Tuesday 15 June, 2010

హసీనా


1
రాయాలని కలం పట్టగానే
రాణి ఈగను మోసుకొచ్చిన తేనెటీగల్లా
ముసిరే ఆలోచనలు
కాస్త కళ్ళుమూస్తే
ఓ అస్పష్టపు రూపం
పదే పదే
మనసు మానిటర్ పై
కదుల్తూ వెంటాడుతోంది
ఆ రూపం
ఎప్పుడూ పోరాడుతూ
మాట్లాడుతోది, ఏడ్పిస్తోంది

2
కీచకుల చూపులమద్య
ఒంటరి యోద్ధ
గాలికి ఎగిరే కాగితపుముక్కల్లా
మాటల కసువులను
వూడుస్తూ, వూడుస్తూ
బరువెక్కిన చీపురులా
మూలచేరి, మునగదీసుకొని
గాయాల గురుతులను
లవణజలంతో తుడుచుకుంటోంది

3
పుండులా మారుతున్న దేహంపై
కారంచల్లుతోన్న అనుమానపు చూపులు

గాలికి కదిలే ఆకులా
ఆజ్ఞల హుక్కాలను పీలుస్తూ
కదలాడే రెక్కలు

పొద్దుగూకులో వొదిగిన సూరీడులా
గుక్కెడు కల్లు ముంతలోదూరి
అలసిన దేహాన్ని మడచిపెడదామంటే
చిల్లరైనా లేని చిరుగుల సంచి

ఎప్పుడైనా ఒక్కసారి
గొంతు తడుపుకుంటే
జలీల్ చేస్తుందని గలీజు మాటలు

4
చెంపలపై చారికల్ని తుడుచుకుంటూ
చిల్లర ఏరుకుంటున్నప్పుడు
చివరి మజిలీకి సాగిపోతున్న
ఎవరిదో దేహంపై
అనుబంధముందనిపిస్తోంది

అన్నవాహికలో ఎర్పడ్డ అల్పపీడనం
తన దేహపు నలుమూలల్నుంచి
తోడుకుంటూపోతున్న
చారికలని ఎవరికి తెలుసు?

ఒక్కసారి గుప్పిటపట్టిన
కాసులుచెప్పే ఊసుల ధైర్యం
కాసేపయినా
పాతబడిన ఎముకలగూడుకు
ప్రాణంపోసి లేపినప్పుడు
కలలా తిరిగిన కాలచక్రం
గూడిస్తామనే వాగ్దానాల హోరు
కళ్ళముందుంచిన స్వప్నాలజోరు
రాలిపోయిన ఆకుల్లా నేతలతీరు
'ప్రభు' వెక్కడా వున్నాడోనని చిన్ని సందేహం?

5

చీకటి నేత్రంలోపడి
కబేళాల కండలుగా దేహాన్ని కోస్తున్న
కత్తుల వుచ్చుల్లో బిగిసి
గిలగిలలాడినప్పుడు
చెదపట్టిన చెట్టులా
శిధిలమౌతున్న యౌవ్వనజీవనాన్ని
ఎవరిదాహార్తికో పానమై

అరుణుడి కంటపడకుండా దాచిన
పరిమళాల మేనికాంతి
తెల్లటితివాచిగా పరవబడి
చిల్లుల దేహంలో జల్లిస్తున్న కాసులు

అప్పుడే ఆత్మీయపు ముసుగులు తీసి
కాసులేరుకుంటూ లెక్కలుచూస్తుంటే
కాసుల అంచులగుండా కారుతూ
ఎర్రటి తివాచిగా మారుస్తోంది .

6
తెరలు తెరలుగా
తెగిపోయిన జ్ఞాపకాలు
తావిజుల్లా వేల్లాడుతున్నాయి
సిగ్గుమొగ్గల ఎర్రదనం
బుగ్గలపై చేరకముందే
మెడకు పసుపుతాడు బిగిసింది

నవ్వితే మేనికో మెరుపొస్తుందని
తెలిసేసరికి
సుందరస్వప్నాల చానళ్ళన్నీ బంద్

నా యవ్వనం నాకిస్తావా?
నవ్వుల నజరానయిస్తా!

7
ఏం ముద్దొచ్చిందో అయ్యకి అమ్మకి
ఊహతెలిసినప్పటికే
ప్రపంచమంతా గొర్రెలతో బర్రెలతో
రోజూ ఉదయసాయంత్రాలు అడవిలోనే
మేకలకు ఆకులందించటమే

చెల్లీతమ్ముళ్ళను లాలించడమే బాల్యం
ఎవరి సంపదకు కాపో తెలియని
అమాయకత్వం నడుమ
నవ్విన యాది లేదు
మరి నా పేరు హసీనా ఎందుకో?

8
ఎప్పుడైనా
హనుమంతుడి వాకిట్లో
సంబరాల వేడుకల్లో కలసి
బస్తీ వీధుల్లో పీర్లవెనక గెంతిన సమయాలు
మసకబారిన అద్దంలో
మసక మసకగా కనపడుతున్నాయి

కుడి ఎడమల వెతుకులాటలో
ఎటునుంచి ఎటుగా తిరిగి
పొగచూరిందో అక్షరం
ఎక్కడా అంటుకున్న నిశానేలేదు

9
నవ్వులను నజరానా చెయ్యాలనివున్నా
ఎప్పుడో దాన్ని
అవసరాల సీసాలో దింపి బిరడావేసి
ఏ పొరలమాటునో పాతేసాను
నే తవ్వలేను ఆపొరల్ని

నవ్వాలని ఆశరేపి
నన్నెందుకు ఏడ్పిస్తున్నావు?

10
అడవి నీతొకటి నేర్చింది
తోసుకుంటూ
పోరాటమే మనుగడని

అందుకే
ప్రతిచోటా కనపడుతోంది
తన కనురెప్పల్ని మూసుకున్నప్పుడు
ప్రశ్నించుకుంటూంది
నేనున్నది అడవికాదుకదా
నేనెందుకు నిశ్శబ్దాన్ని ఆవరించుకోకూడదని

సరే…
అలానే చేస్తాననుకుంటూ
మగత మగతగా జారే నిద్రనుండి
వులికిపడి రెప్పలు తెరవగానే
కళ్ళెదుట అడవిలాంటి లోకం

అందుకే
వూహలను పగులగొట్టటానికి
పెదవులు విప్పుతాది
విప్పిన పెదవుల్ని మూస్తే అడవి మింగేస్తుంది

11
ఆ పెదవిల ధ్వనిలో
నిరంతర సంగీతం వినబడుతోంది
ఆ గొంతు పడే పదే ఓ రాగాన్ని
ఆలపిస్తూ స్వరాలను సరిచూసుకుంటూంది
ఆ రాగం… ఆకలి రాగం

పేదరికాన్ని తంత్రులు చేసి
గోలెవరిదైనా గెలుపెవరిదైనా
ఎవరినో గెలిపించడానికి
తన్నబడే బంతిలా దొర్లుతూ
బాధలను తబలాలుగాచేసి
ఆలపిస్తునే వుంది

ఆ రాగం కార్మికవాడలోని గొట్టంలా
వూరి మురికిని మోసే మోరీతూములో
అనిపిస్తాది

నిరంతర ప్రవాహంగా ఆలపిస్తూ
తన్ను తాను బ్రతికించుకుంటూంది

12
వింటూ.. వూకొడుతూ…
ప్రశ్నా ర్ధకపు చూపులతో అలక పూనింది

అనునయించే అవకాశం యివ్వకుండానే
నా మేలిముసుగుల గురించి
ఓ మాటైనా చెప్పలేదే అంటూంది

మేలిముసుగు అంచులను పట్టిలాగుతుంటే
సలసలకాగి, ఆవిరయ్యిన
స్వేదపు పొదుగు పితుకుతున్నట్లుంది

పాడిపసువులకు కొమ్ములపై కట్టులతో
ఈతలు లెక్కపెట్టినట్లు
నాభినుంచి పాకిన చారికల్ని చూసి
నీ కానుపుల కష్టాన్ని లెక్కించలేను

పలుకు మెతుకుగా వుడికిన దేహాన్ని
పలావుగా మార్చలేను

అహంకారపు చేతులతో
మామిడిపండులా నలిపి నలిపి
నీ నుంచి జుర్రుకుపోయిన
క్షణాలను లెక్కించలేను

కత్తిరించబడ్డ రెక్కల రక్తస్రావాన్ని
స్పర్శించలేను

ఋతుచక్రపు చట్రంలో చెరగానే
నీ నవ్వుల మోముమీద

నీ కదిలే ప్రతి అడుగుమీద
వేస్తున్న
నిఘాల పరదాలు తొలగించలేను

పందులు వీధుల్లో తిరుగుతుంటే
అసహ్యించుకునె వాళ్ళు

పందిలాంటి కోర్కెల పరదాలతో
మీదపడి రక్కిన గాయాలు
కరన్సీ కాగితంతో తుడుస్తుంటే
మూల్గలేని వేదన
కంఠహారాన్ని తెంపలేను