*
రెండుమనసుల్లోని గూడుకట్టిన దిగులుకు
వంతెన కట్టాలని
ఒకే సీసాలోంచి రెండు గ్లాసుల్లోకి వొంపుకుని
మిక్సర్ పొట్లాం విప్పినట్టు మాటలను విప్పుతాం
పలుగు, పారపెట్టి పెరటిని త్రవ్వినట్టు తవ్వుకుంటాం
**
హఠాత్తుగా కాలేజీలో యదగిల్లినపిల్ల మద్యకొచ్చి వాలుతుంది
కొన్నివూసులు, గిలిగింతలతో ఊరిస్తుండగా
సీసా ఖాళీతనానికి శబ్దం చేసేసరికి
చటుక్కున ఆ పిల్ల ఎటో ఎగిరిపోతుంది.
***
ఒడ్డున ఖాళీగా లంగరేసిన నావ
గాలికి ఊగినట్టు ఊగుతుంటాయన్నీ
ఎక్కడో దాక్కుందనుకున్న దిగులు నావెక్కి తనూ ఊగుతుంటుంది.
అలల భయాన్ని పోగొట్టేందుకు మరో సీసామూత తెరుచుకుంటుంది.
****
వేగిన ముక్కల్లోంచి బయటపడ్డ బొమికలు
లోలోన అణచిన భాధించేవన్నీ చిరవందరౌతుంటాయి
కాళీయైన ప్లేట్లు
తమనెవారైనా శుభ్రంచేస్తారని ఎదురుచూస్తుంటాయి
*****
ఖాళీయైన సీసాలా దేహం దొర్లుతుంటుంది
******
దేన్ని వంపుకున్నామో
దేన్ని నింపుకున్నామో
తడబడుతూ ధీమాగా నడిచెళ్ళేవైపు
రెండుగ్లాసులు అలుపెరుగక అలానేనిల్చుని చూస్తుంటాయి
*******
బహుశ గ్లాసులకు తెలియదు
మళ్ళీ కల్సినప్పుడు ముద్దాడేది వాటినేనని
------------------------------
4.11.2013 రాత్రి 8-10 గంటలమధ్య