ఈ విశాల క్షేత్రంలో ఓ మూల
నన్ను ఓ చెట్టుగా నాటావు
విత్తేప్పుడు పట్టుకున్న మునివేళ్ళు
ఆ మునివేళ్ళనుంచి ప్రసరించిన
అంతఃఅర్గత ఉద్దీపనం
నాలో దినదిన ప్రవర్ధమానమౌతుంది
ఇక
కమ్మటి ఫలాలనివ్వకుండా ఎలావుండగలను!
"చెట్టు జ్ఞానానికి ప్రతీకే"
* * *
మొక్కకు నీరుపోసినట్లు
నా వేళ్ళు పట్టి
దిద్దించిన అక్షరం
శఖోప శాఖల చెట్టవ్వకుండా ఎలావుంటుంది!
ఎదుగుతున్నదశలో
ఆకారంకోసం చేసిన సన్నద్దం
ఒంకర్లుపోని మార్గాలను చూపుతూ
పదాలకూర్పుతో తినిపించి
పరిపుష్టితమైన నా దేహం
నీ ఆలన, పాలనల రూపమేగా!
శాఖలైన దేహాన్కి
చిగురులిచ్చే ఆలోచనలు
పురిలేని దరాలౌతుంటే
పట్టుదారమైన నిర్ణయాలు
జీవిత పథాన్ని నిర్దేశిస్తున్నాయి
అటు... ఇటు ... కొట్టే
వాతావరణ జాడల్లో
మీరిచ్చిన బలమేదో వేర్లలో కనిపిస్తుంది
నీడనిచ్చే చల్లదనంలో
ఫలమిచ్చే తీపిదనంలో
ఎక్కడో లోలోన
మీ ఊపిరే దాగివుంటుంది
అప్పుడప్పుడూ
ఆకులను రాలుస్తూ
కొమ్మలను పోగొట్టుకుంటూ
విత్తిన, నీరుపోసిన, పాలించిన
హస్తాలు లేకుండానే
పచ్చదనంతో కళకళలాడుతున్నా!
పచ్చదనంవెనుక అనేకానేకాంశాలుంటాయి సుమా!
ఈ పచ్చదనంకోసమే
ఎన్నో తపించిన ఆత్మతో
చేతులు శ్రమించి స్పృశించాయి.
లెక్కించలేని సిరులైన
జీవిత జీవన పథంలో
జ్ఞానాన్ని త్రాగించిన గురువులు
శిరసువంచి నమస్కరిస్తున్నా!!
--------
తారసిల్లిన గురువులను తలపోస్తూ... on Teacher day