Thursday, 30 August 2007

కంచుకంఠం ముక్కలైయ్యింది


చిత్రం! విచిత్రం జరిగింది

ఎన్నోరాగాలొలికిన

ఓ హార్మోనియం పెట్టె మూగబోయింది

మనసుపొర అడ్డంగా చిరిగింది

దేహాన్ని చీల్చుకొని

గీతకారుని లోకానికి పయనమైపోయింది

రణగొణల మధ్యనుండి

నిశ్శబ్దాన్నవహించిన దేహం!

పిల్లగాలి అలలు అలలుగా

బాధాతప్త హృదయాల పల్లకినెక్కి సాగిపోయింది

ఫిల్ము రీళ్ళుగా మార్మోగిన కంఠధ్వని

ఝణ ఝణ మనిన అక్షరధుని

గోర్వెచ్చని స్పర్శగా

ఎందరినో స్పృశిస్తూ ఎగిరిపోయింది

సమ్మోహితులను చేసిన ఆకాశవాణిలా ఆ కంఠం

కట్టబ్రహ్మన్ ఆవేశశౌర్యాలతో వుత్తేజింపచేసిన ఆ కంఠం

కనురెప్పల జ్ఞాపకాల రీళ్ళలో

లూధర్ ఫర్డ్ ను మరిపించిన ఆ కంఠం

ఎన్నో మహోన్నత వ్యక్తీకరణల సజీవశిల్పం ఆ కంఠం

ఏ తలపుల తలుపుల్ని తట్టినా

పుస్తకాల దొంతరల సాహిత్యలోకంలో వెదికినా

ఏదో ఒక కూడాలిలో వెలిగే దీపస్థంబంగా

మార్మోగుతూనే వుంటుంది ఆ కంఠం

(శ్రీ కొంగర జగ్గయ్య స్మృతిలో )