Sunday, 11 September 2011

గుర్తొస్తుంటావు



గోచీబిగించి గోదాలో దూకే
పొచిగాడు గుర్తొస్తుంటాడు
గోచితొనే పాచిపొయిన జీవితమది

పెద్ద సంసారాన్ని
సంచిలో మూలికల్తో కలిపి
నిరంతరము మోసే
ఆచారి మాష్టారు గురొస్తుండాడు
తన ఇంటి కష్టానికి మందివ్వలేని
వైద్య రత్నకరమాయన

ఐదుపదుల్లొనూ హుషారుగా ఈలేస్తూ
సైకిలితొక్కే భాషా గుర్తొస్తుంటాడు
బీబిని, బేబీని ఒకే రిక్షాలో
లేబరు రూముకు నడిపించిన వైనమతనిది

పువ్వుల్నో, వెన్నెల్నో జడలొ తురుముకొని
పరువాల సంధ్యవంపులా
గుభాళించిన రాణి గుర్తొస్తూంటూంది
ఎందరినో కాటుకరేఖతో
కొంగున ముడివేసుకున్న పూబోణి

అన్ని వీధుల్లొని
పాడి పశువులను ఏకంచేసి
మేతకోసం ఎక్కడెక్కడో రొజంతా మేపి
చీకటి, వాకిట్లో వాలకముందే
ఎవరి చావిళ్ళకు వాటిని తోలుకెళ్ళే
పాలేర్లు గుర్తొస్తుంటారు
వెట్టితో వట్టిపోయిన జీవితపు ఆనవాళ్ళు

ఉదయాన్ని సాయంత్రాన్ని
పాత వంతెన్నుంచి కొత్తపేటవరకు
పగిలిన మడమల నడచి నడచి
అలసిపోని సత్తవ్వ గుర్తొస్తూంటుంది
ఆకుకూరలతో ఊరిని ముడివేసే ఒంటరిజీవితం

ఎందరో ఎప్పుడో ఒకప్పుడు
ఓ నిముషమైనా గుర్తొస్తుంటారు
జ్ఞాపకాన్ని ముడివేసి
మరింత చేరువౌతారు
* * * *

నీవు మాత్రం

నిత్యం నడుస్తున్న దారిలో
పాదాలకు ఆంక్షలు తొడుక్కుంటావు

కొలతతెల్వక
ఇమడనిపాదాలతో కుస్తీపడ్తుంటావు

కనులు కాంక్షించే
చట్రాలేవో దొరక్క తికమకపడ్తుంటావు

చలవ కళ్ళదాలలో
కన్పించేదంతా నలుపని బ్రమిస్తుంటావు

నీకు నీవే నేస్తానివి
నీకు నీవే శత్రువ్వి

తోడురాని ఆరడుగుల దూరానికి
అనుమానపు కన్నులతో చూస్తుంటావు

ఆంక్షల సలుపుతో
మాట, మనస్సుల తెరనుండి
కొంచెం కొంచెం దూరమౌతూనేవుంటావు
మరెక్కడో నను నిద్రలేపుతుంటావు
                ........................................సాహిత్యనేత్రం - జూలై 2006 (బొమ్మ కరుణాకర్)

3 comments:

కనకాంబరం said...

మీ" గుర్తొస్తుంటావు " ....
వ్యక్తుల వ్యక్తిత్వాల విశ్లేషణ .
వివిధ భావ సంఘర్షణ
యీ క్రింది వ్యక్తీకరణ అద్భుతం

"నీకు నీవే నేస్తానివి
నీకు నీవే శత్రువ్వి

తోడురాని ఆరడుగుల దూరానికి
అనుమానపు కన్నులతో చూస్తుంటావు."...Nutakki Raghavendra Rao(Kanakambaram)

RENUKA AYOLA said...

chala bagundi

జ్యోతిర్మయి said...

చాలా చాలా బావుందండీ జాన్ గారూ..అవును అన్నీ గుర్తొస్తూనే వుంటాయి, తెలియని సంకేళ్ళేవో మనసుని కట్టేస్తు౦టాయ్ విప్పుకోవడం రాని ఆశక్తులం. ధన్యవాదములు.