Wednesday, 8 October 2014

ఇంతదూరం నడిచొచ్చాక - 6



~*~
కొంత హోదాను
కొంత సౌఖ్యాన్ని అనుభవించాక
హఠాత్తుగా ప్రక్కకు పెట్టడం కష్టమే కావచ్చు.
ఊరి దూరాన్ని
అలా అలా ప్రయాణిస్తూ
ఒక్కసారిగా హోదాను సౌఖ్యాన్ని విడచి
సమూహంలోకి చొచ్చి
గంటా, రెండు గంటల ప్రయాణాన్ని
తోసుకుంటూ బస్సులో ఎక్కి
చెమట, పుగాకు ఇంకొంచెం మరేదైనా వాసనలతో
ఉక్కిరిబిక్కిరిచేసేవారి మధ్య
ఊరూరా ఆగుకుంటూ
అరుపులు తోపులాటలు
చంటిపిల్లల ఏడ్పులతో
విసుగుదలకు వినవచ్చే బూతుపదాల ధ్వనితో
ప్రయాణించడం కష్టమే కావచ్చు
***
అక్కడ
హోదాను గుర్తించి కూర్చోమని సీటెవ్వరు ఇవ్వరు
నిలబడ్డచోటులో ఎవరిశరీరం స్పర్శిస్తుందో
ఏ వాసన నాసికను తాకుతుందో
ప్రయాణం బయలుదేరినప్పుడు
వంటికి పూసుకున్న స్ప్రే ఎప్పుడో ఆవిరైపోయివుంటుంది
ఇక అవసరం హోదాల మధ్య
మనసు ఊగుతూ ఉంటుంది
పరిపరి విధాలా ఆలోచనలు పరుగెడుతుంటే
గమ్యం చాలా దూరమనిపిస్తుంది
చేరగలమో లేదోననే సందేహాలమధ్య గడియారం ఆగిపోయినట్లనిపిస్తుంది
ఈ జనమంతా క్రమశిక్షణలేని మట్టి మనుషులనిపిస్తారు.
**
ఒకప్పుడు
అదే దారిగుండా ప్రయాణించడాన్కి
ఎంత పడిగాపులో కదా!
అత్తా అంటునో, తాత అంటూనో, మామ్మా అంటునో
కిక్కిరిసి ఆలస్యంగావచ్చిన బస్సులోకి ఎక్కేందుకు సాయం చేయడం
ఊగిసలాడే గతుకుల దారులగుండా ప్రయాసేమి కాలేదు
**
ఇప్పుడు
నగరం కొత్త కొత్త పొరల్ని రహదారులగా కప్పుకున్నట్లు
అదే దుమ్మురేపే దార్లు అదే దూరం
ఏ పొరల్ని కప్పుకోలేదు
నాకే ఈ దారిప్పుడు కొత్తగావుంది
వదిలెళ్ళిన కాలగతిలో ఊరు ఊరుగానే వుంది
నేనే అభివృద్ధి పరుగుల వేటలో
నగరాల్ని మహానగరాల్ని కప్పుకోవాలని చూస్తూ
ఊరును మరచానేమో!
**
ఇప్పుడనిపిస్తుంది
దారినుంచి రహదారిగా మారలేని ఈ ఊర్ల మధ్య
నేను ఇంకా ప్రయాణించాల్సివుంది
~*~
08.10.2014 06:30 గంటలు (ఇండియా సమయం)