Monday 26 August, 2013

ఇటురా!



అలా ఆరేసిన జ్ఞాపకాలు

మర్చిపోయిన వామనగుంటల్లోని గింజల లెక్క
వాననీటిలోవదిలిన కాగిత పడవల సృజన

పలకపట్టి గెంతుకుంటూ బడికెళ్ళిన వీధులు

చెదిరిపోయిన కలల అంచుల నెమలీకలు
తొక్కుడుబిళ్ళ, కుంటాట,
గోళీలు, గూటీబిళ్ళ
ఏడుపెంకులాట, బచ్చాలు

వొడుపెరిగిన   చేతివాటం
...............చెరువునీటిలో కప్పగంతులైనట్లు
...............కొబ్బరాకు సన్నయిగా మారినట్లు
...............ఎండిన తాటాకుముక్క, తుమ్మముల్లు, జొన్నదంటు గాలిపంఖాగా మారినట్టు

ఆరుబయట వెన్నెలతోటలో
నచ్చినవారి ప్రక్కనచేరి విన్న
రాజకుమారుల సాహసగాధలు, భయపెట్టిన దెయ్యం కథలు

నలుగురు పిల్లల్నిచేర్చి నేర్చిన వేమన పద్యం
* *

పదిలంగా దాచుకున్న మరికొన్ని
మెల్లగా మూటలు మూటలుగా విప్పుదాం

***

గతించించినదేదీ అలానే మిగిలిపోదు
ఒడిసి పట్టుకోవడం, మూట కట్టుకోవడమే మనంనేర్చే గొప్ప విద్య