Tuesday 25 September, 2007

వుబికే బిందువుల్లో ఓ నది

(ఎక్స్ రే 2003 _ ఉత్తమ కవిత పురస్కారం డా. మిక్కిలినేని, శ్రీ శివారెడ్డి తదితరులు)

జీవనతీరాలలో

ఓ నది ప్రవహించింది

వురకలు వేసింది

పరవళ్ళు తొక్కింది

ప్రసాంతంగా నడిచింది

మలలమాడ్చిన ఎండల్లో

పొడిబారిన ఇసుకతెన్నెల్లో

సన్ననితీగై సాగింది

ఎడతెరుపెరుగని జల్లుల్లో

ఎదనిండా బురదున్నా

వురికి వురికి పొర్లింది

పాయలుగా రేవులుగా మారి

వురికి వచ్చే దాహార్తులకు

దాహం తీరుస్తూ

ఈతలు నేర్పుతూ

నిరంతర వాహినిగా

ప్రవాహపు నాదాన్ని, ఖేదాన్ని

అంతఃరాల లోతులలో దాచుకొని పారింది

పాఠాలు నేర్పింది

రాదారుల్ని పరచింది

జీవం పోయిందని

గుప్పేడుమట్టితో పూడ్చడానికి

తరలిపోయే ప్రవాహం

తలో పిడికిలితో గుట్టలుచేసినా

నిశ్శబ్దంగా

వుబికే బిందువుల్లో

నిశ్ఛింతగా నిదురోతున్నది

ఎప్పుడో

దోసిళ్ళు దాగిన నీళ్ళు

ఇప్పుడు అదే దోసిళ్ళలో

అశ్రువులై ప్రవహిస్తున్నాయి



ఎక్స్ రే 2003 _ ఉత్తమ కవిత పురస్కారం
విశాలాంద్ర 24.4.2005
జీవనోత్సవం _ సంకలనం

3 comments:

Shashikanth Srivatsava said...

మీ కవిత జీవితాన్నంతటినీ ప్రతిబింబించింది. నిజానికి కవిత కాదు ప్రతిబింబించింది నది... జీవితానికి ప్రతీకగా నదిని చాలా సహజంగా కవిత్వీకరించారు.

"నిశ్శబ్దంగా

వుబికే బిందువుల్లో

నిశ్ఛింతగా నిదురోతున్నది" ఈ భావన నూటికి నూరుపాపాళ్ళూ నా స్థాయికి అందకపోయినా ఏదో అర్థమౌతున్నట్లు... చాలా ఆహ్లాదంగా ఉంది. ఉత్తమ కవిత పురస్కారం రావాల్సిందే.

బ్లాగు మోహంలో పడి మీ సహజత్వంలో నాణ్యతను తగ్గించకండే!

RAMANA YELLAPRAGADA said...

very interesting!!

కెక్యూబ్ వర్మ said...

జీవన నదీ ప్రవాహాన్ని కళ్ళముందుంచారు సార్...ఆ అవార్డ్ కు వన్నెతెచ్చారు....కంగ్రాట్స్...