Tuesday, 16 September 2014

సుమభాషితం


~*~

1
 సుతారంగా పూలల్లడం
ఓ కళ
ప్రతిదానికి ఒక సమయం ఉన్నట్టే
పూలల్లడాన్కి ఓ సమయం ఉంది

2
 పరిమళం నిండిన రేకల్ని
మునివేళ్ళతో పట్టుకుని
దారాన్ని ముడివేయడం
ఒకదానివెంటకటి చేర్చడం
కొన్ని చేతులకే సాధ్యం

3
మాటలల్లడం అందరూ నేర్చే విద్యే
మాటల్లో పరిమళాన్ని పొదగడం
ఒక మనసుతో మరో మనసును
కంటికి కనిపించని అనుబంధపు దారంతో
ముడివేయడమే క్లిష్టమైనది

4
పూలబాల పాడిన పాట
అప్పుడప్పుడూ చెవిలో దూరి ‘కరుణ ‘శ్రీని మేల్కొల్పుతుంది
అయినా సంవత్సరలుగా
కోటానుకోట్ల పూలమెడలో ఉరితాళ్ళు బిగుసుకుంటూనే ఉన్నాయి

5
 అన్నట్టు…
ప్రతి అవసరానికి ఏదొక పరికరాన్ని కనిపెట్టిన మనిషి
పూలల్లడానికి యంత్రమో పరికరమో కనిపెట్టాడా?

6
 పూలపరిమళం లాంటి మనుషుల్ని
సుకుమార రేకల్లాంటి మనసుల్ని
వార్ని కట్టివుంచే దారాల్ని
పొత్తిళ్ళకు మెత్తలు సిద్ధంచేసిన చేతుల్ని
బాల్యాన్ని బాల్యమిచ్చిన అనుబంధాల్నీ
దూరం దూరంగా వేళ్ళాడదీయడం
ఇప్పటి కళ్లలో మెరిసే కళ.

7
జీవితంలో
ఒక్కసారైనా పూలల్లడాన్కి ప్రయత్నించాలి.

Published : http://vihanga.com/?p=12737


దర్శిస్తే .....

కొండమీదనుంచి దృష్టిసారిస్తే
సుందరదృశ్యాలు కన్పడతాయి

అక్కడక్కడ కొన్ని కొండలు
నగరాలను చూపిస్తాయి

పాము మెలికలు తిరుగుతూ నడుస్తున్నట్టు
కొన్ని కొండలను తాకుతూ నదులు సాగిపోతాయి
చెట్లాకులతో హరితవస్త్రాన్ని ధరించి హొయలుపోతాయి

నదికి నిశ్చలత్వం లేనట్టే మనసు కూడా
కొద్దిసేపు ఆ నదిలో చేపనై ఈదాలని
ఈది ఈది అలసిన చేపకు రెక్కలొచ్చి
హరిత వస్త్రంపై వాలి సేదదీరాలని ఉవ్విళ్ళూరుతుంది

కొన్ని కొండలు దేవతానిలయాలు
వలయాలు వలయాలుగా చిక్కుకున్న మనిషి
వీటిమధ్య తిరుగుతూ ఉంటాడు

***

కొండలను పిండిచేసే రహస్యాన్ని పసిగట్టిన మనిషి
సొరంగాలు తవ్వి, రోడ్లు పరిచి
తన కనుసన్నల్లోకి తెచ్చుకోవాలనుకుంటాడు
సాధ్యమయ్యిందనుకున్నప్పుడు విర్రవీగుతాడు

తన రహస్యాలను విప్పనివాడు
ఇంకా కొన్ని కొండల రహస్యాలను దాచివుంచుతాడు

........13.9.2014 23:00 hours ISD