Friday 29 June, 2012

ఏదీ ఒక్కటీ చిక్కదు


స్నానాల గదిలో
ముఖానికి సబ్బునురగైనట్టు

ఎన్ని ఆలోచనలో
తెరవలేని కన్నులతో ఎన్ని అవస్థలో

కడిగి ముఖాన్ని తుడుచుకుంటూ
కలాన్నందుకోబోతే  ఏదీ ఒక్కటీ చిక్కదు

ఎటువైపుగా
ఏ నీటి మాటున జారిపోయిందో

ఇక పద్యంకోసం
పగలంతా వెదకులాట మొదలయ్యింది

Wednesday 27 June, 2012

జ్ఞాపకాల ప్రోది


తిరిగిన దారులెంబడి
నడుద్దామా జ్ఞాపకాలు ప్రోది చేసేందుకు

రాలిన రేకలు ఏరితే
సుగంధం ఇంకా మిగిలేవుంటుంది


ఎప్పుడైనా వచ్చి పోతూవుండు
సన్నగిల్లినవార్కి సత్తువిచ్చేందుకు


పలుకలేని నాలుక
నడిచే కాళ్లకు బంధమేస్తుంది

పంటకాల్వ దూకిచూడు
పయనించే దారుల్లో ఎప్పుడైనా పనికొస్తుంది

నాటింది చెట్టు ఐతే
ఫలమిస్తుంది.. ఎప్పుడో ఒకప్పుడు

ఏమి వెతుకుతున్నావు
నీవొదిలిన పాదముద్రలేవీ లేవక్కడ

మాష్టార్లు వెళ్ళిపొయారు
జ్ఞాపకాలే మిగిలున్నాయి గోడల్లా

బాల్య పరుగెత్తిన మేరా
పెరిగిన ముళ్ళపొదలు  తొలగించాలి

గంగడోలును నిమిరి చూసావా
జీవితమంతా వెంటాడుతూనేవుంది

Friday 15 June, 2012

ఒక్క ప్రక్కటెముక… కొన్ని ఆలోచనలు



ఆమె నా ప్రక్కటెముకని
చెప్పడానికి ఎర్రర్ లేని ప్రోగ్రాంలెన్ని చేసానో!

నాకు తెల్సిన కొలమానాల్తో
ప్రక్కటెముక ఇమిడిందో లేదో! ఎంత సందేహం!

రూపురేఖల్తో ఎంపిక
ప్రక్కటెముకగా అతుక్కుపోయే సాధనమా!!

ఆడంపై ఎప్పుడూ సందేహమే!
ఈవ్ తన ప్రక్కటెముకేనని హత్తుకున్నాడా??    

ఆడం ఎన్నికకు ఈవొక్కతే
నేటి ఆడంకు చుట్టూ ఈవ్‌ల సందడే!

నీ ప్రక్కటెముకకు స్క్రూలుంటాయా
ఇమడలేదని మార్చుకోడానికి! 

Thursday 7 June, 2012

అవీ.. ఇవీ 6.6.12


రాత్రివెన్నెల్లో తడిసానేమో
ఉదయానికి ఒకటే ఫెంటోలు!!

* * *

తెలిసిందేమిటో తెలుసా
ఆనందం పంచడం, అవమానాల్ని దిగమింగడం

* * *

అక్షరాల మధ్య వెదకులాట
జుంటేతేనేదైనా  దొరుకుతుందేమోనని

* * *

ఒకటినుండి ముప్పై వరకు
తెగని లెక్కలు.. మళ్ళీ ఒకటికోసం

*  * *

నవ్వినప్పుడు పడేసొట్ట
ఏడ్చినప్పుడు పడదెందుకనీ?

***

నొక్కిపట్టడం నీకు తెలిసి
ఎగరడం నేర్పావు.... ఎంతైనా  మెలితిప్పావుగా...

***

రక్త ప్రవాహం పైపైకి
సెన్సెక్స్ సూచిక పడిందిగా...

