Friday 13 December, 2013

ఈ అంతర్జాలం



ఉదయ సాయంత్రాలకు వారధి
ఆహ్వానమెవరికి!
ప్రవేశమెవరికి!

నీకు తెలియని మార్గమేదీ లేదు
ఒకానొక సమయాన స్పర్శించిన స్నేహ హస్తపు స్పర్శ
ఈ వంతెనెను నిర్మిస్తుంది

విప్లవాలు ఆలోచనల్నుంచే పుడతాయి
ఇదో విప్లవం
పడమటినుంచి తూర్పును కలిపే మంత్రం

వంతెనపై
నా మాటలు అటు
నీ మాటలు ఇటు పరుగులు తీస్తున్నాయి
 
మిత్రమా!
రాత్రినిద్రను విదిలిస్తూ
ఉష: కాంతికి ఆహ్వానం పలుకుతున్నాను

అలసి, నిద్రను ఆహ్వానిస్తూ
సంధ్యకు వీడ్కోలు పలుకుతున్నావు నువ్వు

ఈ అంతర్జాలం వారథి నిర్మిస్తూనేవుంది

(వీదేశంలోవున్న మిత్రులతో చాటింగు)

Tuesday 10 December, 2013

చలినిచీలుస్తూ



మంచుదుప్పటికప్పిన మాసం వస్తుంటే
కొందరు ఆహ్వానాన్ని పలుకుతుంటారు
కొందరు కొరుకుతున్న చలికి భయపడి
తలుపుమూసిన గదిలో మునగదీస్తారు

దేహాన్నితడిమే చలిచేతుల్ని తోసేందుకు
ఆకలి మంటలతో నిత్యం పోటీ పడుతుంటారు
నలుగురుగా ఒక్కచోట చేరే దారి కనలేక
చలిమంటలు ఎప్పుడో కనుమరుగయ్యాయి

ఎప్పుడో ఈ చలి కాలాన ఆకాశాన తారొకటి వెలిగిందని
ఇప్పుడు ఈ చలిలో కాగితపు నక్షత్రాలు విద్యుత్తుకాంతితో
మిణుకుమిణుకుమంటూ ప్రతి ఇంటా వేళ్ళాడుతున్నాయి
పశులపాకొకటి అనేకానేక అలంకరణలతో అలరారుతుంటాయి

స్వరపేటికలో ఉత్సాహం ఆనందంనిండిన గాన ప్రతిగానాలు
నిదురించిన కళ్ళను మేల్కొల్పుతూ ప్రతిధ్వనిస్తుంటాయి
బృందాలు బృందాలుగా ధ్వనించే పాటలిప్పుడు చలినిచీలుస్తూ
"మన యేసు బెత్లహేములో చిన్న పసులా పాకలో బుట్టెన్"

Monday 9 December, 2013

ఎవరైనా ఎందుకు కన్నీరొలికిస్తారు



ఎన్నడో
నిద్రలోనో, మగతలోనో, మెలకువలోనో
పరిచయమనుకున్న ఓ నవ్వు
ఎప్పుడైనా ఎక్కడైనా
ఒక్కసారి కౌగలించుకున్న స్నేహ హస్తపు స్పర్శ
వదిలించుకున్నామని అనుకున్నా
పెనవేసుకున్నామనుకున్నా వెంటాడుతూనే వుంటుంది

జీవితాన్ని నడిచిన క్షణాలు కొన్ని
ధనుర్మాసపు మంచుకమ్మినట్టు కమ్మొచ్చు
మసక మసక వెలుతురుమధ్య జ్ఞాపకాలు కప్పినప్పినప్పుడు
చలికి మునగదీసుకున్న దేహంలా అనుబంధం కుంచించుకున్నప్పుడు
కళ్ళు చెమర్చమడం మరచిపోతుంది

***

అనుబంధాలు
మమకారాలు
కరన్సీని ఉన్నిగా తొడుక్కున్నాక
మాటలు కలిపి కలబోసుకోవడం కనుమరుగయ్యాక
ఎవరైనా ఎందుకు కన్నీరొలికిస్తారు

***

నీవు ఒంటరివై
రాత్రిలోకి నిన్నునీవు దూర్చుకొని
తాగినవన్నీ కన్నీళ్ళే కదా!

రగిలిస్తున్న యెదమంటలను
చల్లార్చడం మధువుకే చేతనౌనని అనుకున్నాక
తలుపులు ఒకొక్కటిగా మూసుకుంటుంటే
తలుపు తెరచి తొంగిచూసే ధైర్యలేనప్పుడు
ఎవరైనా ఎందుకు కన్నీరొలికిస్తారు

***

కొలమానాల లోకం
బిగించుకున్న చట్రాల చూపుల్లో ఇమడనప్పుడు
నీవు వేసిన అడుగులన్నీ
తప్పుడుగానో, తడబాట్లుగానో కన్పిస్తుంటాయి

ఇక ఏ అనుబంధం ముడిపడనప్పుడు
ఎవరైనా ఎందుకు కన్నీరొలికిస్తారు

***

నీలో నీవే దాచుకున్న దేహాన్ని విదిల్చుకుని
నీవు అలా వెళ్ళిపోతావు
కన్నీరొలికించలేనివారు కళ్ళలోంచి తీసేస్తారు
గుప్పెడుమట్టిని సమాధిపైవేసి
ఎవ్వరిని పలకరించకుండానే వెళ్ళిపోతారు
నిన్ను కప్పిన మట్టిలో సమస్యలు దాక్కోవు

***

పొద్దు గ్రుంకుతుంది
కాలచక్రం ఎక్కడా ఆగదు
కోలాహలమైన పక్షుల కిలకిలరావాలతో
రాత్రిదుఃఖాన్ని విదిల్చి మళ్ళీ తూర్పున సూర్యోదయం

***

నువ్వు ఎవరైనా
మళ్ళీ మనం కలుస్తామనే ఓ నిరీక్షణయైనప్పుడు
ఎవరైనా ఎందుకు కన్నీరొలికిస్తారు