ దేహ స్పర్శేదీ నేను తాకలేదు
నీనొదిలిన పాదముద్రలు దిక్కులకు దిక్శూచికలుగా అగుపిస్తాయి
నీ ఆత్మ దేహాన్ని వదిలి వెళ్ళిపోయింది
దేహం మట్టిలో కలిసిందీ నిజమేకావచ్చు
నా యెదలోనో, కళ్ళలోనో నీవుంచిన చిత్రాలు
నా రెప్పపడెంతవరకూ నాలోనే వుంటాయిగా
ఎక్కడకీ పోలేవు నా చూపుల్లోంచి
అందుకే
చిగురుతొడిగే లేత ఆశగా
చెదరిపోని ఉల్లాసాల మూర్తిగా నిను చూస్తుంటాను
***
(అక్కినేనికి అశ్రునివాళి) 22.01.2014