Saturday 27 October, 2007

విపత్తుల స్టేషను

చూరున కారుతున్న చినునుకులు
చెదిరిన మేఘం వదిలిన గురుతులు
చినుకు చినుకుతో నా కడవ నిండదు
నా దాహార్తి తీరదు
ఎందరో నులిమేసిన
ఈ గొంతు జీరబోయింది

ఆ గొంతు కిలకిల నవ్వులను
సీరిస్ బల్బుల్లా మెరిసిన జిలుగులు
రెప్పల్లో ఇంకా మెరుస్తున్నాయి

అడుగులో అడుగువేసినందుకు
ప్రకృతికి తలవంచినందుకు
పచ్చని పందిట్లో ఏ కళ్ళో కుట్టినవి
సిగ్నల్ లేని చావ్ రస్తాలో
మృత్యువు రెక్కనీడ
మోర్చవ్యాది మెడలో బిళ్ళలా
మూడు సింహాల మొహర్ లా
పాతబడిన మోర్సుకోడులా
సింధూరాన్ని చెరిపి
వసంతంలో శిశిరాన్ని నింపింది

అందుకే
ఎలుగెత్తి అరవాలని వుంది
దిక్కులు పిక్కటిల్లేలా

కూలిచేసో నాలిచేసో
కంటిపాపగా పెంచి
కలకాలం కళకళలాడాలని
కడుపుకట్టుకొని అప్పుసొప్పుచేసి
కలిగినంతలో ఘనంగా
కళ్యాణంచేసిన తల్లిదండ్రులు
కాస్త తెప్పరిల్లకముందే
కాలచక్రం గిర్రున తిరిగి
ముంగిట్లో ముక్కలై పడింది
ముక్కముక్కలో
విలవిలలాడుతున్న భవిష్యత్తు
చావుబ్రతుకుల మద్య విలవిలలాడుతోది.

అందుకే
ఎలుగెత్తి అరవాలని వుంది
దిక్కులు పిక్కటిల్లేలా

ఆక్యుపంక్చరీ నిపుణిలైనట్లు
మాటలు సూదుల్లా
మాటి మాటికి పొడుస్తుంటే
స్పర్శ మరిచిన పొరనుండి
కారుతున్న రక్తపు సలుపు
గొంతు కడ్డం పడింది

అయినా
ఎలుగెత్తి అరవాలని వుంది
దిక్కులు పిక్కటిల్లేలా

వురకలేసిన నూగుమిసాల యవ్వనంలో
క్షణికమైన ఆనందం
ఏ చీకట్లోనో పెనవేసుకున్ననాగుగా
నా వూహల వూసులను
ఆశల దారంతో అల్లుకొన్న
బ్రతుకు పటానికి కట్టిన తోరణంలో దూరి
ప్రణయమై కాటేసి
విషకన్యగా మిగిల్చింది

అయినా
ఎలుగెత్తి అరవాలని వుంది
దిక్కులు పిక్కటిల్లేలా

ఆశలను సౌధాలుగా
మార్చుకోవాలనీ కూర్చుకోవాలనీ
ఆరాటపోరాటాల నడుమ
అర్థాంతర మలుపుల్లో
అటూ.. ఇటూ పరుగులతో
అనంతానంత దారుల్లో లీనమై
కుప్పకూలిన సౌధాల శిధిలాలో
కుప్పలుగా అప్పులమద్య
కన్నకలలు గాయాలయ్యి
కుంటుపడిన ఒంటరి జీవితపు పోటు

అందుకే
ఎలుగెత్తి అరవాలని వుంది
దిక్కులు పిక్కటిల్లేలా

జీవిత రైలు ప్రయాణంలో
విపత్తుల స్టేషనులో
ఒంటరి బాటసారిని
ఈ టెల్లా తూటాల్లా
అంపశయ్యను చేర్చేలా
ఆశల నేత్రాలతో ఎన్నోచూపులు
ఎక్కుపెట్టి తడిమి తడిమి గుచ్చి గుచ్చి
వుక్కిరిబిక్కిరి చేస్తుంటే

ఇంకా
ఎలుగెత్తి అరవాలని వుంది
దిక్కులు పిక్కటిల్లేలా

భాగ్యరేఖల పరుగుపందెంలో
వూపిరిబిగబట్టి
సత్తువకొద్దీ పరుగెత్తనీ
నాదారులు వెతుక్కోనీ
వూతమిద్దామనుకుంటూ కోతకోయకు
నన్ను నన్నుగా నిలువనీ

----------------------------------------------------
రమేషు, మహేషు అకాల మరణ జ్ఞాపకాలలో