***

మనిషున్న చోటే కూలబడ్డాడు
నిలుచున్న నేలపై రింగురోడ్డెక్కింది

***

జల్లించడం తెలిస్తే కదా!!
నూకలేవో తెలిసేది!!

Monday 4 June, 2012

ఇక్కడ నది ప్రవహించేది

తెలుగులో బ్లాగులు మొదలయ్యిన తొలినాళ్ళలో  స్నేహమా అనేబ్లాగు అందరినీ మైమరిపించింది
ఈ మధ్య ఎందుకో స్తబ్దమై పోయింది
జ్ఞాపకాలను ప్రోదిచేసుకుంటూ
మళ్ళీ రాధిక గారి రచనలు ప్రవాహమై అందర్నీ తాకలనీ బ్లాగ్ముఖంగా  అభ్యర్థిస్తున్నాను   
 * * * * * *

ఇక్కడ నది ప్రవహించేది
ప్రవహిస్తున్న చోటుల్లో పచ్చదనాన్ని నింపింది
స్నేహమందించిన ప్రవాహం
కూడలిలో సంగమమయ్యేది

పరిమళాల పూలు గుత్తులు గుత్తులుగా వికసించేవి
పరిమళాల్ని వెదక్కుంటూ
ఎన్ని రంగుల తుమ్మెదలు సీతాకోక చిలుకలు
తమరెక్కల్ని ఆడించేవి

ఎందుకో ప్రవహిస్తున్న నది
హఠాత్తుగా  ప్రవాహాన్ని కోల్పోయింది

అప్పగింతలయ్యాక
ఏ పండగకో, పబ్బానికో అథిదిగా వచ్చే ఆడపడచుగానైనా
కన్పించడం లేదు!
ఆంక్షల డాములు తనువంతా కట్టిపడేస్తున్నట్టున్నాయి

బహుశ
నది ఎవ్వరికీ చెప్పకుండా
తన ప్రవాహ దిశను మార్చుకుందేమో!
పరీవాహంలో
పచ్చదనం శాస్వతమని బ్రమసి
ఏర్పడ్డ ఆవాసాలు కళను కోల్పోతున్నాయి
పచ్చదనాల మధ్య
పిట్టలు, వలస పక్షుల పలకరింపులు
కానరాకున్నాయి

నది ఎటైనా వలసపోయిందా?
వలస పోవటం నదికి సాధ్యమా?

బహుశ
సెలయేర్లకు
పారుతున్నవేళ ఒరుసుకున్న నడకల మెళకువలు
నేర్పుతూ నేర్పుతూ
నడకే మర్చి పోయిందా?


నదిలో
స్నాన మాడి దేహమలినాన్ని కడుక్కున్న వారు
దోసిళ్ళతో నీళ్ళు తాగిన వారు
కడవలతో, కావడితో  మోసుకెళ్ళిన వారు
మిలమిల మెరిసిన వెండివెన్నెలలో ఈదులాడిన వారు
ఉనికి ఇచ్చే వూతంకోసం
ప్రవాహంకోసం వెర్రిగా ఎదురుచూస్తున్నారు


ఊరిరందరికీ గొంతు తడిపి
ప్రవాహబంధాన్ని కోల్పోయిన
ఊటబావి జ్ఞాపకంగా మిగిలిపోయింది

వెలుగు కన్నులతో
నీ చుట్టూ బ్రమింపచ్వ్సుకుంటున్న
రవీ.. కవీ...
ఎక్కడైనా తారసపడితే
ఎదురుచూసే మా కళ్ళవాపులను చెప్పవా?

నీవు విహరిస్తున్నప్పుడు
మా దీనావస్థను గమనించి
మేఘమా... నీలిమేఘమా..
చిలకరింపుల పులకరింపుల జల్లులై
నదీ తనువును తడిపిపో !!!


ఎదురుచూపుల దేహాల్నీ
ప్రవాహాల మాటున తడిపిపొమ్మని
మా మాటగా ఎవరైనా సందేశాన్ని
నదికి చెబుతారా??
   ----------------