Thursday 7 February, 2008

అలలపై మెరుపుతీగ

శ్రీమతి ప్రేమగా
పలుమార్లు పిలుస్తున్నా
పలుకని పరధ్యానం
పిల్లల ముద్దుపలుకులేవి
తీపిగా రుచించనితనం
టెన్నిస్ తెలియని నాకు
సానియాను ఓడిస్తున్నట్టు

బ్యాటు ఎప్పుడూ పట్టని నేను
సచిన్‌తో కలసి పరుగులుతీస్తున్నట్టు

నారాయణరెడ్డినో
శివారెడ్డినో
అనుసంధానపు దారాలతో
పతంగిలా ఎగరేస్తున్నట్టు

ఎక్కడెక్కడో రగిలి
కమ్ముకుంటున్న చీకట్లతో
ఎండిపోతున్న ఆకలిపేగులో
మెలివేస్తున్న బాధంతా
ఒక్కసారిగా అనుభవిస్తున్నట్టు

అధికవేడిమికి చిట్లిపోయే గాజులా
క్రౌర్యం కర్కశం పెళ్ళున పగిలి
వీధుల్లో పారుతున్న రక్తం
నాపై ప్రవహిస్తున్నట్టు
ప్రవాహంలో కొట్టుకపోయే
దేహపు గాయాల సలుపంతా
నా నరాలలో ఎగబాకుతున్నట్టు

రాలియెండిన ఆకులపై
నడుస్తున్న సవ్వడి వింటున్నట్టు

తపతపమంటున్న బురద దారుల్లో
కాళ్ళపైవస్త్రాన్ని పైకిలాగి
ఆచి తూచి అడుగేస్తున్నట్టు

సుదూరాలనుండి వస్తున్నాననే
ఆప్తులంపిన సందేశంతో
ఆలస్యమైన రైలుకోసం
గడియారపు ముల్లును
పరీక్షిస్తూ నిరీక్షిస్తున్నట్టు

నిద్రరాని రోగిలా
ధ్యానంకుదరని యోగిలా
సీటుదొరకని ప్రయాణికుడిలా
అసహనంగా పచార్లు చేస్తున్నట్టు

రేవులో బడపైనో
అటూ ఇటూ కదిలే వాషింగుమిషన్లోనో
వుతికిన దేహాని పిండుతున్నట్లు

శాఖలుగా విస్తరించిన చెట్టుఆకుల్లోంచి
మెరుస్తున్న సంధ్యలో
ఒక్కవుదుటన
ఎగిరే పక్షుల కోలాహలంలో
నేనో పక్షినై ఎగిరినట్లు

గజ గజ వణికిస్తున్న చలిలో
నెచ్చెలి వెచ్చని కౌగిట్లో బంధిస్తున్నట్లు

సలసల కాగుతున్న ఎసరు
కుతకుతవుడికి గంజివంచిన అన్నం
సెగలుపొగలు కక్కుతున్నట్లు

ఆగి ఆగి కూతవేస్తున్న కుక్కరులా చెవిలో ఏదో కూతలరొద
ఒ అలజడి ఓ బాధ
ఇది జ్వరం కాదు
అక్షరాలను చెక్కుతున్న ఉలి
పదాలను నెమరేస్తున్న అలికిడి
ఉబుకుతున్న జల
ఎగసిపడుతున్న తరంగం

అప్పుడప్పుడూ
ఉలితో నన్ను నేను చెక్కుకుంటాను
జలాలతో తలారా స్నానం చేస్తుంటాను
తరంగాన్ని పట్టుకోవడం కోసం
మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తుంటాను

అప్పుడది
అలలపైన తేలియాడే మెరుపుతీగ
నన్ను స్కానుచేస్తున్న యాంటీ వైరస్
నేటినిజం 11.08.2005