Saturday 10 January, 2009

అంకురాల ఎదురుచూపు ...(శ్రీ మద్దూరి నాగేష్ బాబు స్మరణలో )

నిన్ను కలిసిందీ లేదు
నీతో మాట్లాడిందీ లేదు
పరిచయాల జ్ఞపకాలేవీ లేవు
ఎన్నో ఏండ్ల నిరీక్షణను
పూలదారంలా అల్లి మోసుకొచ్చి
కుదురులా అక్షరానికి చుట్టి
ఎదకు గురిపెట్టి పోయావు
అక్షరగురి నన్ను చుట్టి
నీకాలపు కొలమానంలోకి లాక్కెళుతున్నాయి
నాకాలంలో నిలుపుతున్నాయి
నాకేందుకు కలవలేదు?
అయినా...
డిజిటల్ డిజిటల్ సింఫనీలను
నీ అక్షరంలో వదిలిపోయావు
స్వరించని నా కంఠంలో
కీబోర్డును స్పర్సించలేని నావేలికొనల్లో
ఏదో విద్యుత్ ప్రవాహం
ఇది కొత్త రాగానికి నాందోయి
ఆశలవిత్తనాలకు పొడుచుకొస్తున్న అంకురమోయి
నేస్తం మళ్ళీ రా!
ఎన్నో విత్తనాలు పడివున్నయి
అంకురాలకోసం

జనారణ్యాన్ని ఛేదించుకుంటూ
మైదానాలను విభేదించుకుంటూ రా!

ఎర్రని సూర్యున్ని పుచ్చకాయలా కోస్తా
గొంతు చల్లబరుచుకుందాం

వెలుగురేఖల్ని గుత్తులుగా కోసుకొస్తా
తురుముకుందాం

మరోపూలవనాన్ని స్వప్నిద్దాం

ఏ సాతాను చొరబడని
ఏదేను వనాన్ని పెంచుదాం

(శ్రీ మద్దూరి నాగేష్ బాబు స్మరణలో )