Tuesday, 31 July 2007

కలతర్వాత కల

నీ వూహా చిత్రాన్ని
ఎప్పుడూ కలగంటూండే వాణ్ణి
అయ్యా
నిన్ను చూడాలని
ఎన్ని వసంతాలు వెదికానో
నా పాదం భూమ్మీద పడటమే
నిన్ను లేకుండా చేసిందని
కొందరంటుంటే
కాదని చెప్పడానికే
నిన్ను వెదుకుతుండే వాణ్ణి
మీసం మెలేసి
పంచె పైకెగ్గట్టి
గోసీ బిగించి
దమ్ముచేసిన వయనాలను
పదిలంగా దాచుకున్న
అమ్మ కన్నుల్లోంచి
అప్పుడప్పుడూ
అరక చేతికిచ్చి
పక్కనుండి మేలకువేదో
నేర్పుతున్నట్లనిపించేది
అలా దృశ్యాల్ని తడుముతున్న స్పర్శలోచి
నీవన్న మాటలు
అప్పుడప్పుడూ
అమ్మ గొంతులోచి ధ్వనించేవి
నీ కలకోసం
నన్ను సిద్దంచెయడం కోసం
నలిగిపోయిన అమ్మను
ఎలాదాచుకోవాలో తెలియక
తికమకచెందిన ఆనవాళ్ళెన్నో
అందుకే
అరకను విడిచి
అక్షర సాధన కోసం నడుంబిగించా
ఆరుమైళ్ళైనా నడచి నడచి
అక్షరమేదో గుప్పిటదొరికితే
కొందరు
ఆఫీసరన్నారు, పని పురుగన్నారు
నడుస్తున్న నిఘంటువన్నారు
ఇంకా
నిన్ను అన్వేషిస్తూనే వున్నా
నీ కలకోసం పరుగెడుతూనేవున్నా
ఎవ్వరేమన్నా
నీ కలల పాత్రదారుణ్ణి
నిన్ను వెదుకుత్తున్న వాణ్ణి మాత్రమే !
నీ కలలసాకారం
పిల్లలు తలో కొమ్మై ఎదిగి
అక్షరాలను పత్రాలుగా తొడుక్కొన్నారు
మనవడు విదేశాలకెళుతుంటే
నీ కలను వినువీధుల్లో
ఎగరేస్తున్న ఆనందం
తవ్వుకున్న గతంలో
పొందుకున్నదేదో?
కోల్పోయిందేదో?
పల్లెనుంచి వలస పోయిందేదో?
ఇప్పటికీ అప్పుడప్పుడూ
సలహాలడుగుతున్న నా కొడుకు
ఏ జాములోనో
ఏ తరంగాల్లోంచో
చెవులోదూరి ఆదేశాలిస్తున్న వాడి కొడుకు
ఆలింగనంకోసం వెదకుతున్న కనులు
ఇప్పుడే రాలేకపోతున్నా డాడీ! అంటుంటే
ఆవిష్కృతమౌతున్న మరో కల కోసం
నాన్నా!
నాగలిపట్టాలి
విత్తనాలు నాటాలి
ప్రేమాంకురాలు చూడాలి.
____________________
అనుభవాలమూటలతో
మాముందున్న నాన్న మాటలు నా పదాల్లో
______________
నాయన సంకలనం
నవ్య వారపత్రిక
కవితా వార్షిక 2006