Wednesday 26 November, 2014

ఇంతదూరం నడిచి వచ్చాక - 8



~*~
ఏకాంతం అనుకుని 
ఎవ్వరు సడిచెయ్యని చోటొకటి వెదుక్కొని
కూర్చొని
గతం వర్తమానలాల మధ్య చిక్కుకుపోయిన
మాయాజాలాన్ని విదిలించుకొని రావడం కష్టమే కావచ్చు
**
కాలానికి వేసిన గాలపు ఎరను కదుపుతున్నట్లు
ఆకుల మధ్య గాలి కదులుతుంటుంది
కంటికికన్పడని చేపకోసం
మనసు మున్కలువేస్తుంది

**
చిరునవ్వు పులుముకున్న బాల్యమిత్రులు
అవసారాలనవ్వును అతికించుకున్న సహోద్యోగులు
ఎదురెదురుగా కళ్ళెదుట వెళ్ళిపోతుంటారు
నవ్వుల వెనుక రహస్యాలకు
ఉగ్గబట్టిన శ్వాసకు
ఆ క్షణమెంతో దుర్భరమనిపిస్తుంది
**
కదలని స్థితిని చూసి
సాలీడు గూడల్లడం మొదలెడుతుంది
సాలెగూడల్లిక నైపుణ్యమే కావచ్చు
చేచిక్కించుకొనేందుకు మాయాజాలం కూడా
తెలిసీ తెలియక ఇరుక్కున్నవి ఏకాంతంలోనూ వెంటాడతాయి
ఎంతవెదకినా మొదలూ చివరా అంతుపట్టదు
**
సైనౌట్ చేసి సూర్యుడు వెళ్ళిపోయాక
దారి మరచిన పక్షి అరుపుల్లోంచి
ఇల్లు
. .
. .
. .
. .
. .
గుర్తుకొస్తుంది

**
ఏకాంతం రేపటికి వాయిదా పడుతుంది


------------------------------------------------------
26.11.2014 ఇండియా సమయం 23:04 గంటలు

No comments: