గాంధీ జయంతంటే
మందు, మాంసం దొరకని రోజని
అప్పట్లో నాకు గుర్తు
దేన్నీ ముందుగా దాచులేదు
కానీ
ఓ వారం ముందుగానే
ఎంత ప్రణాలికని! ఎంత ప్రయాసని!
శెలవుదినాన్ని ఆనందించడానికి
మందుమానేసిన ఇన్నాళ్ళకి
అప్పుడు ఏమి పోగొట్టుకున్నానోనని
ఒకటే ఆలోచన
* * *
రూపాయి మారకం చేస్తున్న ప్రతిసారీ
గాంధీ ఒక్కడినే
ముద్రిస్తారెందుకని అడిగే పిల్లలు గుర్తొస్తారు
ఎవరు దేశానికి ఏమి చేసారు
పదేపదే పిల్లలు ప్రశ్నిస్తుంటే
పారిపోయి
దాచుకున్న మందులో దాక్కునేవాణ్ణి
* * *
అందరూ
గాంధీ వెనుక నడిచిన వాళ్ళు కాదు
వెనుకున్నవారు
చిల్లర నాణాలకే పరిమితమయ్యారు
ఎవరు ఏంచేసారో
రూపాయి మారకంలో ఎలా తెలుస్తుంది
* * *
విగ్రహాల్లా! స్ఫూర్తి దాతల్లా!
కొన్ని అంతే! ఎప్పటికీ నిలిచి ఉంటాయి
* * *
నినాదమై నిలిచిన వారు
నినాదాల్లోనే మిగిలిపోయినట్లా?
మార్గాల మలుపుల్లో
మడంతిప్పని వారు
మరుపుల్లోకి చేరినట్లా!
బూటు కాలిక్రిందో
తుపాకి మడం క్రిందో
రక్తసిక్త మొఖాలను
ఎవరు గుర్తుంచుకుంటారు
* * *
నినాదంలో స్వరమయ్యేందుకు
ఉరికొయ్యకు వ్రేల్లాడే చిహ్నమయ్యేందుకు
నెగడు బాటల్లో నడిచేందుకు
నలుగుర్ని కనలేకపోయానని
ఓ అమ్మ ఆక్రోశిస్తుంది
* * *
ఎవరి అక్షరం
నా వేలినంటుకొని
కలుపుకున్న ముద్దల్లోచేరి
వంటినంటినట్టులేదు!
* * *
ఈ పూటకి నా కడుపునిండింది
ఎవరి కడుపు ఎలావుంటే
నాకేం పని?
గాందీ రూపాన్ని కట్టల్లో దాచేద్దాం!
చిల్లర ఏరుకునేవాళ్ళుంటేనే కదా
గాంధీని దండిగా నడిపించి
దాచుకోవచ్చు, దోచుకోవచ్చు
2 comments:
వావ్....చాలా బాగారాసారండి!
Thank you Padmarpita gaaru
Post a Comment