Tuesday 22 July, 2014

అమ్మను తలపోస్తూ

~*~

కాలం చిత్రంగా కదిలిపోతుంది
కొందరు చెప్పి
కొందరు చెప్పకుండా వెళ్ళిపోతారు
అలాచూస్తున్న కంటికి
జ్ఞాపకం మెల్లగా
భూమిని తాకిన ఆకాశంలా కనిపిస్తుంది
నీవు లేకుండనే రెండు దశాబ్దాలు గడచిపోయాయి
**
నేను కడుపున పడ్డప్పుడు ఎలా తలచావో
అడుగులు వేస్తున్నప్పుడు ఏమి వూహించావో
జ్ఞానజ్యోతిని వెలిగించిన వాక్యాన్ని కనులకు అంటించి పోయావు
**
కాలచక్రంలో ఏడుగురికి ఊపిరిపోసావు
ప్రతికాన్పు పునర్జన్మయితే
ఆరుసార్లు తిరిగి తిరిగి జన్మించావు
బహుమానాల, స్వాస్థ్యాల
అడుగులను తీర్చిదిద్దేందుకు
బాధలను సహించిన దేహం ఎటుగా కనుమరుగయ్యిందో కదా!
**
ప్రతివేకువలో  సన్నుతించిన గానం
చెవిలో ధ్వనిస్తూ నన్ను పురికొల్పుతూనేవుంది
నీవూ నేనూ కలిసే చోటు సమయం వుందనేగా మన విశ్వాసం!
**
అమ్మా!
చిన్నీ! నాన్నా! అని పిలిపించుకొనేందుకు
నీ వేలుపట్టి నడవాలనివుంది
**

Wednesday 16 July, 2014

నేను నీకు తెలుసంటావా?

~*~

ఎన్నాళ్ళపరిచయంమనది!

ఏ ప్లాట్‌ఫారం మీదో ఎదురయ్యిన ఎప్పటిదో తెలిసిన ముఖం
ఎంతకీ గుర్తురాని జ్ఞాపకమై కదిలిపోతుంది

ఆసుపత్రి మెట్లపై దిగాలుగా కూర్చున్న బాదాతప్త దేహం
ఏ బంధాన్నీ ముడివేస్తున్న గాలి అలల కలబోత

ఎప్పుడో విన్న
మహ్మద్‌రఫీ ముకేష్ సైగల్‌ల గాత్రంవెనుక సంగీతం

ఈ పరుగెడుతున్న నగరాన్ని
బాల్యంలో ఎప్పుడూ స్వప్నించలేదు
వలసపక్షుల గుంపులగుంపుల రెక్కలచప్పుళ్ళు
అప్పుడూ ఇప్పుడూ అలానేవున్నాయి

వెన్నెలరాత్రిలో రాలిపడ్డ నైట్‌క్వీన్ పరిమళం
నీ మీదుగా సన్నగా ప్రవహిస్తోంది

ఒకరికొకరం ఇక్కడే తచ్చాడుతూ పోల్చుకోలేం
అయినా
నీవు నాకు తెలిసినట్టే ఆకులు వూగుతున్నట్టూ జ్ఞాపకమొకటి వెంటాడుతుంది

అనంత దారంతో గాలిపటం ఎగురుతూనేవుంటుంది

...................................14.07.2014 22:43 hours ISD

Monday 14 July, 2014

???


నీ శ్రమవున్నంత మాత్రాన ఈ రహదారి సొంతమేమీ కాదు
కొందరు ముళ్ళను నరుక్కుంటూ కాలిబాటలో నడిచివెళ్ళారు
కొందరు కంకరరాళ్ళను పరచుకుంటూ ఎడ్లబళ్ళను తోలుకెళ్ళారు
దోచుకున్న సంపదను తరలించేందుకు
చెమటచుక్కల ఇందనాలతో రోడ్డురోళ్ళను నడిపారు కొందరు
ఊరు నాల్గక్షరాలు నేర్చాక
కాలిబాట రోడ్డయ్యింది
నాచుట్టూ పరుచుకున్న విషవలయంలో
ఊర్లోని రోడ్డు ఊరుమీదనుంచి రహదారిగా మారింది
నేనింకా తొక్కాలనుకునే సైకిలికిప్పుడు
ఆ రహదారిపై అనుమతిలేదు
నా ఊరిదేహభాగమైన రహదారిపై
కారు నడపాలంటే, బస్సెక్కివెళ్ళాలంటే పన్నుచెల్లించాల్సిందే!

 * * *

కాలిబాటకు కాలంలో ఎన్ని మార్పులు

* * *

అంతర్జాల ప్రయాణంలో
మార్పువెంట మార్పులు
నాదైనదేదీ నాది కాదు

*******************25.5.2014 6:00 - 7:25 pm ISD

Tuesday 1 July, 2014

50+ ....!


~*~
నాలుకకు కత్తెర కావాలి
మాటలనాపేందుకు కాదు
రుచులను కత్తిరించేందుకు
నాలుకకు పూతకావాలి
ఏది అందించినా ఒకేలా ఉండేందుకు
ఏం వయసు మీదపడిందని కాదు
బరువెక్కిన కాయం ఏ అనారోగ్యానికి ద్వారం తెరుస్తుందోనని

***

ఆ వేసవి కాలం గుర్తుందా
ఉప్పుకారంతో తిన్న పుల్లమామిడికాయలు
మోచేతులవరకూ కార్చుకుంటూ తిన్న రసాలు
నువ్వు ఎక్కువ తింతావో, నేను ఎక్కువతింటానో
లెక్కలేస్తూ తిన్న ముంజెకాయలు
ఎండలో తిరగొద్దని, తిరగకుండావున్నందుకు
జేబుల్లో పోసిన వేరుశెనగలు, చేతికిచ్చిన బెల్లంముక్క
ఇపుడు నిషిద్దాల జాబితాలోకి చేరాయి
పండిన ముక్కైనా, ఊరగాయ ముక్కైనా
చెక్కెర రక్తపోటులను మార్చేస్తుంది

***

దోస్తులతో పోటీపడి తిన్న సందర్భాలు
నోరూరించే జ్ఞాపకాలు మాత్రమే

***

అన్నం పులిహోరకు గారెలకు
నాలుక అర్రులు చాస్తుంది
ఇక బిర్యానీ అంటావా!
వాసన చూసినా పాపంమూటగట్టుకున్నట్టౌతుంది
రొయ్యలు, పీతలు ఊహించడమే మహాపాతకమౌతుంది

***

ఆరోగ్యసూత్రాల జాబితాతో
ఆ గదిలో డాక్టరు ఎదురుచూస్తున్నాడు
జాబితా తెలీయనివేమీ కాదు
కానీ
నాలుకకు కత్తెర కావాలి
రుచులను కత్తిరించేందుకు
కొన్ని మొలకలో
మరికొన్ని పచ్చి ముక్కలో తినేందుకు
నాలుకకు పూతకావాలి
ఏది అందించినా ఒకేలా ఉండేందుకు


...........29.6.2014