Saturday, 29 November 2014

ఇంతదూరం నడిచి వచ్చాక - 9

~*~

చల్లుకుంటూవచ్చిన గింజల్ని
వెనక్కు తిరిగి 
మొలకలొచ్చాయో లేదో అని చూడటం కష్టమే

రూపం మార్చుకున్న ఊరిలో 
వదిలివచ్చిన 
బాల్య స్నేహితుల్ని వెతుక్కోవడం కష్టమే కావచ్చు

మానులైనీడనిచ్చే చెట్లుకు    
తన్ను నాటినదెవరో ఎలా తెలుస్తుంది?

**

పొరలపొరల జ్ఞాపకాలనుంచి
ప్రవహించిన నదిపాయొకటి
బాల్యంలో విన్న
సవతితల్లి అడవిలోకి వదిలేసిన  కథను వెంటాడుతుంది
తప్పిపోయిన దారిని వెదకడంలో
తెలియని శక్తొకటి సహకారమందిస్తుంది  
 

పచ్చదనన్నే మోసుకొస్తుందో
ఏడారితనాన్ని ముందుంచుతుందో 

వీచే గాలుల్లో
ముసురేసిన జల్లుల్లో
దీపమొకటి మిణుకు మిణుకుమంటుంది  

**
ఎగిరే జీల్లేడుగింజ దూదిపింజం
దేశాంతరాలలోకి విత్తనాన్ని మోసుకెళ్తుంది

విత్తనం 
నీ పరిమళం నిక్షిప్తంగా దాచివుంచుతుంది 

--------------------------
  28.11.2014 ఇండియా సమయం 14:51 గంటలు

No comments: