Saturday 28 July, 2007

ఆర్థిక పరిస్థితి మారిందండోయ్ !

ఆర్థిక పరిస్థితి మారిందండోయ్ !
ఇది పంచతంత్ర మంత్రంకాదు
ఈ కాలం తంత్రమండోయ్ !

మెరకలు ఎక్కి ఇరుకులుదాటి
వీధి మూలలో డేరావేసి
ఇంటి ముంగిట్లోవాలి
గడప గడపనూ తడుతూ
మేడో వాహనమో కొనడానికి
ఋణాలిస్తామంటూ
జామీనక్కర్లేదంటూ
క్రెడిట్ డెబిట్ కార్దేదైనావుండి
చిన్న సంతకంచేస్తే చాలని
పల్లానికి పారే నీరులా
చెక్కు మీజేబులో కొస్తుందండోయ్ !


ఈ వీధుల్లో
పహారామద్య మనుషులు
ప్రహారీలమద్య ఇళ్ళు
పట్టపగలే పాదచారులుండరండోయ్ !

బ్రతుకు రెవైనా వాగైనా
కిస్తులు కట్టే నిజాయితీ అక్కర్లేదు
కొమ్మనుండి కొమ్మకుదూకే కోతిలా
కార్డునుండి కార్డుకు దూకొచ్చండోయ్ !
లాజిక్ వస్తే
మ్యాజిక్ వడ్డీలండోయ్ !
బేరీజు వేస్తే
బ్యాంకు బ్యాంకుకు పోటీలండోయ్ !


రుణాలగుర్రమెక్కి బోర్లాపడ్డా
బొప్పిదొరకదు నొప్పి తెలవదండోయ్ !

రేషన్ తో పరేషనయ్యే
అర్థాకలి జీతగాళ్ళకు
ఆమడదూరమే ఈ కార్డులు
అందనిపళ్ళు పుల్లనివిలా
అందలంలో నిలిచే కలల సౌధాలే నండోయ్ !

వీరి...
రోడ్లకు బోర్డులుండవ్
ఇరుకు కరుకుల
వంకర కంకర సందులు
ఆ గొందుల్లో సుగంధాల్లేవు
అగుపిస్తాయి లీలగా రాబందుల నీడలండోయ్ !
గడపలేని వారి వాకిట్లోకి వీరు రారండోయ్ !

అయినా...
ఆర్థిక పరిస్థితి మారిందండోయ్ !
ఇది పంచతంత్ర మంత్రంకాదు
ఈ కాలం తంత్రమండోయ్ !