Monday, 17 December 2012

ఒకానొక కోరిక




ఓ చిరునవ్వునై
ఆ బుగ్గపై వాలాలని
ఎప్పటినుంచో కోరిక

బాల్యం
ఎరుకలేని తనంలో
కరిగిపోయింది

యవ్వనం
రంగులద్దిన
కలలరెక్కలై వాలింది

కలల రాకుమారుణ్ణై
రెక్కల గుఱ్ఱాలు లేక
ఉన్నచోటునే చతికల పడ్డా

చొట్టబుగ్గకు
కొలమానాలేవో నే కొలుస్తుంటే
ఎవ్వరోపెట్టిన చుక్కతో
ఎగిరిపోయిన పాటయ్యిఎక్కడవాలిందో మరి!

తిరిగిన చక్రంలో పడి
చిర్నవ్వును మరచిన సందర్భమిది

* * *
ఇప్పుడు
తాను ఎదురైతే
అలల తాకిడికి
ఏ తీరంలోకో కొట్టుకుపోయిన కోరిక
అలలపై తేలియాడుతోంది

ఏమి మిగిలిందని నాదగ్గర
కరిగిపోయిన కాలం
నెరిసిన జుట్టుతప్ప


ముడతలు పడ్డ చెక్కిలి వెనుక
దాగినవి
పూసిన పూల నవ్వులు
రాలిని బిందువులు ఎన్నైనా

రెక్కవిప్పిన తుమ్మెదొకటి
అక్కడక్కడే తిరుగుతోంది.