Wednesday 18 July, 2012

రాజేశ్ ఖన్నా



రాజేశ్ ఖన్నా
********

ఒక దేహం కనుమరుగౌతుంది
కాలంలో తీపి జ్ఞాపకాలే తెరపైకొస్తాయి

జిందగీ ఎక్ సఫర్ హై సుహానా
నాటి నాల్కలపై నడయాడిన గీతలహరి

జ్ఞాపకం రైల్లో ప్రయాణిస్తుంటుంది
తలపు రోడ్డువెంట రైలును వెంబడిస్తుంది

సన్నని మౌతార్గాన్ సంగీతం
పెదాల్లోంచి చెవుల్లోకి ప్రవహిస్తుంది


షర్మిలా, హేమ, ఆశా,  ముంతాజ్
ముచ్చటైన అభినయ జంటలై అలరిస్తుంటారు

లోకులు ఏదొకటి అంటుంటే
ఎవరి మాటలు వారికే వదిలేసిన జీవితం

అచ్చా తో హమ్ చల్తే అంటూ
మళ్ళీరాని చోటు వెదక్కుంటూ ఊపిరి

ఆరాధించిన కళ్ళూ, మనస్సు
అలరించిన చిత్తరువెంట పరుగులు తీస్తుంది

పల్ పల్ దిల్‌కే పాస్
కుచ్ బాతే .. ఉన్ మే సె కుచ్ యాద్ రహజాతేహై!

Thursday 5 July, 2012

చేపలు

బస్సులో వెళుతుంటే
గుప్పుమంటూ ఒక్కసారిగా చేపల కంపు
ఏ చేప ఎలాంటి వాసనొస్తుందో!
ఏ చేప ఎలాంటి రుచినిస్తుందో !
నేనిప్పుడు చెప్పలేను

అమ్మ చేసిన చేపల పులుసు గుర్తొచ్చింది
కొంతకాలం
అమ్మ చేతివంట
తినకుండా బ్రతికేసా!
ఇప్పుడు
అమ్మే లేకుండా బ్రతికేస్తున్నా!
నాసికకు
కంపుకొట్టే చేపలు
జిహ్వకు ఇంపుగా ఎలా మారతాయి!
జతచేసే  మషాలా దినుసులనుకుంటాం
కానీ
కలిపేచేతుల్లో మహిమే లేదంటావా?

***
"కంపుకొట్టే వాటికి
కొన్ని మార్పులుచేస్తే ఇంపవుతాయి " అని సూత్రీకరిద్దామా?
***
మరిప్పుడు
రాజకీయాల మాటేమిటి
పనిచేస్తుందా ఈ సూత్రం?
రాజకీయాల్లేకుండా ఉండలేమేమో!







Wednesday 4 July, 2012

నీతో మాట్లాడానివుంది




పెదవుల కదలికల్లో
ధ్వనించే అంతరంగంతో సంభాషించాలి

సాంకేతిక పనిముట్లు శబ్దాన్నే అంతరీకరిస్తాయి
వ్యవహాళికెల్లిన చేతిస్పర్శ వాటికేం తెలుసు పాపం!

వంటరిరాత్రి మోసుకొచ్చే ధ్వనిచిత్రాలు
భయపెడుతూనో ముద్దాడుతూనో
సమూహాంతర ప్రవాహంలోకి నెట్టేస్తున్నాయి

నలుదిక్కులనుండి విసిరే వలలు

ఎదురెదురాగా వుంటూనే మనం
ముక్కలు ముక్కలుగా విసిరేయబడుతున్నాం

సంభాషణకోసం సమయాన్ని వెదుక్కునేలోగా
ముచ్చటపడ్డ రింగుటోను పాట
ఏదో మూలకు లాక్కెళుతుంది

ఎవ్వరూలేని తరగతి గది ఓమూల బెంచీలో
మనదైన ప్రపంచానికి ఎల్లలుగీస్తూ
ఎన్ని మాటలు ఎన్ని సంభాషణలు

రావిచెట్టుక్రింద ఎంకిపాటలతో
వర్డుస్వత్తు కీట్సుతో కలిపి
రాల్తున్న ఆకుల్ని ఏరుతూ
మారకంలేని చిరునవ్వుతో సంభాషణ కావాలన్పిస్తుందిప్పుడు

అక్షరీకరించలేని ఎన్నో సంభాషణలు
మెమరీనుంచి డిలీట్ అవుతూనేవున్నాయి

కాలానికి ఎదురీదడం కొత్తేమీ కాదు
కాలంలో కలిసిపోవడం పాతా కాదు

మాట్లాడలనే ఆశ
కోర్కై గూడుకట్టడానికి ప్రయాణిస్తుంది
 ------------------------------------------------------
if you wish to call me +91 9912159531 , 9700637732........................ 1.7.2012

Monday 2 July, 2012

జ్ఞాపకం నడక అనుభవం నాదే కదా!


చాలా సంవత్సరాల తర్వాత
ఖైరతాబాద్ వెళ్లాను
కొన్నివీధులు నడుచుకుంటూ తిరిగాను

కళ్ళముందు దాటుకుంతూ వెళ్లిపోయిన
సంవత్సరాల దొంతరను వెదకాలని ప్రయత్నం
యవ్వన రోజులను తనలో దాచుకున్న
శ్యాం, రీగల్ సినిమాలు
శిథిల జ్ఞాపకంగా మిగిలాయి

ఇక్కడే
నా జీవన పోరాటాన్ని
ప్రారంభించడానికి
ప్రింటింగుప్రెస్సులు ఆసరానిచ్చాయి
అవి ఇప్పుడులేకపోవచ్చు
ఆ అనవాళ్ళింకా మిగిలేవున్నాయి
భవనాలు, షాపులు రూపు మార్చుకున్నాయి
బహుశ
యజమానులు మారివుండొచ్చు
వ్యాపారాలేవి మారలేదు
అదే రైల్వేగేటు.
కూరగాయలు, కుండలు, కట్టెలు, మద్యం
ప్రతిసంవత్సరం
ప్రపంచచూపును తనపైకి త్రిప్పుకొనే
గణేషుని పెట్టే చోటు అలాగేవున్నాయి

నన్ను పలకరించేవారు ఎవరూ లేకపోవచ్చు

ఇక్కడెక్కడో శివారెడ్డి తిరిగేవాడట
నల్లగేటుండేదని నందివర్దనం పూసేదని శిఖామణి చెబుతాడు

ఏదీ కనబడదు
అయినా
జ్ఞాపకం నడకే కదా!
అనుభవం నాదే కదా
December 24, 2011