Wednesday 10 September, 2014

కవిత రాయాలని నేను ఎన్నడూ ప్రయత్నించను

ఆలోచనల్ని మడచి
బద్దకంగా రాత్రి నిశ్శబ్దంలోకి జారుకోవాలనుకుంటాను
అనుకుంటాం గానీ
రాత్రి నిశ్శబ్దమైనదేమీ కాదు సుమా!

రాతిపొరల్లోంచి నేలపొరల్లోంచి
ప్రయాణించే ప్రవాహమొకటి మొదలౌతుంది

వరదనీటికి పోటెక్కిన నదీతీరాలను దాటలేక నిస్తేజంగా నిలబడిపోతాను

ప్రవాహాలలో ఈదడం ఓ సాహస కళ

*
చీకటిని ముసుగుగా తెచ్చుకున్న రాత్రి
రోజూ నే నడిచే చోటుల్లోనే భయపెట్టాలని చూస్తుంది

*
పూలకుండీలో కనకాంబరవిత్తనం పగిలిన చప్పుడు

పక్కింటిలో పాలకేడ్చే పసిపిల్లల  ఏడ్పు 

రాత్రిని పెనవేసుకున్న దేహాల శ్వాసలు                     

నిద్రరాని రాత్రినీ
నిర్లక్షానికి గురయ్యే ముసలితనంతో గెలవాలనే మూల్గులు

నిద్రలేపి
ట్రాఫిక్ ఆక్షలు లేని రహదారులగుండా
బ్రేకులేని వాహనంలో కూర్చోబెడుతుంది

అప్పుడే పడుతున్న తుంపర జడివానగా మారుతుంది
అలజడిరేపేందుకు గాలి తోడౌతుంది

ఒక బెదురు
ఒక ప్రకంపన
ఒక సందిగ్దం
లోయలగుండా, వరద ప్రవాహాలగుండా కొట్టుకుపోతున్నట్టే
*
ఒక్కొక్కటిగా
అక్షరాలు ఒదగబడతాయి
*
కనులు తెరిస్తే
తూర్పున వెలుగు రేఖకు
చీకటి ఎలా పారిపోయిందో గుర్తుకు రాదు

ఇక కవితై మీ ముందు కూర్చుంటుంది 
9.9.2014 00:20 hours ISD
******

No comments: