Tuesday 17 July, 2007

ఓ ఉషోదయం



వెచ్చదనాన్నిచ్చిన దుప్పటితీసి
నిశిరాత్రి మింగేసిన నిద్రనుంచి
బద్దకంగా వళ్ళువిరుచుకుంటుంటే
చురుక్కున తాకిన దృశ్యం
వినీలాకాశం వింతసోయగాల్నిసింగరించుకుంటూ
లేతకిరణాల ప్యాషన్ డిజైన్లతో
కదిలిపోయే మేఘాలు
వయ్యారపు నడకలు నేరుస్తున్నాయి

దూరంలో
బారులు బారులుగా కొంగలు
రెక్కలాడిస్తున్నాయి

దగ్గరలోఇటూ అటూ పోతున్న కాకులు
సౌధాలపైవాలి ఇటో అటో ఎటో
ఎగరాలనిచూసే గువ్వపిల్లలు

చిత్రవర్ణ రాగాలతో
చిత్రంగా ఎగిరే పక్షుల మద్య
రంగుల ఆకాశాన్ని చించి
ఊహ ఆలోచనకు అద్దుకుంటూ
ఎగిరిపోతుంటాను నేనూ ఓ పక్షినై
కొత్త తీరాలకు మరో
కొత్త కిరణన్నందుకోవడానికి
నీతిసూర్యుణ్ణి వెతుక్కుంటూ.

29.9.2004

No comments: